
T20 World Cup 2026 : బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు ఆ దేశ క్రికెట్ భవిష్యత్తును ప్రమాదంలో పడేశాయి. 2026లో భారత్ ఆతిథ్యమివ్వబోతున్న టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లను భద్రతా కారణాల దృష్ట్యా తాము ఇండియాలో ఆడలేమని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం, బోర్డు భీష్మించుకున్నాయి. ఐసీసీ స్వతంత్ర భద్రతా సంస్థ ద్వారా విచారణ జరిపించి, భారత్‌లో ముప్పు చాలా తక్కువ అని తేల్చినప్పటికీ బంగ్లా వినడం లేదు. ఐసీసీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు 14-2 మెజారిటీతో భారత్‌లోనే మ్యాచ్‌లు జరుగుతాయని తేల్చి చెప్పినా, బీసీబీ ఇప్పుడు ఐసీసీలోని అంతర్గత వివాదాల పరిష్కార కమిటీ (DRC)ని ఆశ్రయించింది.
అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఐసీసీ రాజ్యాంగం ప్రకారం, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నించే అధికారం ఈ కమిటీకి లేదు. అంటే బంగ్లాదేశ్ చేసిన అప్పీల్‌ను ఈ కమిటీ విచారణకు కూడా స్వీకరించదు. ఒకవేళ ఇక్కడ చుక్కెదురైతే స్విట్జర్లాండ్‌లోని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్‌కు వెళ్లాలని బంగ్లాదేశ్ భావిస్తోంది. కానీ అప్పటికే సమయం మించిపోతుండటంతో ఐసీసీ కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకుంది. ఐసీసీ చైర్మన్ జై షా ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నారని, శనివారం లోపు బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను అధికారికంగా ఖరారు చేసే అవకాశం ఉందని సమాచారం.
ఈ వివాదం వెనుక రాజకీయ కారణాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా భారత్ వ్యతిరేకిగా ముద్రపడిన బంగ్లాదేశ్ క్రీడల మంత్రి ఆసిఫ్ నజ్రుల్ ఒత్తిడి వల్లే బోర్డు ఇలా వ్యవహరిస్తోందని వార్తలు వస్తున్నాయి. బీసీబీ అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం బుల్బుల్ ఐసీసీకి సమాచారం ఇవ్వకుండానే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తమ నిర్ణయాన్ని ప్రకటించడంపై ఐసీసీ సభ్యులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. గతంలో పాకిస్థాన్ కూడా ఇలాగే బీసీసీఐపై 70 మిలియన్ డాలర్ల పరిహారం కోసం ఇదే కమిటీని ఆశ్రయించి ఓడిపోయింది. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా అదే బాటలో ప్రయాణిస్తోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో బంగ్లాదేశ్ తన మొండితనాన్ని వీడకపోతే ప్రపంచకప్ ఆడే సువర్ణావకాశాన్ని కోల్పోతుంది. ఇప్పటికే స్టాండ్-బై లో ఉన్న స్కాట్లాండ్ జట్టు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ముస్తాఫిజుర్ రెహమాన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నుంచి తొలగించారని సాకుగా చూపి భారత్‌పై అక్కసు వెళ్లగక్కడం బంగ్లాదేశ్ క్రికెట్‌కే నష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జై షా నేతృత్వంలోని ఐసీసీ దీనిపై రేపో మాపో తుది నిర్ణయం తీసుకుని, బంగ్లాదేశ్‌కు గట్టి షాక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..