U-19 T20 World Cup: అదరగొట్టిన అమ్మాయిలు.. అండర్‌ 19 వరల్డ్‌కప్‌లో టీమిండియా శుభారంభం.. సఫారీలు చిత్తు

|

Jan 14, 2023 | 9:24 PM

అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. షెఫాలీ వర్మ సారథ్యంలోని మహిళల జట్టు తమ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికాను 7 వికెట్ల తేడాతో సులభంగా ఓడించింది. సఫారీలు విధించిన 167 పరుగుల టార్గెట్‌ను కేవలం16.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది టీమిండియా.

U-19 T20 World Cup: అదరగొట్టిన అమ్మాయిలు.. అండర్‌ 19 వరల్డ్‌కప్‌లో టీమిండియా శుభారంభం.. సఫారీలు చిత్తు
Team India
Follow us on

అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. షెఫాలీ వర్మ సారథ్యంలోని మహిళల జట్టు తమ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికాను 7 వికెట్ల తేడాతో సులభంగా ఓడించింది. సఫారీలు విధించిన 167 పరుగుల టార్గెట్‌ను కేవలం16.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది టీమిండియా. ఓపెనర్లు శ్వేతా సెహ్రావత్‌ 57 బంతుల్లో 92 నాటౌట్‌ (20 ఫోర్లు), షెఫాలీ వర్మ 16 బంతుల్లో 45 ( 9 ఫోర్లు, సిక్సర్‌) చెలరేగి ఆడారు. మొదటి వికెట్‌ కు 7.1 ఓవర్లలోనే 77 పరుగులు జోడించారు. ఆతర్వాత షెఫాలీ ఔటౌనా దూకుడును కొనసాగించింది శ్వేత. వరుస బౌండరీలతో సఫారీ బౌలర్లను చిత్తు చేసింది. ఆ తర్వాత తెలంగాణ అమ్మాయి త్రిష (15), సౌమ్య తివారి (10), సోనియా (1 నాటౌట్‌) మిగతా పనిని పూర్తి చేశారు. బెనోని వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ సేమర్ లారెన్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. కేవలం 44 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌తో 61 పరుగులతో జట్టుకు శుభారంభం అందించింది. వీరితో పాటు మిడిలార్డర్‌లో మాడిసన్ లాండ్స్‌మన్ (32), కరాబో మాసియో (19), మియానే స్మిత్ (16) వేగంగా పరుగులు చేశారు. కెప్టెన్ షెఫాలీ వర్మ 4 ఓవర్లలో 31 పరుగులిచ్చి 2 వికెట్లు తీసి దక్షిణాఫ్రికాను కట్టడి చేసింది.

ఓపెనర్ల విధ్వంసం..

ఇక లక్ష్య ఛేదనలో టీమిండియా ఓపెనర్లు చెలరేగారు. మొదటి ఓవర్‌ నుంచే బౌండరీల వర్షం కురిపించారు. ముఖ్యంగా పవర్‌ ప్లే చివరి ఓవర్‌లో షెఫాలీ విధ్వంసం సృష్టించింది. ఈ ఓవర్‌లోని మొదటి ఐదు బంతులను వరుసగా బౌండరీకి తరలించిన షెఫాలీ చివరి బంతిని నేరుగా స్టాండ్స్‌లోకి పంపించింది. తద్వారా ఆ ఓవర్‌లో మొత్తం 26 పరుగులు పిండుకుంది. ఓపెనర్ల జోరుతో పవర్‌ప్లేలో భారత్ వికెట్ నష్టపోకుండా 70 పరుగులు చేసింది. కెప్టెన్ నిష్క్రమించినా
వైస్ కెప్టెన్ శ్వేతా సెహ్రావత్ దూకుడు తగ్గలేదు. సౌతాఫ్రికా బౌలర్లకు ఏ మాత్రం అవకాశమివ్వకుండా బౌండరీల వర్షం కురిపించింది. 57 బంతుల్లో 92 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి టీమిండియాను విజయ తీరాలకు చేర్చింది. మెరుపు ఇన్నింగ్స్‌తో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన శ్వేతకే ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పురస్కారం లభించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..