
Smriti Mandhana : భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన తన జట్టు లక్ష్యాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేవలం విజయాలు అందుకోవడమే కాకుండా, ప్రపంచ క్రికెట్‌పై భారత్ తన ఆధిపత్యాన్ని శాశ్వతంగా నిలబెట్టుకోవాలని ఆమె ఆకాంక్షించారు. గతేడాది తొలిసారిగా వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడిన టీమిండియా, ఇప్పుడు ఈ ఏడాది చివర్లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌పై కన్నేసింది. బలమైన ఆస్ట్రేలియా జట్టును వారి సొంత గడ్డపైనే టీ20 సిరీస్‌లో మట్టికరిపించి, మెగా టోర్నీకి భారత్ ఘనమైన ఆరంభాన్ని ఇచ్చింది.
బీసీసీఐ టీవీతో మాట్లాడిన మంధాన, జట్టులో వస్తున్న మార్పుల గురించి వివరించారు. “ఈ భారత జట్టు నిలకడగా రాణించడమే లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో ఎవరిని ఓడించాం, ఏ జట్టుపై గెలిచాం అన్నది ఇప్పుడు మాకు ముఖ్యం కాదు. మేము ఒక పరివర్తన దశలో ఉన్నాం. ఎక్కడ ఆడుతున్నాం, ఎవరితో ఆడుతున్నాం అన్నది పక్కన పెడితే.. ప్రతి ప్రత్యర్థిపై విజయం సాధించి, ప్రపంచ క్రికెట్‌లో అగ్రస్థానంలో కొనసాగాలని కోరుకుంటున్నాం” అని ఆమె ధీమా వ్యక్తం చేశారు. గత విజయాల కంటే భవిష్యత్తులో సృష్టించబోయే రికార్డులే తమకు ముఖ్యమని ఆమె స్పష్టం చేశారు.
ఆస్ట్రేలియాతో జరిగిన నిర్ణయాత్మకమైన మూడో టీ20లో మంధాన విధ్వంసం సృష్టించారు. కేవలం 82 పరుగులతో ప్రత్యర్థి బౌలర్లను ఉతికి ఆరేశారు. మరోవైపు జెమీమా రోడ్రిగ్స్(59)తో కలిసి 121 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరి ధాటికి భారత్ నిర్ణీత ఓవర్లలో 176 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 159 పరుగులకే పరిమితమైంది. ఈ సందర్భంగా అడిలైడ్ నగరం గురించి మాట్లాడుతూ.. “నాకు అడిలైడ్ అంటే చాలా ఇష్టం. ఇది ఆస్ట్రేలియాలోనే అత్యంత అందమైన, ప్రశాంతమైన నగరం” అని మంధాన సరదాగా వ్యాఖ్యానించారు.
ఈ ఏడాదిని టీ20 నామ సంవత్సరంగా స్మృతి అభివర్ణించారు. జూన్ 12 నుండి జూలై 5 వరకు ఇంగ్లాండ్, వేల్స్ వేదికలుగా మహిళా టీ20 ప్రపంచకప్ జరగనుంది. గతేడాది వన్డేలపై దృష్టి పెట్టిన టీమిండియా, ఇప్పుడు టీ20 ఫార్మాట్‌కు తగ్గట్లుగా తన ఆటను మెరుగుపరుచుకుంటోంది. ప్రపంచకప్ కోసం అత్యుత్తమ 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేసే పనిలో మేనేజ్మెంట్ ఉంది. ముఖ్యంగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వల్ల యంగ్ ప్లేయర్లు ఒత్తిడిని తట్టుకుని మెరుగైన ప్రదర్శన చేసేందుకు ఎంతో సహాయపడిందని మంధాన పేర్కొన్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..