Virat Kohli: కాలుష్యాన్ని తగ్గించేందుకు విరాట్ కోహ్లీని రంగంలోకి దించండి.. సుప్రీంకోర్టు సూచన

Virat Kohli: ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు విరాట్ కోహ్లీ లాంటి ప్రముఖ క్రికెటర్లతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సుప్రీంకోర్టు సూచించింది. దీపావళి సందర్భంగా బాణసంచా వినియోగంపై దాఖలైన పిటిషన్ల విచారణలో ఈ వ్యాఖ్యలు చేసింది. కాలుష్య నియంత్రణ చర్యలు, గ్రీన్ క్రాకర్స్, అక్రమ విక్రయాలు, మానిటరింగ్ కేంద్రాల పనితీరుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

Virat Kohli: కాలుష్యాన్ని తగ్గించేందుకు విరాట్ కోహ్లీని రంగంలోకి దించండి.. సుప్రీంకోర్టు సూచన
Virat Kohli

Updated on: Oct 30, 2026 | 8:59 AM

Virat Kohli: దీపావళి పండుగ వేళ బాణసంచా కాల్చడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర సమస్యగా మారుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక సూచన చేసింది. కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాల్లో విరాట్ కోహ్లీ లాంటి ప్రముఖ క్రికెటర్ల సేవలను ఉపయోగించుకోవాలని అధికారులకు సూచించింది. ప్రముఖ క్రీడాకారులు, ప్రజల్లో మంచి గుర్తింపు ఉన్న వ్యక్తులు చెబితే వారి మాటలకు ఎక్కువ మంది స్పందించే అవకాశం ఉంటుందని ధర్మాసనం అభిప్రాయపడింది. దీపావళిని వెలుగుల పండుగగా ఆనందంగా జరుపుకోవాలని, బాణసంచా వినియోగాన్ని తగ్గించేలా ప్రచారం చేయాలని సూచించింది. అయితే కోహ్లీ ఈ ప్రచారంలో పాల్గొనడానికి అంగీకరించినట్లు ఎలాంటి సమాచారం లేదు.

కోహ్లీతో ప్రచారం చేయించండి

జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ ప్రసన్న బి.వరాలేతో కూడిన ధర్మాసనం బాణసంచా కాలుష్యంపై దాఖలైన పిటిషన్లను విచారించింది. ఈ సందర్భంగా ప్రముఖ క్రీడాకారులతో ప్రజలకు అవగాహన కల్పించవచ్చని జస్టిస్ వరాలే సూచించారు. ఢిల్లీలో ప్రజలు వినేలా విరాట్ కోహ్లీ లాంటి ప్రముఖ క్రికెటర్లను సంప్రదించాలని జస్టిస్ సుందరేశ్ అభిప్రాయపడ్డారు. దీపావళి వెలుగుల పండుగ అని, దాని అసలు ఆనందాన్ని కాపాడేలా ప్రజలకు సందేశం ఇవ్వాలని సూచించారు. ప్రతి ఏడాది కాలుష్య నియంత్రణపై ఆదేశాలు ఇస్తున్నా, ఉల్లంఘనలు కొనసాగుతుండటంతో అవి కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయన్న ఆందోళనను ధర్మాసనం వ్యక్తం చేసింది.

బాణసంచాతో ఆరోగ్యానికి ముప్పు

బాణసంచా వల్ల గాలిలోకి హానికర వాయువులు, సూక్ష్మ ధూళి కణాలు విడుదలవుతున్నాయని కోర్టుకు వివరించారు. ముఖ్యంగా పీఎం 2.5 కణాలు శ్వాస ద్వారా శరీరంలోకి వెళ్లి రక్తప్రవాహంలో కలిసే ప్రమాదం ఉందని కోర్టుకు సహాయకురాలిగా వ్యవహరిస్తున్న అపరాజితా సింగ్ తెలిపారు. వీటి ప్రభావంతో ఊపిరితిత్తుల ఆరోగ్యం దెబ్బతింటోందని, పిల్లలు, పొగతాగని వారిపైనా ప్రభావం కనిపిస్తోందని వైద్యులు చెబుతున్న విషయాలను ప్రస్తావించారు. గ్రీన్ క్రాకర్స్ పేరుతో అమ్ముతున్న బాణసంచా నిజంగా పర్యావరణానికి తక్కువ హాని కలిగిస్తుందో లేదో నిర్ధారించే వ్యవస్థ బలంగా లేదని వాదించారు. నిజమైన గ్రీన్ క్రాకర్స్ కూడా సాధారణ బాణసంచాతో పోలిస్తే కాలుష్యాన్ని సుమారు 30 శాతం మాత్రమే తగ్గిస్తాయని, పూర్తిగా కాలుష్య రహితమైనవి కావని వివరించారు.

పూర్తి నిషేధం కావాలా?

బాణసంచా తయారీ, అమ్మకాలు, నిల్వపై పూర్తిస్థాయి నిషేధం విధించాలని పిటిషనర్ గోపాల్ శంకరనారాయణన్ కోరారు. బాణసంచా కాలుష్యం ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతోందని, పరిశ్రమలో బాల కార్మికుల వినియోగం, నిల్వ నిబంధనల ఉల్లంఘనలు కూడా ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే తయారీదారుల తరఫున న్యాయవాది జై సాయిదీపక్ మరో వాదన వినిపించారు. పూర్తిస్థాయి నిషేధం అమలు చేయడం సాధ్యం కాదని, దీనివల్ల అక్రమ విక్రయాలు, చైనా బాణసంచా స్మగ్లింగ్ పెరిగే ప్రమాదం ఉందని అన్నారు. నిబంధనలు పాటించని తయారీదారులపై చర్యలు తీసుకోవాలని, అందరిపైనా ఒకేలా నిషేధం విధించడం సరైన పరిష్కారం కాదని వాదించారు.

ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ధర్మాసనం

కాలుష్య నియంత్రణ చర్యల విషయంలో ఢిల్లీ ప్రభుత్వాన్ని కూడా సుప్రీంకోర్టు నిలదీసింది. నగరంలో 39 కాలుష్య పర్యవేక్షణ కేంద్రాలు ఉండగా, వాటిలో కేవలం తొమ్మిది మాత్రమే పనిచేస్తుండటంపై వివరణ కోరింది. అక్రమంగా బాణసంచా అమ్ముతున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? తనిఖీలు ఎలా జరుగుతున్నాయి? అనే వివరాలు అడిగింది. నవంబర్ 1 నుంచి ఢిల్లీలోకి ప్రవేశించే ఇతర రాష్ట్రాల వాహనాలకు బీఎస్-6 ప్రమాణాలు తప్పనిసరి చేసే ప్రణాళిక ఉందని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ట్రాఫిక్ తగ్గించేందుకు ప్రభుత్వ కార్యాలయాల పని వేళల్లో మార్పులు చేశామని, నిర్మాణ ప్రాంతాల దగ్గర యాంటీ స్మాగ్ గన్స్ ఏర్పాటు చేశామని వివరించారు. మొత్తం 608 యాంటీ స్మాగ్ గన్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అయితే బాణసంచా కాల్చేందుకు అనుమతి ఉన్న రోజుల్లో వాయు నాణ్యత సూచీ(AQI) పెరిగిన విషయాన్ని కూడా ప్రభుత్వం అంగీకరించింది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us