IPL 2026: సన్‌రైజర్స్‌కు బిగ్ షాక్.. టోర్నీ నుంచి ఆ స్టార్ ప్లేయర్ ఔట్.. అతడి ప్లేస్‌లో..

ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ఉత్కంఠభరిత పోరుతో రోజురోజుకూ హీటెక్కుతుంటే, సన్‌రైజర్స్ హైదరాబాద్ క్యాంప్‌లో మాత్రం గాయాల కలకలం మొదలైంది. ఇప్పటికే రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ అందుబాటులో లేక జట్టు బౌలింగ్ తడబడుతుండగా.. తాజాగా ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ బ్రైడన్ కార్స్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమై ఆరెంజ్ ఆర్మీకి బిగ్ షాక్ ఇచ్చాడు.

IPL 2026: సన్‌రైజర్స్‌కు బిగ్ షాక్.. టోర్నీ నుంచి ఆ స్టార్ ప్లేయర్ ఔట్.. అతడి ప్లేస్‌లో..
Srh Player Brydon Carse Ruled Out Of Ipl 2026

Updated on: Apr 15, 2026 | 8:53 AM

ఐపీఎల్ 2026 టోర్నమెంట్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లాండ్‌కు చెందిన ఫాస్ట్ బౌలర్ బ్రైడన్ కార్స్ గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన తొలి మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్‌లో కార్స్ తన కుడి చేతికి తీవ్రమైన గాయం చేసుకున్నాడు. దీంతో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే అతను టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. బ్రైడన్ కార్స్ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యం శ్రీలంకకు చెందిన లెఫ్ట్ ఆర్మ్ పేసర్ దిల్షాన్ మధుశంకను ఎంచుకుంది. రూ.75 లక్షల ధరకు మధుశంకను జట్టులోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. 25 ఏళ్ల ఈ యువ బౌలర్‌కు అంతర్జాతీయ స్థాయిలో మంచి అనుభవం ఉంది. శ్రీలంక తరఫున మూడు ఫార్మాట్లలోనూ ఆడుతున్న మధుశంక, తన స్వింగ్ బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టగలడు. త్వరలోనే అతను ఆరెంజ్ ఆర్మీ క్యాంప్‌లో చేరనున్నాడు.

బౌలింగ్‌లో అనుభవ లోపం

హైదరాబాద్ జట్టును ప్రస్తుతం గాయాల సమస్య వేధిస్తోంది. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఇంకా గాయం నుంచి కోలుకోకపోవడంతో జట్టు బౌలింగ్ విభాగం బలహీనంగా కనిపిస్తోంది. ప్రస్తుతం కమిన్స్ గైర్హాజరీలో ఇషాన్ కిషన్ జట్టును నడిపిస్తున్నాడు. సీనియర్ బౌలర్లు జయదేవ్ ఉనద్కత్, హర్షెల్ పటేల్ ఆశించిన స్థాయిలో వికెట్లు తీయలేకపోవడం జట్టుకు ఆందోళన కలిగిస్తోంది. అయితే రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో యువ బౌలర్లు ప్రఫుల్ హింజ్, షకీబ్ హుస్సేన్ అద్భుత ప్రదర్శన చేశారు. వీరిద్దరూ కలిసి 8 వికెట్లు పడగొట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయినప్పటికీ, డెత్ ఓవర్లలో అనుభవజ్ఞుడైన బౌలర్ లేకపోవడం, జట్టులో క్వాలిటీ స్పిన్నర్ కొరత స్పష్టంగా కనిపిస్తోంది.

మధుశంక రాకతో రాత మారుతుందా?

శ్రీలంక తరఫున 28 వన్డేలు, 19 టీ20లు ఆడిన మధుశంక చేరికతో SRH బౌలింగ్ లైనప్‌కు కొత్త బలం చేకూరుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా పవర్ ప్లేలో వికెట్లు తీయడంలో మధుశంక దిట్ట. మరి ఈ శ్రీలంక స్పీడ్‌స్టర్ రాకతోనైనా హైదరాబాద్ జట్టు మళ్లీ విజయాల బాట పడుతుందో లేదో చూడాలి.

Follow Us