Rohit Sharma-Virat Kohli: టీ20 తర్వాత వన్డే జట్టుకు కూడా రోహిత్ శర్మ కెప్టెన్‌గా మారాడు. బుధవారం బీసీసీఐ ఒక పెద్ద ప్రకటన చేస్తూ, విరాట్ కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మకు పరిమిత ఓవర్ల ఫార్మాట్ పగ్గాలను అందించింది. విరాట్ కోహ్లి వన్డే జట్టు కమాండ్‌ను వదిలిపెట్టడానికి ఇష్టపడలేదనేది పెద్ద వార్త. అతను 2023 ప్రపంచ కప్‌లో టీమ్ ఇండియాకు నాయకత్వం వహించాలనుకున్నాడు. కానీ, బీసీసీఐ ప్రణాళికలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. నివేదికల ప్రకారం బీసీసీఐ కెప్టెన్సీ నుంచి వైదొలగడానికి విరాట్ కోహ్లీకి 48 గంటల సమయం ఇచ్చారు. అయితే ఈ నిర్ణయంపై ఎలాంటి సమాలోచనలు కోహ్లీ చేయలేకపోయాడు. దీంతో బీసీసీఐ రంగంలోకి దిగి వన్డే కెప్టెన్సీని కోహ్లీ నుంచి లాగేసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.
నాలుగున్నరేళ్ల పాటు టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించిన విరాట్ కోహ్లీకి గౌరవప్రదమైన మార్గం ఇవ్వాలని బీసీసీఐ భావించింది. కానీ, కోహ్లీ బోర్డు చెప్పినా వినలేదు. ఆ తర్వాత అతన్ని కెప్టెన్సీ నుంచి తొలగించారు. విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా చాలా సాధించాడని, అయితే ఐసీసీ ట్రోఫీని గెలవలేకపోయాడనేది వాస్తవం. ఇదే విషయం అతనికి వ్యతిరేకంగా మారిందనే వార్తలు వినిపిస్తున్నాయి. విరాట్ సారథ్యంలో టీమిండియా 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2019 ప్రపంచకప్, 2021 టీ20 ప్రపంచకప్ గెలవలేకపోయింది.
కెప్టెన్‌గా విరాట్ కోహ్లి అద్భుత ప్రదర్శన..
విజయాల విషయానికొస్తే, విరాట్ కోహ్లి భారత్ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ వన్డే కెప్టెన్‌గా నిలిచాడు. విరాట్ కెప్టెన్సీలో, టీమ్ ఇండియా 95 మ్యాచ్‌లలో 65 మ్యాచ్‌లు గెలిచింది. విజయాలు 68 శాతానికి పైగా ఉన్నాయి. విరాట్ కోహ్లి నాయకత్వంలో భారత్ 19 ద్వైపాక్షిక సిరీస్‌లలో 15 విజయాలు సాధించింది. విరాట్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంకలో జరిగిన సిరీస్‌లను టీమిండియా కైవసం చేసుకుంది. కెప్టెన్‌గా విరాట్ కోహ్లి స్థాయి ఏంటో ఈ లెక్కలను బట్టి అర్థమవుతోంది. అంతే కాదు కెప్టెన్‌గా కూడా విరాట్ కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతను 21 సెంచరీలు, 27 అర్ధ సెంచరీలతో సహా 72.65 సగటుతో 5449 పరుగులు చేశాడు. గత 20 ఏళ్లలో, భారత కెప్టెన్లందరి సెంచరీలను కలుపుకుంటే, దాని సంఖ్య కూడా 19 అవుతుంది. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ తనదైన ముద్ర వేశాడని, దీన్ని బహుశా ఎవరూ కాదనలేరని స్పష్టమవుతోంది.
రోహిత్ శర్మ ముందు పెను సవాళ్లు..!
రాబోయే రెండేళ్లు రోహిత్ శర్మకు సవాలుతో కూడుకున్నవి. రోహిత్ శర్మకు దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో మొదటి సవాలు ఏర్పడనుంది. ఇక్కడ అతను విజయంతో ప్రారంభించాలనుకుంటున్నాడు. టీమ్ ఇండియా 2022 సంవత్సరంలోనే ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచ కప్ ఆడాలి. అలాగే 2023 ప్రపంచ కప్ భారతదేశంలోనే ఉంది. ఇక్కడ రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ జోడి టీమ్ ఇండియాను ఛాంపియన్‌గా మారుస్తుందని భావిస్తున్నారు.