పొట్టి కప్ సమరం మొదలైంది. టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా సూపర్ 12 స్టేజిలో ప్రధాన జట్లు అన్నీ కూడా యుద్దానికి సిద్దమవుతున్నాయి. ఇందులో భాగంగానే నెట్స్‌లో ప్లేయర్లు బ్యాటింగ్, బౌలింగ్ కఠోర ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాకు చెందిన స్పోర్ట్స్ వెబ్‌సైట్ ‘Foxsports.com.au’ వివిధ జట్లలోని అత్యుత్తమ ఆటగాళ్లను ఎంపిక చేసి టీ20 వరల్డ్‌కప్ ‘టీం ఆఫ్ ది టోర్నమెంట్’గా రూపొందించింది. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్‌లతో పాటు ఆసీస్ బౌలింగ్ త్రయం మిచిల్ స్టార్క్, పాట్ కమ్మిన్స్, జోష్ హజిల్‌వుడ్‌లకు మాత్రం ఈ జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. మరి ఆ టీం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
గతేడాది యూఏఈ వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ను శాసించిన జోస్ బట్లర్ మరోసారి ఆస్ట్రేలియాలోని బౌన్సీ పిచ్‌లపై తన ప్రతాపాన్ని చూపించనున్నాడు. అంతకముందు ఆసీస్‌తో జరిగిన టీ20 సిరీస్ ప్రారంభ మ్యాచ్‌లో జోస్ బట్లర్ అదరగొట్టే హాఫ్ సెంచరీ చేశాడు. అలాగే ఆ తర్వాతి మ్యాచ్‌లోనూ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు. ఒకవేళ ఇదే ఫామ్ కంటిన్యూ అయితే.. బట్లర్‌ను ఆపడం కష్టమే.
గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’గా నిలిచిన వార్నర్.. ఆసీస్‌కు తొలి టీ20 వరల్డ్‌కప్ టైటిల్‌ను అందించాడు. ఓపెనర్‌గా వార్నర్ తన వంతు పాత్ర పోషిస్తే.. కంగారూల జట్టు టాప్ 4లో ఉండటం ఖాయం.
జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి ఆకాశమే హద్దుగా స్కై చెలరేగిపోతున్నాడు. నాలుగు T20Iలలో మూడు అర్ధ సెంచరీలు.. ఆసీస్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఫిఫ్టీ.. ఇలా ఆడింది తక్కువ టీ20 మ్యాచ్‌లైనప్పటికీ.. ర్యాంకింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ టాప్ 10లో చోటు దక్కించుకున్నాడు. స్కై పటాకా అయితే.. టీమిండియా బంపర్ హిటే..
ఎడమచేతి వాటం ఆటగాడైన డెవాన్ కాన్వే గత రెండేళ్లుగా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అంతేకాదు టీ20ల్లో 50 కంటే ఎక్కువ సగటుతో.. అటు బౌన్సీ.. ఇటు స్పిన్ పిచ్‌లపైనా పరుగుల వరద పారించాడు.
టీమిండియాకు బెస్ట్ ఆల్‌రౌండర్ మాత్రమే కాదు.. హార్దిక్ పాండ్యా మ్యాచ్ విన్నర్ కూడా. ఆస్ట్రేలియా పరిస్థితులపై తనకున్న అవగాహనను బట్టి అన్ని విభాగాల్లో రాణించగలడు.
ఈ ఇంగ్లీష్ ఆల్‌రౌండర్‌కు ఆసీస్ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంది. ఇంగ్లాండ్‌కు అదే పెద్ద అసెట్. అలాగే అతడి స్పిన్ బౌలింగ్‌ను తక్కువ అంచనా వేయలేం.
గత ప్రపంచకప్‌లో ఆసీస్‌కు టైటిల్ అందించిన స్టార్ ఆటగాళ్లలో ఒకరు స్టోయినిస్. T20 సిరీస్‌లో ఇంగ్లాండ్‌తో మంచి టచ్‌లో కనిపించాడు.
బౌన్సీ పిచ్‌లపై కగిసో రబాడా అద్భుతంగా రాణిస్తాడు. సఫారీలకు కీలక ప్లేయర్ అయిన రబాడా.. ఆస్ట్రేలియన్ పరిస్థితులకు తగినట్లుగా సిద్దమయ్యాడు.
ఒత్తిడిలో బౌలింగ్ చేయగల సమర్ధత జంపా సొంతం. మిడిల్ ఓవర్లలో జట్టుకు కావాల్సిన టైంలో వికెట్లు తీసి సహాయపడతాడు.
ఎడమచేతి వాటం ఆటగాడు బౌల్ట్.. బంతిని వేగంగా స్వింగ్ చేయగల సామర్థ్యం అతడి సొంతం. ఆస్ట్రేలియా పరిస్థితులలో అతడు అత్యంత ప్రమాదకరం.
బిగ్ బాష్‌లో పటాకా పేల్చిన తర్వాత.. ప్రపంచ కప్‌లో తన మణికట్టు స్పిన్‌తో అలలు సృష్టించేందుకు రషీద్ ఖాన్ సిద్దమయ్యాడు. అలాగే ఆల్‌రౌండర్‌గా జట్టుకు అవసరమైనప్పుడు బ్యాటింగ్‌లో అద్భుతాలు చేయనున్నాడు.
కాగా, ఈ టీం ఆఫ్ టోర్నమెంట్‌పై ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. విరాట్ కోహ్లీ, బాబర్ అజామ్ లేకుండా టీ20 జట్టు లేదంటూ మండిపడుతున్నారు. ఇద్దరూ సరైన ఫామ్‌లో లేనప్పటికీ.. ఈ దిగ్గజాలు జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కచ్చితంగా ఆదుకుంటారని అంటున్నారు.