Smriti Mandhana : స్మృతి మంధాన డబుల్ హిస్టరీ.. అత్యంత ఫాస్టెస్ట్ వన్డే సెంచరీతో పాటు మరో రెండు రికార్డులు బ్రేక్

మొహాలీలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండవ వన్డే మ్యాచ్‌లో, భారత మహిళల జట్టు ఓపెనర్ స్మృతి మంధాన అద్భుతమైన సెంచరీ సాధించింది. ఇది ఆమెకు 12వ వన్డే సెంచరీ. కేవలం 77 బంతుల్లో ఈ సెంచరీని పూర్తి చేసి, భారత మహిళల క్రికెట్‌లో రెండవ వేగవంతమైన సెంచరీ సాధించిన రికార్డును తన పేరున లిఖించుకుంది.

Smriti Mandhana : స్మృతి మంధాన డబుల్ హిస్టరీ.. అత్యంత ఫాస్టెస్ట్ వన్డే సెంచరీతో పాటు మరో రెండు రికార్డులు బ్రేక్
Smriti Mandhana

Updated on: Sep 18, 2025 | 11:18 AM

Smriti Mandhana : సెప్టెంబర్ 17న మొహాలీలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండవ వన్డే మ్యాచ్‌లో భారత మహిళల జట్టు ఓపెనర్ స్మృతి మంధాన అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె కేవలం 77 బంతుల్లోనే సెంచరీ సాధించి, భారత మహిళా క్రికెట్‌లో రెండవ ఫాస్టెస్ట్ వన్డే సెంచరీని తన పేరున లిఖించుకుంది. ఈ రికార్డుతో పాటు ఆమె మరో రెండు పెద్ద రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో ఐర్లాండ్‌పై 70 బంతుల్లో చేసిన సెంచరీ ఇప్పటికీ ఆమెదే అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు.

ఒకే సంవత్సరంలో అత్యధిక పరుగులు

ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో, స్మృతి మంధాన ఒక క్యాలెండర్ సంవత్సరంలో భారత మహిళా బ్యాటర్ అత్యధిక పరుగులు చేసిన రికార్డును అధిగమించింది. ఇంతకుముందు ఈ రికార్డు 2017లో దీప్తి శర్మ పేరు మీద ఉంది. దీప్తి శర్మ 20 మ్యాచ్‌లలో 787 పరుగులు చేసింది. అయితే, స్మృతి మంధాన కేవలం 13 మ్యాచ్‌లలోనే 803 పరుగులు చేసి ఈ రికార్డును బద్దలు కొట్టింది. స్మృతి మంధాన ఈ ఏడాదిలో ఇప్పటికే 3 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు చేసింది. ఇది ఆమె ఫామ్‎కు నిదర్శనం. ఈ జాబితాలో మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్ వంటి దిగ్గజాలు కూడా ఉన్నారు.

ఆస్ట్రేలియాపై సెంచరీల రికార్డు

మంధాన ఆస్ట్రేలియా వంటి స్ట్రాంగ్ జట్టుపై సెంచరీ చేసి, తన టాలెంట్ మరోసారి నిరూపించుకుంది. ఈ సెంచరీతో ఆమె ఆస్ట్రేలియాపై అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన ఆసియా బ్యాటర్‌గా నిలిచింది. ఆమె ఇప్పుడు ఈ జాబితాలో న్యూజిలాండ్ బ్యాటర్ సుజీ బేట్స్‌తో సమానంగా ఉంది. ఈ జాబితాలో ఇంగ్లాండ్ కెప్టెన్ నాట్ సైవర్-బ్రంట్ 4 సెంచరీలతో మొదటి స్థానంలో ఉంది. స్మృతి మంధాన ఆస్ట్రేలియాపై ఎక్కువ సెంచరీలు సాధించిన ఎనిమిదవ బ్యాటర్‌గా కూడా రికార్డు సృష్టించింది. ఈ ఘనత ఆమెకు వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో మళ్లీ నంబర్ 1 స్థానానికి చేరుకోవడానికి కూడా సహాయపడింది.

మ్యాచ్ హైలైట్స్

భారత జట్టు మొదట బ్యాటింగ్‌కు దిగగా, స్మృతి మంధాన మొదట నెమ్మదిగా ఆడినా ఆ తర్వాత తన దూకుడు పెంచింది. 16వ ఓవర్లో లెగ్ స్పిన్నర్ జార్జియా వేర్‌హమ్ బౌలింగ్‌లో ఒక భారీ సిక్స్ కొట్టి 45 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకుంది. ఆ తర్వాత 29వ ఓవర్లో టాలియా మెక్‌గ్రాత్ బౌలింగ్‌లో బౌండరీ కొట్టి సెంచరీని పూర్తి చేసింది. ఈ సెంచరీ ఆమె క్రికెట్ కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోయింది. స్మృతి మంధాన దూకుడు, స్థిరత్వం, సామర్థ్యం భారత మహిళల క్రికెట్‌కు ఒక గొప్ప బలం అని చెప్పవచ్చు.

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..