
West Indies Record : ఢిల్లీ వేదికగా జరుగుతున్న భారత్ వర్సెస్ వెస్టిండీస్ రెండో టెస్ట్ మ్యాచ్‌లో విండీస్ బ్యాట్స్‌మెన్ చూపించిన పోరాటం టీమిండియాకు చారిత్రక చేదు అనుభవాన్ని మిగిల్చింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ బౌలర్ల ముందు తేలిపోయిన విండీస్, రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతమైన పోరాటపటిమ చూపింది. ముఖ్యంగా, చివరి వికెట్‌కు ఆ జట్టు చేసిన రికార్డు భాగస్వామ్యం భారత బౌలర్ల తల దించుకునేలా చేసింది. సరిగ్గా 42 ఏళ్ల తర్వాత విండీస్ జట్టు భారత్‌లో ఇలాంటి పోరాటాన్ని చూపడం టీమిండియాకు రుచించని రోజుగా నిలిచింది.
ఢిల్లీ టెస్ట్‌లో వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ తమ రెండో ఇన్నింగ్స్‌లో పట్టుదలగా ఆడి, ఇన్నింగ్స్ ఓటమిని తప్పించుకోవడమే కాకుండా, తమ జట్టు స్కోరును భారీగా పెంచారు. విండీస్ జట్టు ఆఖరి వికెట్‌కు ఏకంగా 79 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి 390 పరుగుల స్కోరు సాధించింది. 1983 తర్వాత భారత్ గడ్డపై చివరి వికెట్‌కు 50 పరుగులకు పైగా భాగస్వామ్యం నెలకొల్పడం విండీస్‌కు ఇదే తొలిసారి. 1983లో అహ్మదాబాద్ టెస్ట్‌లో విన్‌స్టన్ డేవిడ్, జెఫ్ డుజోన్ కలిసి 51 పరుగులు చేశారు. ఇప్పుడు ఆ రికార్డును జస్టిన్ గ్రీవ్స్, జేడెన్ సీల్స్ బద్దలు కొట్టారు.
ఈ రికార్డు భాగస్వామ్యంలో జస్టిన్ గ్రీవ్స్ 85 బంతుల్లో నాటౌట్ 50 పరుగులు చేయగా, జేడెన్ సీల్స్ 67 బంతుల్లో 32 పరుగుల విలువైన సహకారం అందించాడు. భారత బౌలర్ల పాలిట ఈ భాగస్వామ్యం చాలా శ్రమతో కూడుకున్నది. అవమానకరమైనది. ఎందుకంటే 2013 తర్వాత భారత్‌లో రెండో ఇన్నింగ్స్‌లో 350 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి విదేశీ జట్టుగా వెస్టిండీస్ నిలిచింది. 2011 తర్వాత భారత్‌పై వెస్టిండీస్ ఇంత భారీ స్కోరు సాధించడం ఇదే మొదటిసారి. భారత్‌పై వెస్టిండీస్ నమోదు చేసిన అత్యధిక 10వ వికెట్ భాగస్వామ్యం కూడా ఇదే కావడం గమనార్హం.
వెస్టిండీస్ చివరి జోడీ భారత బౌలర్లను ఎంతగా ఇబ్బంది పెట్టినా, ఢిల్లీ టెస్ట్ మ్యాచ్ గెలవడానికి టీమిండియాకు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. విండీస్ 390 పరుగులు చేసి భారత్‌కు 121 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ వంటి ఆటగాళ్లు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో జైస్వాల్, గిల్ సెంచరీలు చేయగా, సాయి సుదర్శన్, కేఎల్ రాహుల్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు. రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు అయిన కుల్‌దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా చెరో 3 వికెట్లు తీశారు. మహ్మద్ సిరాజ్ 2, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ చెరో 1 వికెట్ పడగొట్టారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..