ఆసియా కప్ 2023 సూపర్ ఫోర్ దశలో టీమిండియా సత్తా చాటిన సంగతి తెలిసిందే. అంతకన్నా ముందు పాక్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్లను ఎదుర్కోలేక ఇబ్బందిపడ్డ రోహిత్ సేన.. సూపర్ ఫోర్ స్టేజిలో దాయాది పేస్ బౌలింగ్‌ను ఉతికి ఆరేసింది. అయితే ఆ వెంటనే జరిగిన శ్రీలంక మ్యాచ్‌లో మాత్రం టీమిండియా బ్యాటర్లు స్పిన్ మాయాజాలానికి చేతులెత్తేశారు. దీనుత్ వెల్లలేగా, చరిత్ అసలంక లాంటి యువ స్పిన్ బౌలింగ్‌కు దాసోహమైంది టీమిండియా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్. ఫలితంగా టీమిండియా ఖాతాలో ఓ చెత్త రికార్డు వచ్చి చేరింది. మొదటిసారి టీమిండియా మొత్తం 10 వికెట్లు స్పిన్నర్ల అకౌంట్‌లో వేసింది. దీంతో టీమిండియా మేనేజ్‌మెంట్‌లో కొత్త భయం పుట్టుకొచ్చింది. స్పిన్‌కు చేతులెత్తేసే రోహిత్ సేనను ఎలా ప్రపంచకప్‌కు సిద్దం చేయాలన్న దానిపై సతమతమవుతోంది.
శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 213 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో రోహిత్ శర్మ 53 పరుగులతో టాప్ స్కోరర్. ఇక లంక యువ స్పిన్నర్లు వెల్లలేగా 5 వికెట్లు, అసలంక 4 వికెట్లు, తీక్షణ ఒక వికెట్ పడగొట్టారు. పిచ్ సహకారం, టీమిండియా బ్యాటర్ల స్పిన్ విషయంలో ప్రణాళిక లేమి.. లంక స్పిన్నర్లకు కలిసొచ్చాయి. ఇక ఇప్పుడు ఈ విషయాలే టీమిండియా మేనేజ్‌మెంట్‌ను ఇబ్బందిపెడుతున్నాయి. టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాటర్లలో గిల్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ.. అలాగే ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా లంక స్పిన్నర్ల ముందు తలవంచారు. కేవలం కెఎల్ రాహుల్ మాత్రం 90 స్ట్రైక్ రేట్‌తో లంక స్పిన్ త్రయాన్ని ధీటుగా ఎదుర్కున్నట్టు జాతీయ మీడియా ఇన్‌సైడర్ స్పోర్ట్స్ ఓ కథనంలో పేర్కొంది.
ఉపఖండంలో డ్రై పిచ్‌లపై ఆడే మనోళ్లు.. లంక నాణ్యమైన స్పిన్ బౌలింగ్ దెబ్బకు కుదేలయ్యారు. పేలవ ఫుట్ వర్క్, పసలేని వ్యూహాలు టీమిండియాకు లోపాలుగా మారాయి. ఇక ప్రపంచకప్ ముందు రోహిత్ సేనకు ఇది పెద్ద తలనొప్పిగా మారనుంది. అసలే భారత్ పిచ్‌లు స్పిన్‌కు హాట్ ఫేవరెట్. ఇలాంటి వాటిపై నాణ్యమైన స్పిన్ బౌలింగ్ చేసే ప్రత్యర్ధులు బరిలోకి దిగితే.. టీమిండియాకు ప్రపంచకప్ గల్లంతే. అందుకే వెంటనే ఈ లోపాలపై దృష్టి సారించింది టీమిండియా మేనేజ్‌మెంట్. మరోవైపు విరాట్ కోహ్లి గత కొన్నేళ్ళుగా ఆఫ్ స్పిన్ ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్నాడు. 2020 నుంచి 44 ఇన్నింగ్స్‌లలో 14 సార్లు ఆఫ్ స్పిన్నర్లకు తన వికెట్ దాసోహం చేశాడు. ప్రపంచకప్‌కు మూడు వారాల టైం మాత్రమే ఉండటంతో.. కోహ్లి ఈ లోపం సరిదిద్దుకుని.. మైదానంలో అదరగొట్టాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.