
T20 World Cup 2026 : క్రికెట్ అభిమానులంతా ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 షెడ్యూల్ ఈరోజు (నవంబర్ 25, మంగళవారం) విడుదల కానుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించబోతున్న ఈ మెగా టోర్నమెంట్ 2026 ఫిబ్రవరి-మార్చి నెలల మధ్య జరగనుంది. ఈ ప్రపంచ కప్ ఈవెంట్‌లలో ఇది 10వ ఎడిషన్. ఈసారి ఏకంగా 20 జట్లు పాల్గొంటుండటం ఈ టోర్నమెంట్ చరిత్రలోనే అత్యధికం.
టీ20 ప్రపంచ కప్ ఫార్మాట్, గ్రూప్స్
ఈ మెగా టోర్నీలో మొత్తం 20 జట్లను నాలుగు గ్రూపులుగా (ప్రతి గ్రూప్‌లో 5 జట్లు) విభజించారు. గ్రూప్ దశలో ప్రతి జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడుతుంది. ప్రతి గ్రూప్ నుంచి టాప్-2 జట్లు సూపర్-8 దశకు చేరుకుంటాయి. సూపర్-8లో ఎనిమిది జట్లను మళ్లీ నాలుగు జట్ల చొప్పున రెండు గ్రూపులుగా విభజిస్తారు. ఆ తర్వాత సెమీ-ఫైనల్స్, ఫైనల్‌తో విజేతను నిర్ణయిస్తారు.
ప్రస్తుత నివేదికల ప్రకారం గ్రూపుల వివరాలు:
గ్రూప్ A: భారత్, పాకిస్థాన్, నెదర్లాండ్స్, నమీబియా, యూఎస్ఏ.
గ్రూప్ B: శ్రీలంక, ఆస్ట్రేలియా, జింబాబ్వే, ఐర్లాండ్, ఒమన్.
గ్రూప్ C: ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్, ఇటలీ.
గ్రూప్ D: దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, యూఏఈ, కెనడా.
హై వోల్టేజ్ మ్యాచ్ ఎక్కడంటే?
ఈ టోర్నీలో అందరూ ఆసక్తిగా ఎదురుచూసే భారత్-పాకిస్థాన్ గ్రూప్ మ్యాచ్‌ను భారత్‌లో కాకుండా శ్రీలంకలో నిర్వహించనున్నారు. రాజకీయపరమైన అంశాల దృష్ట్యా, ఈ మ్యాచ్‌ను తటస్థ వేదికపై నిర్వహించాలని ఐసీసీ నిర్ణయం తీసుకుంది.
వేదికలు, ముఖ్య మ్యాచ్‌లు
ఈ ప్రపంచ కప్ మ్యాచ్‌లు భారత్, శ్రీలంకలోని పలు వేదికల్లో జరగనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం, కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్, ముంబైలోని వాంఖడే స్టేడియం వంటి ప్రధాన స్టేడియాలు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన నరేంద్ర మోడీ స్టేడియంలో టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు.
షెడ్యూల్ ప్రకటన లైవ్ స్ట్రీమింగ్
ఐసీసీ ఈ రోజు (నవంబర్ 25, మంగళవారం) సాయంత్రం 6:30 గంటలకు టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్ రిలీజ్ చేయనుంది. దీనిని స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 2, స్టార్ స్పోర్ట్స్ 3 ఛానెళ్లలో చూడవచ్చు. అలాగే జియో హాట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..