
ఐపీఎల్ 2025 ఫైనల్ ఓటమి తర్వాత కేవలం 10 రోజుల వ్యవధిలో శ్రేయస్ అయ్యర్ మరో ఫైనల్ మ్యాచ్ ఓడిపోయాడు. ఇక్కడ కూడా కెప్టెన్‌గా గానే తనకు నిరాశ ఎదురైంది. ముంబై టీ20 లీగ్ ఫైనల్‌లో అయ్యర్ కెప్టెన్సీలోని సోబో ముంబై ఫాల్కన్ జట్టు ఓటమి పాలైంది. ఈ నెల 3న ఆర్సీబీతో ఐపీఎల్ ఫైనల్‌లో అయ్యర్ కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ తలపడింది. ఎన్నో అంచనాలతో పంజాబ్ కింగ్స్ బరిలోకి దిగినప్పటికీ.. ఆర్సీబీపై విజయం సాధించలేకపోయింది. ఆ ఓటమిని మర్చిపోయి ముంబై టీ20 లీగ్‌లో బరిలోకి దిగిన అయ్యర్, తన సూపర్ కెప్టెన్సీతో సోబో ముంబై ఫాల్కన్స్ జట్టును ముంబై లీగ్ ఫైనల్‌కు తీసుకెళ్లాడు.
వాంఖడే స్టేడియంలో ముంబై సౌత్ సెంట్రల్ మరాఠా రాయల్స్ జట్టుతో జరిగిన ఫైనల్‌లో అయ్యర్ టీమ్ ఓటమి పాలైంది. ఐపీఎల్ ఫైనల్‌లో విఫలం అయినట్లే.. అయ్యర్ ఈ ఫైనల్‌లో కూడా బ్యాటింగ్‌లో విఫలం అయ్యాడు. ఐపీఎల్ ఫైనల్ కంటే ముందు.. డొమెస్టిక్ క్రికెట్‌లో అయ్యర్ సూపర్ కెప్టెన్సీ చేశాడు. తన కెప్టెన్సీలో రంజీ ట్రోఫీ, ఇరానీ కప్, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలను సాధించాడు. అలాగే ఐపీఎల్ 2024 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కప్పు అందించాడు. కానీ, ఐపీఎల్ 2025 ఫైనల్, ఇప్పుడు ముంబై టీ20 లీగ్ ఫైనల్‌లో తన టీమ్‌ను గెలిపించలేకపోయాడు. ఐపీఎల్ 2025 ఫైనల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిన అయ్యర్.. ఇప్పుడు ముంబై సౌత్ సెంట్రల్ మరాఠా రాయల్స్ చేతిలో ఓడిపోయాడు. రాయల్ పేరుంటే.. అయ్యర్ గెలవడం కష్టంగా ఉందని అభిమానులు సరదాగా కామెంట్ చేస్తున్నారు.
ఇక ఫైనల్ మ్యాచ్ విషయానికి వస్తే.. వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అయ్యర్ కెప్టెన్సీలోని సోబో ముంబై ఫాల్కన్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 157 పరుగులు చేసింది. కెప్టెన్ అయ్యర్ కేవలం 12 పరుగులు మాత్రమే చేసి నిరాశపర్చాడు. అయితే 158 పరుగుల టార్గెట్‌ను రాయల్స్ తమ ఇన్నింగ్స్‌లో నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. చిన్మయ్ సుతార్ 49 బంతుల్లో 53 పరుగులు సాధించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించాడు. ఛేజింగ్‌కు ఊపునిచ్చిన అవాయిస్ ఖాన్ కేవలం 24 బంతుల్లో 38 పరుగులు సాధించాడు. ఈ జంట తొమ్మిది ఓవర్లలో 75 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.
Rohit Sharma giving medal and award to Shreyas Iyer yesterday after T20 Mumbai league final at Wankhade.❤️ pic.twitter.com/8OV3TDKQMl
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) June 13, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..