Indian Cricket Team: భారత క్రికెట్ జట్టు ఇటీవల వెస్టిండీస్, ఐర్లాండ్‌లలో పర్యటించింది. ఆగస్టు 30న ప్రారంభమయ్యే ఆసియా కప్‌లో పాల్గొనేందుకు త్వరలో శ్రీలంకకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాడు ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. వెస్టిండీస్ పర్యటనలో టీమ్ ఇండియా నుంచి తొలగించబడిన ఆటగాడు ఇప్పుడు విదేశీ జట్టుకు ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈ ఆటగాడు తన కెరీర్‌ను కాపాడుకోవడానికి ఈ కీలక నిర్ణయం తీసుకున్నాడు.
ప్రస్తుతం జరుగుతున్న కౌంటీ ఛాంపియన్‌షిప్ సీజన్‌లో చివరి మూడు మ్యాచ్‌ల కోసం ఎసెక్స్ భారత ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్‌తో ఒప్పందం చేసుకుంది. 35 ఏళ్ల యాదవ్ భారత్ తరపున 57 టెస్టులు, 75 వన్డేలు, తొమ్మిది టీ20లు ఆడి మొత్తం 288 వికెట్లు పడగొట్టాడు. అతను గత సంవత్సరం కౌంటీ ఛాంపియన్‌షిప్ సీజన్‌లో మిడిల్‌సెక్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. జూన్‌లో ది ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన 2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో పాల్గొన్నప్పటి నుంచి ఉమేష్ అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు.
ఎసెక్స్‌కు సైన్ అప్ చేయడం అంటే కౌంటీ సర్క్యూట్‌లో మిడిల్‌సెక్స్, హాంప్‌షైర్, నార్తాంప్టన్‌షైర్‌లతో జరిగే మ్యాచ్‌లకు ఉమేష్ అందుబాటులో ఉంటాడని అర్థం. ఉమేష్ యాదవ్ మాట్లాడుతూ, ‘ఎసెక్స్‌లో చేరడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సంవత్సరం జట్టు విజయానికి కొంత విలువైన సహకారం అందిస్తానని ఆశిస్తున్నాను. నేను గత సీజన్‌లో మిడిల్‌సెక్స్‌తో ఇంగ్లండ్‌లో ఆడటం ఆనందించాను. మళ్లీ ఆ పరిస్థితుల్లో తిరిగి వచ్చి నన్ను పరీక్షించుకోవడం మంచిది. ముఖ్యంగా టైటిల్ రేసులో నిలవాలని కోరుకుంటున్నాను’అని తెలిపాడు.
దేశీయంగా, ఉమేష్ ఫస్ట్-క్లాస్ స్థాయిలో రంజీ ట్రోఫీ, సెంట్రల్ జోన్‌లో దులీప్ ట్రోఫీలో విదర్భకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మొత్తం రెడ్-బాల్ బౌలింగ్ సగటు 29.49లుగా నిలిచింది. వీరితో పాటు ఛెతేశ్వర్ పుజారా, జయదేవ్ ఉనద్కత్‌లు కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో రెండో డివిజన్‌లో ససెక్స్ తరపున ఆడుతున్నారు. ససెక్స్ ప్రస్తుతం 11 మ్యాచ్‌లలో 166 పాయింట్లతో డివిజన్ వన్ పట్టికలో రెండవ స్థానంలో ఉంది. కౌంటీ టైటిల్ రేసులో సర్రే కంటే 17 పాయింట్లు వెనుకబడి ఉంది. ఎసెక్స్ ప్రధాన కోచ్ ఆంథోనీ మెక్‌గ్రాత్ మాట్లాడుతూ, ‘ఉమేష్ మాకు అద్భుతమైన ప్లేయర్. సీజన్‌లో కీలక సమయంలో అతను మా ఆయుధం. అతను చాలా అనుభవజ్ఞుడు. ఒక దశాబ్దం పాటు ఆటలో ఉన్నత స్థాయిలో వికెట్లు తీశాడు. కాబట్టి మాకు అదే సహకారం అందించడంతోపాటు, అతను మా యువ ఆటగాళ్లకు తన జ్ఞానాన్ని అందించాలని మేము ఆశిస్తున్నాం’ అంటూ చెప్పుకొచ్చాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..