Shubman Gill : రికార్డులే కాదు.. ఆ రూమర్లలోనూ టాపే.. టీమిండియా ప్రిన్స్ ఆస్తుల చిట్టా పెద్దదే

25 ఏళ్ల యువ కెప్టెన్ శుభమన్ గిల్, క్రికెట్‌లో అదరగొట్టడమే కాకుండా రూ. 34 కోట్లకు పైగా ఆస్తితో ఆర్థికంగా దూసుకుపోతున్నాడు. అతని IPL, BCCI కాంట్రాక్టులు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, లగ్జరీ కార్ల కలెక్షన్, అతని వ్యక్తిగత జీవితం చుట్టూ ఉన్న ప్రేమ పుకార్ల గురించి తెలుసుకుందాం.

Shubman Gill : రికార్డులే కాదు.. ఆ రూమర్లలోనూ టాపే.. టీమిండియా ప్రిన్స్ ఆస్తుల చిట్టా పెద్దదే
Shubman Gills

Updated on: Jul 07, 2025 | 8:25 PM

Shubman Gill : క్రికెట్ మైదానంలో తన బ్యాటింగ్‌తో రికార్డులు సృష్టిస్తున్న టీమిండియా యువ కెప్టెన్ శుభమన్ గిల్, బ్యాంక్ బ్యాలెన్స్‌ విషయంలో కూడా అదరగొడుతున్నాడు. కేవలం 25 ఏళ్ల వయసులోనే భారత క్రికెట్‌కు ఒక ఆశాకిరణంగా మారిన గిల్, అంతే వేగంతో కోట్లలో ఆస్తులను కూడబెట్టుకుంటున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో తన ప్రదర్శనతో మెప్పిస్తున్న గిల్, ఆటతో పాటు ఆర్థికంగా కూడా అంతే వేగంగా ఎదుగుతున్నాడు. 2025 నాటికి గిల్ నెట్ వర్త్ దాదాపు రూ.34 కోట్లకు చేరుకుంది. క్రికెట్ ఒప్పందాలు, ఎండార్స్‌మెంట్లు, తెలివిగా పెట్టిన పెట్టుబడుల కలయికతో అతని ఆర్థిక ఎదుగుదల ఊపందుకుంది.

శుభమన్ గిల్ నెలవారీ ఆదాయం రూ. 50 లక్షలకు పైనే ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. అలాగే అతని వార్షిక ఆదాయం రూ.4 నుండి రూ.7 కోట్ల మధ్య ఉంటుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్న గిల్, ఒక్కో సీజన్‌కు ఏకంగా రూ. 16.5 కోట్లు సంపాదిస్తాడు. దీనికి తోడు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI)తో అతనికి గ్రేడ్-ఏ కాంట్రాక్ట్ ఉంది. దీని ద్వారా ఏటా రూ.7 కోట్లు ఖచ్చితంగా వస్తాయి.

అయితే, క్రికెట్ అనేది అతని సంపాదనలో ఒక భాగం మాత్రమే. గిల్ ప్రకటనల ప్రపంచంలో కూడా బాగా డిమాండ్ ఉన్న వ్యక్తి. అతను ఎన్నో ప్రముఖ బ్రాండ్‌లకు అంబాసిడర్‎గా వ్యవహరిస్తూ తన ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేసుకుంటున్నాడు. శుభమన్ గిల్ క్రికెట్ కెరీర్ విజయం వెనుక అతని తండ్రి లఖ్విందర్ సింగ్ అంకితభావం ఎంతో ఉంది. వృత్తిరీత్యా రైతు అయిన లఖ్విందర్, తన కొడుకును భారత జట్టు జెర్సీలో చూడాలని కలలు కన్నారు. పంజాబ్‌లోని వారి పొలంలోనే ఒక ప్రాక్టీస్ పిచ్‌ను నిర్మించారు. అవసరం వచ్చినప్పుడు మొహాలీకి మకాం మార్చి, అక్కడ అద్దె ఇంట్లో ఉంటూ తన కొడుకును పీసీఏ అకాడమీలో చేర్పించారు.

మైదానం బయట గిల్ చాలా ప్రశాంతంగా, నిలకడగా ఉంటాడని కోచ్‌లు, స్నేహితులు చెబుతారు. కానీ బ్యాట్ పట్టుకుని క్రీజులోకి అడుగు పెడితే మాత్రం పూర్తిగా ఆటపైనే దృష్టి పెట్టి చాలా సీరియస్‌గా మారిపోతాడట.పేరు ప్రఖ్యాతులతో పాటు, గిల్‌కు ఇప్పుడు లగ్జరీ వాహనాల కలెక్షన్ కూడా పెరిగింది. అతని దగ్గర ఒక మీడియం రేంజ్ లగ్జరీ ఎస్‌యూవీ అయిన రేంజ్ రోవర్ వెలార్, లగ్జరీకి పేరుగాంచిన మెర్సిడెస్ బెంజ్ E350, పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా అతని అద్భుత ప్రదర్శనకు బహుమతిగా ఇచ్చిన మహీంద్రా థార్ ఉన్నాయి.

పేరు వస్తే, వ్యక్తిగత జీవితం గురించి కూడా ఆరా తీయడం, పుకార్లు రావడం కామన్. గిల్ పేరు బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్, టీవీ స్టార్ రిధిమా పండిట్, నటి అవనీత్ కౌర్‌ వంటి వారితో ముడిపెట్టి రూమర్లు ప్రచారం జరిగాయి. వీటన్నిటిలోకెల్లా ఎక్కువగా చర్చించుకునేది సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌తో ఉన్న అతని సంబంధం. అయితే, గిల్ మాత్రం ఈ వార్తలన్నీ నిరాధారమైన ఊహాగానాలని ఎప్పుడూ కొట్టిపారేస్తున్నాడు.

 

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ చేయండి..