T20 World Cup 2026 : ఆల్‌మోస్ట్ ఫైనల్.. టీ20 వరల్డ్ కప్ 2026 గ్రూప్స్ ఖరారు.. భారత్‌తో పాటు ఆ గ్రూప్‌లో ఉన్న టీమ్స్ ఇవే!

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్‌కు సంబంధించి, ఐసీసీ ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, గ్రూపుల వివరాలు దాదాపు ఖరారయ్యాయి. మొత్తం 20 జట్లు పాల్గొనే ఈ మెగా ఈవెంట్‌ను ఒక్కో గ్రూప్‌లో ఐదు జట్లు ఉండేలా నాలుగు గ్రూపులుగా విభజించారు.

T20 World Cup 2026 : ఆల్‌మోస్ట్ ఫైనల్.. టీ20 వరల్డ్ కప్ 2026 గ్రూప్స్ ఖరారు.. భారత్‌తో పాటు ఆ గ్రూప్‌లో ఉన్న టీమ్స్ ఇవే!
T20 World Cup 2026

Updated on: Nov 22, 2025 | 5:35 PM

T20 World Cup 2026 : క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్‌కు సంబంధించి, ఐసీసీ ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, గ్రూపుల వివరాలు దాదాపు ఖరారయ్యాయి. మొత్తం 20 జట్లు పాల్గొనే ఈ మెగా ఈవెంట్‌ను ఒక్కో గ్రూప్‌లో ఐదు జట్లు ఉండేలా నాలుగు గ్రూపులుగా విభజించారు. ఈ గ్రూపింగ్‌లో ఆతిథ్య దేశమైన భారత్‌కు సాపేక్షంగా సులభమైన గ్రూప్ కేటాయించగా, సహ-ఆతిథ్య దేశమైన శ్రీలంకకు మాత్రం కఠినమైన సవాలు ఎదురుకానుంది.

భారత గ్రూప్ (గ్రూప్ A): భారత్, పాకిస్తాన్, యూఎస్ఏ, నమీబియా, నెదర్లాండ్స్

ఆతిథ్య హోదాలో ఉన్న భారత్‌కు కేటాయించిన గ్రూప్ A లోకి చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ కూడా చేరింది. ఈ గ్రూప్‌లో భారత్, పాకిస్తాన్ మాత్రమే టెస్ట్ హోదా కలిగిన దేశాలు. మిగిలిన మూడు జట్లు.. యూఎస్ఏ, నమీబియా, నెదర్లాండ్స్. కొంత బలహీనంగా ఉండటంతో, టీమిండియా, పాకిస్తాన్‌లు ఈజీగా సూపర్ 8కి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, గ్రూప్ దశలోనే భారత్ vs పాకిస్తాన్ మధ్య జరిగే హై-వోల్టేజ్ మ్యాచ్ కోసం అభిమానులు ఎదురుచూడవచ్చు.

శ్రీలంకకు ఎదురవుతున్న  సవాలు

సహ-ఆతిథ్య దేశమైన శ్రీలంకకు మాత్రం పెద్ద సవాలు ఎదురు కానుంది. గ్రూప్ Bను గ్రూప్ ఆఫ్ డెత్ అని పిలవవచ్చు. ఇందులో ఆస్ట్రేలియా, జింబాబ్వే, ఐర్లాండ్, ఒమన్ వంటి బలమైన జట్లు ఉన్నాయి. ఈ గ్రూప్‌లో మొత్తం నాలుగు టెస్ట్ హోదా కలిగిన దేశాలు ఉండటం, అలాగే అన్ని జట్లూ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్ 20 లో ఉండటం వల్ల శ్రీలంకకు సూపర్ 8కి చేరడం కాస్త కష్టం కావచ్చు.

మిగిలిన గ్రూపులు, సూపర్ 8 ఫార్మాట్

మిగిలిన రెండు గ్రూపుల్లో కూడా పోటీ తీవ్రంగానే కనిపిస్తోంది. గ్రూప్ Cలో ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్‌లతో పాటు ఇటలీ, నేపాల్ ఉన్నాయి. గ్రూప్ Dలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్‌లతో పాటు యూఏఈ, కెనడా ఉన్నాయి. టోర్నమెంట్ ఫార్మాట్ ప్రకారం.. ప్రతి గ్రూప్ నుంచి టాప్ రెండు జట్లు నేరుగా సూపర్ 8 దశకు అర్హత సాధిస్తాయి. ఆ తర్వాత, ఈ 8 జట్లను మళ్లీ రెండు గ్రూపులుగా విభజిస్తారు. ఆ రెండు గ్రూపుల్లోని టాప్ 2 జట్లు సెమీ-ఫైనల్స్‌కు చేరుకుంటాయి. రెండో రౌండ్ (సూపర్ 8) మ్యాచ్‌లు ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

మ్యాచ్ వేదికలు, ఫైనల్

ఈ ప్రపంచ కప్ మ్యాచ్‌లు భారత్, శ్రీలంకలోని ఏడు నగరాల్లో జరగనున్నాయి. భారత్‌లో ముంబై, కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్ నగరాలను వేదికలుగా ఎంపిక చేశారు. అయితే హైదరాబాద్ వంటి నగరాలను జాబితాలో చేర్చలేదు. శ్రీలంకలో కొలంబో, క్యాండీ నగరాల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. ఫైనల్ మ్యాచ్‌ను అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నిర్వహించాలని యోచిస్తున్నారు. ఒక సెమీ-ఫైనల్‌ను కొలంబోలో నిర్వహించడానికి అవకాశం ఉంది.. కానీ పాకిస్తాన్ లేదా శ్రీలంక సెమీస్‌కి చేరుకుంటేనే ఇది సాధ్యమవుతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..