ఖాళీగా ఉన్నాడు.. ఆర్థిక సమస్యలు.. పైగా ఫ్రెండ్.. అందుకే పిలిచి ఉద్యోగం ఇచ్చాడు.. నమ్మకంతో మేనేజర్ పోస్టును ఇప్పించాడు. కానీ డబ్బుకు దురాశ ఎక్కువ. అది ఎవరినైనా విడదీస్తుంది. ఇదంతా ఎందుకంటే.. టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ నమ్మిన స్నేహితుడి చేతిలోనే దారుణంగా మోసపోయాడు. ఫ్రెండ్ అని పిలిచి తన మేనేజర్‌గా బాధ్యతలు అప్పగిస్తే ఆస్తి కొనుగోలు పేరుతో అతనికే టోపీ పెట్టాడు. భూమి ఇప్పిస్తానని రూ. 44 లక్షలు కాజేసి.. మెల్లగా జారుకున్నాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న ఉమేశ్ యాదవ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న కొరాడి పోలీసులు నిందితుడి పట్టుకునే పనిలో పడ్డారు. వివరాల్లోకి వెళితే.. నాగ్‌పుర్ కు చెందిన శైలేశ్ థాక్రే, క్రికెటర్ ఉమేశ్ యాదవ్ ఇద్దరూ మంచి స్నేహితులు. ఫాస్ట్ బౌలర్‌గా ఉమేశ్ టీమిండియాలో స్థానం సంపాదిస్తే, శైలేశ్ మాత్రం ఏ ఉద్యోగం లేకుండా ఖాళీగా తిరిగేవాడు. దీంతో అతనిని ఇబ్బందులు చుట్టుముట్టాయి. స్నేహితుడు కష్టాల్లో ఉన్నాడని తెలుసుకున్న ఉమేశ్ అతని జీవితానికో దారి చూపించాలనుకున్నాడు. 2014 జులైలో అతనిని పిలిచి మరీ తన మేనేజర్‌గా నియమించుకున్నాడు. మొదట్లో ఎంతో నమ్మకంగా ఉన్నాడు. ఉమేష్ యాదవ్ ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు, బ్యాంకు ఖాతాలు, ఆదాయపు పన్నులు చెల్లించడం.. ఇలా అన్నీ పనులు దగ్గరుండి మరీ చూసుకునేవాడు.
ఈ నమ్మకంతో ఉమేశ్ యాదవ్ ఒకరోజు తాను నాగ్‌పుర్‌లో భూమి కొనుగోలు చేయాలనుకుంటున్నానని, ఎక్కడైనా ఉంటే చూడమని స్నేహితునికి చెప్పాడు. దీంతో శైలేష్.. కొరాడి పక్కనున్న ఎంఎస్‌ఈబీ కాలనీలో ఓ ప్లాట్ చూపించి.. రూ.44లక్షలకే దాన్ని ఇప్పిస్తానని మాయమాటలు చెప్పాడు. దీంతో ఫ్రెండ్‌ను నమ్మిన ఉమేశ్ యాదవ్ అతని ఖాతాకు రూ. 44 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేశాడు. అంత డబ్బు ఒక్కసారిగా చూసేసరికి శైలేష్‌లో దురాశ ఎక్కువైంది. ఉమేశ్ ఇచ్చిన డబ్బుతో ప్లాట్‌ను కొనుగోలు చేసిన శైలేష్ దానిని ఉమేశ్ పేరుపై కాకుండా తన పేరు మీద రిజిస్టర్ చేయించుకున్నాడు. ఆతర్వాత ఉమేష్ యాదవ్ వ్యహారాలను పట్టించుకోవడం కూడా మానేశాడు. కొన్నాళ్లకు అసలు విషయం తెలిసుకున్న ఉమేష్ యాదవ్ తన డబ్బును తనకు తిరిగి ఇవ్వాలని ఫ్రెండ్‌ను కోరాడు. శైలేశ్ ఆ సొమ్మును తిరిగి ఇవ్వకపోగా, ఆస్తిని అతని పేరున రాయడానికి అంగీకరించలేదు. దీంతో ఉమేశ్ యాదవ్ పోలీసులను ఆశ్రయించాడు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు శైలేశ్ కోసం గాలిస్తున్నారు.
???#CricketTwitter #UmeshYadav pic.twitter.com/A7kTpvBEHO
— Cricket Winner (@cricketwinner_) January 21, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం.. క్లిక్ చేయండి