Shreyas Iyer: వన్డే క్రికెట్ ఊపిరి పీల్చుకో.! సర్పంచ్ సాబ్ వచ్చేస్తున్నాడోచ్.. రోహిత్ వారసుడిగా

భారత క్రికెట్ జట్టుకు శ్రేయాస్ అయ్యర్‌ను కొత్త వన్డే కెప్టెన్‌గా నియమించవచ్చని వార్తలు వస్తున్నాయి. నివేదిక ప్రకారం, ఆసియా కప్ తర్వాత జరగనున్న సమావేశంలో దీనిపై మరింత క్లారిటీ రానుందని బీసీసీఐ అధికారిక వర్గాలు చెబుతున్నాయి. మరి ఆ వివరాలు ఏంటంటే.?

Shreyas Iyer: వన్డే క్రికెట్ ఊపిరి పీల్చుకో.! సర్పంచ్ సాబ్ వచ్చేస్తున్నాడోచ్.. రోహిత్ వారసుడిగా
Shreyas Iyer And Rohit Sharma (1)

Updated on: Aug 21, 2025 | 10:35 AM

శ్రేయాస్ అయ్యర్‌కు ఆసియా కప్ జట్టులో చోటు దొరకలేదు.! అయితేనేం బీసీసీఐ సరికొత్త ప్రణాళికను సిద్దం చేస్తున్నట్టు సమాచారం. నివేదిక ప్రకారం.. శ్రేయాస్ అయ్యర్‌ను వన్డేల్లో టీం ఇండియా కెప్టెన్‌గా నియమించవచ్చునని టాక్. సర్పంచ్ సాహెబ్‌గా గుర్తింపు పొందిన శ్రేయాస్.. రాబోయే రోజుల్లో టీమిండియాలోకి రీ-ఎంట్రీ ఇవ్వనున్నాడు. టెస్టుల్లో కెప్టెన్సీ బాధ్యతలు గిల్‌కి అప్పగించగా.. ప్రస్తుతం భారత జట్టుకు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. ఇక రోహిత్ శర్మ స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌ను వన్డే కెప్టెన్‌గా నియమించాలని బీసీసీఐ భావిస్తోందట.

ఆసియా కప్ అనంతరం కీలక సమావేశం జరగనుంది. దీనిలో రోహిత్ శర్మ, విరాట్‌ కొహ్లితో మాట్లాడి భవిష్యత్తు నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందట. టెస్ట్, టీ20ల నుంచి రిటైర్ అయిన రోహిత్, విరాట్ తమ భవిష్యత్తుపై తీసుకునే నిర్ణయంతో బీసీసీఐ భవిష్యత్తు వ్యూహాన్ని రూపొందిస్తుందని తెలుస్తోంది. అదే వ్యూహం ప్రకారం శ్రేయాస్ అయ్యర్ కూడా కెప్టెన్ కావడం ఖాయం. 2027 ప్రపంచకప్‌నకు ముందు శ్రేయాస్ అయ్యర్‌ను భారత జట్టు వన్డే కెప్టెన్‌గా నియమించవచ్చని తెలుస్తోంది. ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా వెళ్ళే ముందు ఇది జరిగే అవకాశం ఉందట.

ఇటీవల కాలంలో ఒకే ఆటగాడు మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా ఉండటం అంత సులభం కాదని BCCI విశ్వసిస్తోంది. ఆటగాడిగా మూడు ఫార్మాట్లలో ఆడటానికి.. కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లలో ఆడటానికి చాలా తేడా ఉంది. వన్డే కెప్టెన్సీని శ్రేయాస్ అయ్యర్‌కు అప్పగించాలనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నప్పటికీ, టెస్టుతో పాటు టీ20 కెప్టెన్‌గా శుభ్‌మాన్ గిల్‌ను నియమించడానికి బీసీసీఐ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. నివేదిక ప్రకారం, ఆసియా కప్‌లో శుభ్‌మాన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా చేయడం ద్వారా బీసీసీఐ తన ఆలోచనకు పునాది వేసింది.