T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ అంపైర్లు వీరే.. భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్ కు గెఫానీ రెడీ

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితమైన చివరి దశకు చేరుకుంది. విశ్వవిజేత ఎవరో తేల్చే సెమీఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. భారత్, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు సెమీస్ రేసులో నిలిచాయి.

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ అంపైర్లు వీరే.. భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్ కు గెఫానీ రెడీ
India Vs England Umpire List

Updated on: Mar 03, 2026 | 1:48 PM

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితమైన చివరి దశకు చేరుకుంది. విశ్వవిజేత ఎవరో తేల్చే సెమీఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. భారత్, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు సెమీస్ రేసులో నిలిచాయి. ఈ కీలక మ్యాచుల కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అంపైర్లు, మ్యాచ్ రిఫరీల జాబితాను అధికారికంగా ప్రకటించింది. అనుభవజ్ఞులైన అంపైర్లతో కూడిన ఎమిరేట్స్ ఐసీసీ ఎలైట్ ప్యానెల్ నుంచి వీరిని ఎంపిక చేశారు.

భారత క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండో సెమీఫైనల్ మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగే ఈ బిగ్ ఫైట్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌కు ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా క్రిస్ గెఫానీ, అలావుద్దీన్ పాలేకర్ వ్యవహరించనున్నారు. థర్డ్ అంపైర్‌గా అడ్రియన్ హోల్డ్‌స్టాక్, ఫోర్త్ అంపైర్‌గా పాల్ రీఫెల్ బాధ్యతలు చేపట్టనున్నారు. మ్యాచ్ రెఫరీగా ఆండీ పైక్రాఫ్ట్ పర్యవేక్షించనున్నారు. విశేషమేమిటంటే, 2024 టీ20 వరల్డ్ కప్‌లో కూడా భారత్ ఇంగ్లాండ్ సెమీఫైనల్‌కు క్రిస్ గెఫానీ అంపైరింగ్ చేశారు.

అంతకంటే ముందుగా, మార్చి 4న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య తొలి సెమీఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, అలెక్స్ వార్ఫ్ ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా ఎంపికయ్యారు. భారత అంపైర్ నితిన్ మీనన్ థర్డ్ అంపైర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించనున్నారు. రాడ్ టక్కర్ ఫోర్త్ అంపైర్‌గా, భారత మాజీ పేసర్ జవగల్ శ్రీనాథ్ మ్యాచ్ రిఫరీగా వ్యవహరించనున్నారు. నితిన్ మీనన్ తన అపారమైన అనుభవంతో థర్డ్ అంపైర్ బాధ్యతను చేపట్టడం విశేషం.

ఈసారి ఐసీసీ అత్యంత జాగ్రత్తగా అంపైర్లను ఎంపిక చేసింది. గతంలో ఇంగ్లాండ్, భారత్ మ్యాచుల్లో అంపైరింగ్ చేసిన అనుభవం ఉన్న వారికే మళ్ళీ బాధ్యతలు అప్పగించారు. ముఖ్యంగా నాకౌట్ మ్యాచుల్లో చిన్న తప్పు దొర్లినా ఫలితం తారుమారయ్యే అవకాశం ఉండటంతో, నిశితంగా పరిశీలించే అంపైర్లకే ప్రాధాన్యం ఇచ్చారు. కోట్లాది మంది కళ్లు ఈ సెమీఫైనల్స్ పైనే ఉన్నాయి. గ్రౌండ్ లో ఆటగాళ్లు ఎంత ఒత్తిడిలో ఉంటారో, కీలక నిర్ణయాలు తీసుకునే అంపైర్లు కూడా అంతే బాధ్యతతో ఉండాల్సి ఉంటుంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us