
Brendan Taylor : టీ20 వరల్డ్ కప్ 2026 సమరానికి తెరలేచింది. మొత్తం 20 దేశాల నుంచి దాదాపు 300 మంది మేటి ఆటగాళ్లు ఈ మెగా టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే ఈ 300 మందిలో ఒకే ఒక్కడు చాలా స్పెషల్. 39 ఏళ్ల వయసులోనూ కుర్రాళ్లకు పోటీనిస్తూ, రికార్డుల వేటలో దూసుకుపోతున్న ఆ క్రికెటర్ ఎవరో కాదు.. జింబాబ్వే స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ బ్రెండన్ టేలర్. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2026లో మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి. ప్రతి జట్టులో 15 మంది ఆటగాళ్ల చొప్పున మొత్తం 300 మంది బరిలో ఉన్నారు. కానీ ఈ 300 మందిలో బ్రెండన్ టేలర్ ఎందుకు ప్రత్యేకం అంటే.. 2007లో జరిగిన మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్‌లో ఆడిన ఆటగాళ్లలో, ఇప్పుడు 2026 వరల్డ్ కప్‌లో ఆడుతున్న ఏకైక ఆటగాడు ఇతనే కావడం విశేషం. అంటే దాదాపు 19 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు టీ20 ఫార్మాట్‌లో నిలకడగా రాణిస్తూ, తన ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొంటున్నాడు. ఇది ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఒక అరుదైన గౌరవం.
టేలర్ వరల్డ్ కప్ రికార్డులు
జింబాబ్వే జట్టు ఇప్పటివరకు జరిగిన 10 టీ20 వరల్డ్ కప్ ఎడిషన్లలో 7 సార్లు పాల్గొనగా, టేలర్ అందులో 5 సార్లు జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఇందులో రెండుసార్లు కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించాడు. వయసు మీద పడుతున్నా అతని బ్యాటింగ్ పవర్‌లో ఏమాత్రం మార్పు రాలేదు. గత 4 వరల్డ్ కప్‌లలో ఆడిన 8 మ్యాచ్‌లలో 40.83 సగటుతో 245 పరుగులు చేశాడు. విశేషమేమిటంటే.. ఆడిన 8 మ్యాచ్‌ల్లోనే 4 హాఫ్ సెంచరీలు బాదాడు. అత్యధిక స్కోరు 60 నాటౌట్. ఈ గణాంకాలను చూస్తుంటే టేలర్ కేవలం అనుభవం కోసమే కాదు, పక్కా పర్ఫార్మెన్స్ కోసమే జట్టులో ఉన్నాడని స్పష్టమవుతోంది.
చివరి ప్రపంచకప్ కానుందా?
39 ఏళ్ల ఈ వికెట్ కీపర్ బ్యాటర్ బహుశా తన కెరీర్‌లో ఆఖరి ప్రపంచకప్ ఆడుతున్నాడని విశ్లేషకులు భావిస్తున్నారు. జింబాబ్వే వంటి జట్టుకు టేలర్ లాంటి సీనియర్ ఆటగాడి అనుభవం ఈసారి చాలా కీలకం కానుంది. యువ ఆటగాళ్లతో నిండిన ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో, 19 ఏళ్ల క్రితం నాటి క్రికెట్ జ్ఞాపకాలను, ఇప్పటి ఆధునిక టెక్నిక్స్‌ను కలగలిపి ఆడుతున్న టేలర్ ప్రదర్శన చూడటం ఒక అద్భుతం. ఈ టోర్నీలో అతను మరిన్ని రికార్డులు సృష్టించి తన కెరీర్‌కు ఘనమైన వీడ్కోలు పలకాలని అభిమానులు కోరుకుంటున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి