- Telugu News Sports News Cricket news Smriti Mandhana Was out Early Again India Women vs Pakistan Women ICC Women's World Cup 2025
INDW vs PAKW: దాయాదుల పోరులో నిరాశపరిచిన లేడీ కోహ్లీ.. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విఫలం..!
Team India: ముఖ్యమైన ఐసీసీ టోర్నీలలో మంధాన తరచుగా తడబడటం, ద్వైపాక్షిక సిరీస్‌లలో మాత్రమే అద్భుతంగా రాణించడంపై విమర్శకులు మళ్లీ గళం విప్పుతున్నారు. భారత జట్టు ప్రపంచకప్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే, మంధాన లాంటి స్టార్ ప్లేయర్ వెంటనే ఫామ్‌లోకి రావడం అత్యవసరం. ప్రస్తుత వైఫల్యం తర్వాత, రాబోయే మ్యాచ్‌లలో ఆమె ఏ విధంగా రాణిస్తుందో చూడాలి.
Updated on: Oct 05, 2025 | 7:36 PM

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో దాయాదులైన భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన కీలక మ్యాచ్‌లో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన మరోసారి తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరి అభిమానులను నిరాశపరిచింది. టోర్నమెంట్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఆమె విఫలం కావడం టీమిండియా శిబిరంలో ఆందోళన కలిగిస్తోంది.

శ్రీలంకలోని కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. భారత ఇన్నింగ్స్ ఆరంభంలో ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) ఆత్మవిశ్వాసంతో కనిపించినప్పటికీ, తన ఇన్నింగ్స్‌ను పెద్ద స్కోరుగా మలచలేకపోయింది.

32 బంతుల్లో 4 ఫోర్ల సహాయంతో 23 పరుగులు మాత్రమే చేసిన మంధాన, పాకిస్తాన్ కెప్టెన్, పేసర్ ఫాతిమా సనా బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగింది. ఫాతిమా సనా వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమైన మంధాన ప్యాడ్లను తాకగా, అంపైర్ ఔట్ ప్రకటించారు. కీలక సమయంలో ఆమె వికెట్ కోల్పోవడం పాకిస్తాన్‌కు పెద్ద ఉపశమనాన్ని ఇచ్చింది.

ఈ ప్రపంచ కప్‌లో శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో కూడా మంధాన పరుగులు చేయడంలో విఫలమైంది. ఆ మ్యాచ్‌లో కేవలం 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరింది. ప్రపంచకప్‌నకు ముందు ఆస్ట్రేలియాపై వరుసగా రెండు సెంచరీలు చేసి అత్యద్భుత ఫామ్‌లో ఉన్న మంధాన.. ప్రపంచ కప్‌లో మాత్రం ఆ జోరును కొనసాగించలేకపోవడం జట్టుకు ప్రతికూలంగా మారింది.

భారత బ్యాటింగ్ లైనప్‌లో మంధాన అత్యంత కీలకమైన ప్లేయర్. ఆమె క్రీజ్‌లో నిలబడితే, మిగతా బ్యాటర్లపై ఒత్తిడి తగ్గుతుంది. కానీ, ముఖ్యమైన ఐసీసీ టోర్నీలలో మంధాన తరచుగా తడబడటం, ద్వైపాక్షిక సిరీస్‌లలో మాత్రమే అద్భుతంగా రాణించడంపై విమర్శకులు మళ్లీ గళం విప్పుతున్నారు. భారత జట్టు ప్రపంచకప్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే, మంధాన లాంటి స్టార్ ప్లేయర్ వెంటనే ఫామ్‌లోకి రావడం అత్యవసరం. ప్రస్తుత వైఫల్యం తర్వాత, రాబోయే మ్యాచ్‌లలో ఆమె ఏ విధంగా రాణిస్తుందో చూడాలి.




