Bangladesh : బంగ్లాదేశ్ బరితెగింపు..భారత్ మీద పగతో ఏకంగా ఐసీసీ అధికారికే వీసా నిరాకరణ?

Bangladesh : క్రికెట్ మైదానంలో భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య పోరు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ హీట్ గ్రౌండ్ దాటి బోర్డుల మధ్యకు, ప్రభుత్వాల మధ్యకు చేరింది. టీ20 ప్రపంచకప్ 2026 ముంగిట భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుల మధ్య వివాదం ముదురుతోంది.

Bangladesh : బంగ్లాదేశ్ బరితెగింపు..భారత్ మీద పగతో ఏకంగా ఐసీసీ అధికారికే వీసా నిరాకరణ?
Bcci

Updated on: Jan 17, 2026 | 11:15 AM

Bangladesh : క్రికెట్ మైదానంలో భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య పోరు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ హీట్ గ్రౌండ్ దాటి బోర్డుల మధ్యకు, ప్రభుత్వాల మధ్యకు చేరింది. టీ20 ప్రపంచకప్ 2026 ముంగిట భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుల మధ్య వివాదం ముదురుతోంది. తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక వార్త క్రీడా ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. భారత్‌పై కోపంతో బంగ్లాదేశ్ ఏకంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఉన్నతాధికారికే షాక్ ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది.

ఈ వివాదానికి బీజం ఐపీఎల్ 2026 సీజన్ నుంచి పడింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో, అక్కడి స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ నుంచి తప్పించాలని బీసీసీఐ నిర్ణయించింది. దీనిని అవమానంగా భావించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, అక్కడి ప్రభుత్వం భారత్‌పై ప్రతీకారం తీర్చుకునే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగానే భారత్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు తమ జట్టును పంపేది లేదని బంగ్లాదేశ్ భీష్మించుకు కూర్చుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఐసీసీ రంగంలోకి దిగినా ఫలితం లేకుండా పోతోంది.

అసలు గొడవ ఎక్కడ వచ్చిందంటే.. ఈ ప్రతిష్టంభనను తొలగించడానికి ఐసీసీ ఒక బృందాన్ని బంగ్లాదేశ్‌కు పంపాలని నిర్ణయించింది. అయితే ఐసీసీ సీఈఓ సంజోగ్ గుప్తాకు వీసా ఇచ్చేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం నిరాకరించిందని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. సంజోగ్ గుప్తా భారత పౌరుడు కావడమే దీనికి ప్రధాన కారణమని నెటిజన్లు వాదిస్తున్నారు. ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్ నుంచి పంపేసినందుకు, బదులుగా ఐసీసీలోని భారత అధికారిని తమ దేశంలోకి రానివ్వకుండా బంగ్లాదేశ్ అడ్డుకుందని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఐసీసీ గానీ, బంగ్లాదేశ్ ప్రభుత్వం గానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.

ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు భారత్‌లో జరగాల్సి ఉంది. కానీ భద్రతా కారణాల దృష్ట్యా బంగ్లాదేశ్ సతాయిస్తోంది. ఐసీసీ ప్రతినిధులు బంగ్లాదేశ్ బోర్డుతో చర్చలు జరిపి, భారత గడ్డపై కట్టుదిట్టమైన భద్రత ఉంటుందని భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ బంగ్లాదేశ్ మెండితనం వీడకపోతే, ఐసీసీ కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. క్రికెట్ బోర్డుల మధ్య రాజకీయాలు చొప్పించడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ వీసా వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..