T20 World Cup 2026 : బంగ్లాదేశ్-ఐసీసీ వివాదంపై మౌనం వీడిన శ్రీలంక..తటస్థ వైఖరి వెనుక అసలు కారణం ఇదేనట

T20 World Cup 2026 : 2026 టీ20 ప్రపంచకప్‌కు సంబంధించి బంగ్లాదేశ్, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) మధ్య నెలకొన్న వివాదంపై ఎట్టకేలకు శ్రీలంక నోరు విప్పింది. భారత్‌లో మ్యాచ్‌లు ఆడబోమని, తమ వేదికలను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ చేసిన మొండి పట్టుతో ఈ రచ్చ మొదలైంది. చివరకు ఐసీసీ కఠిన నిర్ణయం తీసుకుని బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తప్పించి, ఆ స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చుకుంది. ఈ పరిణామాలపై టోర్నీ సహ-ఆతిథ్య దేశమైన శ్రీలంక తన స్పష్టమైన వైఖరిని ప్రకటించింది.

T20 World Cup 2026 : బంగ్లాదేశ్-ఐసీసీ వివాదంపై మౌనం వీడిన శ్రీలంక..తటస్థ వైఖరి వెనుక అసలు కారణం ఇదేనట
Sri Lanka Stance T20 Wc 2026

Updated on: Jan 30, 2026 | 8:46 AM

T20 World Cup 2026 : ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌కు ముందు క్రికెట్ ప్రపంచంలో పెను ప్రకంపనలు సృష్టించిన బంగ్లాదేశ్ వివాదంపై శ్రీలంక మొదటిసారి స్పందించింది. భారత్‌లో తమకు భద్రత లేదని, తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఐసీసీని కోరిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రతిపాదనను ఐసీసీ తిరస్కరించడమే కాకుండా, మొండిగా వ్యవహరించిన బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచే బహిష్కరించింది. ఈ విషయంలో శ్రీలంక ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదనే సందేహాలకు శ్రీలంక క్రికెట్ సెక్రటరీ బందుల దిశానాయకే సమాధానమిచ్చారు.

“భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న ప్రాంతీయ వివాదాల్లో మేము తలదూర్చాలని అనుకోవడం లేదు. ఈ మూడు దేశాలు మాకు అత్యంత ఆప్తమిత్రులు. అందుకే మేము ఈ విషయంలో తటస్థంగా ఉండాలని నిర్ణయించుకున్నాం” అని బందుల దిశానాయకే స్పష్టం చేశారు. ఒక దేశానికి మద్దతుగా మాట్లాడి మరో దేశంతో సంబంధాలు చెడగొట్టుకోవడం తమకు ఇష్టం లేదని ఆయన మాటల ద్వారా అర్థమవుతోంది. అయితే, భవిష్యత్తులో ఏ దేశమైనా తమ దేశంలో టోర్నీలు నిర్వహించాలని కోరితే మాత్రం తాము సిద్ధంగా ఉంటామని ఆయన ఒక చిన్న హింట్ ఇచ్చారు.

వాస్తవానికి పాకిస్థాన్ కూడా భారత్‌లో ఆడేందుకు నిరాకరించడంతో, ఐసీసీ వారి మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చింది. బంగ్లాదేశ్ కూడా ఇదే తరహాలో మినహాయింపు కోరింది. కానీ ఐసీసీ స్వతంత్ర భద్రతా సంస్థల ద్వారా విచారణ జరిపి, భారత్‌లో బంగ్లాదేశ్‌కు ఎటువంటి ముప్పు లేదని తేల్చి చెప్పింది. దీంతో బంగ్లాదేశ్ వెనక్కి తగ్గకపోవడంతో ఐసీసీ కఠినంగా వ్యవహరించింది. ఈ నిర్ణయంతో బంగ్లాదేశ్ సుమారు 240 కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయే ప్రమాదంలో పడింది.

మరోవైపు, శ్రీలంక స్పోర్ట్స్ మినిస్టర్ సునీల్ కుమార గామగే మాట్లాడుతూ.. టోర్నీ సజావుగా సాగడానికి తాము అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా శ్రీలంకలో జరగబోయే భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లకు అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నట్లు చెప్పారు. విదేశీ ప్రతినిధులకు ఇచ్చే ఎలైట్ కమాండో భద్రతను ఆటగాళ్లకు ఇస్తామని వెల్లడించారు. బంగ్లాదేశ్ వైదొలగడంతో వారి స్థానంలో స్కాట్లాండ్ జట్టు కోల్‌కతా, ముంబై వేదికల్లో తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..