
Shubman Gill Retired Hurt: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత జట్టుకు ఊహించని భారీ షాక్ తగిలింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ త్వరగానే పెవిలియన్ చేరిన కష్టకాలంలో జట్టును ఆదుకున్న యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తీవ్రంగా గాయపడ్డాడు. సెంచరీకి చేరువవుతున్న తరుణంలో కండరాల నొప్పితో విలవిలలాడుతూ రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వీడటం అభిమానులను కలచివేసింది.
259 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల వికెట్లను త్వరగా కోల్పోయి జట్టు తీవ్ర ఒత్తిడిలో పడింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో భారత జట్టు వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పూర్తి బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు. ఎంతో ఓపికగా ఆడుతూనే, వీలు చిక్కినప్పుడల్లా ఇంగ్లీష్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. తనదైన క్లాసిక్ డ్రైవ్‌లు, అద్భుతమైన షాట్లతో అలరిస్తూ తన వన్డే కెరీర్‌లో 10వ సెంచరీ దిశగా వేగంగా దూసుకెళ్లాడు.
అయితే, ఇన్నింగ్స్ సాగుతున్న కొద్దీ గిల్ కుడి కాలి కండరాల నొప్పితో (క్రాంప్స్) తీవ్ర ఇబ్బంది పడ్డాడు. పదే పదే నొప్పితో బాధపడుతున్నా, అప్పటికే కీలక వికెట్లు కోల్పోయినందున జట్టు కోసం పట్టుదలతో క్రీజులో నిలిచే ప్రయత్నం చేశాడు. కానీ, 26వ ఓవర్లో పరిస్థితి మరింత విషమించింది. కనీసం నడవలేని స్థితిలో మైదానంలోనే కూలబడిపోయాడు. జట్టు ఫిజియో రెండుసార్లు మైదానంలోకి వచ్చి పరీక్షించినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. కేవలం 75 బంతుల్లో 80 పరుగులు చేసి సెంచరీకి కేవలం 20 పరుగుల దూరంలో ఉన్న గిల్, నొప్పితో కుంటుకుంటూ రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వీడాల్సి రావడం అందరినీ బాధిస్తోంది.
గిల్ క్రీజులో ఉన్నంత వరకు 149/2 స్కోరుతో అత్యంత పటిష్ట స్థితిలో, విజయం వైపు సాగుతున్నట్లు కనిపించిన టీమిండియా.. అతడు మైదానాన్ని వీడగానే ఒక్కసారిగా కుప్పకూలింది. శ్రేయాస్ అయ్యర్ అప్పటి వరకు అండగా నిలిచినా, గిల్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాతి 11 పరుగుల వ్యవధిలోనే శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వరుసగా పెవిలియన్ బాట పట్టారు. అప్పటివరకు భారత్ చేతిలో ఉన్న మ్యాచ్‌పై ఇంగ్లాండ్ బౌలర్లు మళ్లీ పూర్తి పట్టు బిగించారు.
వన్డే క్రికెట్‌లో శుభ్‌మన్ గిల్ ఇలా అద్భుతమైన ఫామ్‌లో ఉండి, సెంచరీకి చేరువలో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగడం ఇది తొలిసారి కాదు. 2023 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌పై కూడా ముంబై వాంఖడే స్టేడియంలో సరిగ్గా 79 పరుగుల వద్ద ఇలాగే కండరాల నొప్పితో మైదానాన్ని వీడాడు. దిలీప్ వెంగ్‌సర్కార్, సౌరవ్ గంగూలీ, క్రిస్ శ్రీకాంత్ వంటి దిగ్గజాల సరసన వన్డేల్లో బహుళసార్లు రిటైర్డ్ హర్ట్ అయిన భారతీయ ఆటగాళ్ల జాబితాలో ఇప్పుడు గిల్ కూడా చేరాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..