ఉగ్రవాదితో కలిసి పాక్ మాజీ క్రికెటర్ విందు.. లీకైన ఫోటోతో ఏకిపారేస్తోన్న నెటిజన్లు..!

Shahid Afridi Controversy: క్రీడలు దేశాల మధ్య బంధాలను పెంచాలని చెప్తారు, కానీ అఫ్రిది లాంటి ఆటగాళ్లు ఉగ్రవాద మూలాలు ఉన్న వ్యక్తులతో ఇలా చెట్టాపట్టాలేసుకుని తిరగడం క్రీడా స్ఫూర్తికే మాయని మచ్చ. ఈ లీకైన ఫోటో ద్వారా అఫ్రిది నిజస్వరూపం, దేశం పట్ల ఆయనకున్న కుట్రపూరిత ఆలోచనలు మరోసారి స్పష్టమయ్యాయని క్రీడాభిమానులు ఘాటుగా విమర్శిస్తున్నారు.

ఉగ్రవాదితో కలిసి పాక్ మాజీ క్రికెటర్ విందు.. లీకైన ఫోటోతో ఏకిపారేస్తోన్న నెటిజన్లు..!
Shahid Afridi Controversy

Updated on: May 22, 2026 | 7:31 PM

Shahid Afridi Controversy: పాకిస్తాన్ మాజీ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది మరోసారి తీవ్ర వివాదంలో చిక్కుకున్నాడు. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, గ్యాంగ్‌స్టర్ ఉజైర్ బలోచ్‌తో కలిసి అఫ్రిది ఒకే టేబుల్‌పై విందు ఆరగిస్తున్న పాత ఫోటో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో దావానలంలా వ్యాపిస్తోంది. ఈ ఫోటో చూసిన క్రికెట్ అభిమానులు, ముఖ్యంగా భారతీయ నెటిజన్లు అఫ్రిది తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నెట్టింట లీకైన ఫోటో.. అసలు ఏం జరిగింది?

క్రికెట్ మైదానంలో తన దూకుడైన ఆటతీరుతో ‘బూమ్ బూమ్’ అనిపించుకున్న షాహిద్ అఫ్రిది, మైదానం వెలుపల మాత్రం ఎప్పుడూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంటాడు. తాజాగా 2013 నాటి ఒక ఫోటో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమై తీవ్ర దుమారం రేపుతోంది. కరాచీలో దారుణమైన నేరాలకు, టార్గెట్ కిలింగ్స్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లియారీ గ్యాంగ్ నెట్‌వర్క్ అధిపతి, ఉగ్రవాది ఉజైర్ బలోచ్‌తో అఫ్రిది చాలా సన్నిహితంగా కూర్చుని డిన్నర్ చేస్తున్న దృశ్యాలు ఇందులో ఉన్నాయి. 2016లో పాక్ భద్రతా దళాలు బలోచ్‌ను అరెస్ట్ చేయగా, అతను దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన నేరగాడిగా ముద్రపడ్డాడు. తాజాగా బాలీవుడ్ చిత్రం ‘ధురంధర్’లో ఈ ఉగ్రవాది పాత్రను చూపించడంతో, ఈ పాత ఫోటో మళ్లీ వెలుగులోకి వచ్చి సోషల్ మీడియాను ఊపేస్తోంది.

భారత్‌పై ఎప్పుడూ విషం కక్కే నైజం..

షాహిద్ అఫ్రిదికి భారత్‌పై, భారత సైన్యంపై విషం కక్కడం కొత్తేమీ కాదు. గతంలో పలుమార్లు కాశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితిని ప్రశ్నిస్తూ, భారత్‌కు వ్యతిరేకంగా ట్వీట్లు చేసి ఇక్కడి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. భారత సంస్కృతిని, రాజకీయాలను హేళన చేస్తూ ఇంటర్వ్యూలు ఇవ్వడం ఆయనకు అలవాటుగా మారింది. అంతేకాదు, 2025లో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన సమయంలో, పాకిస్తాన్ ఆర్మీకి మద్దతుగా అఫ్రిది ఏకంగా విక్టరీ ర్యాలీ నిర్వహించి, భారత సైన్యాన్ని కించపరుస్తూ పోస్టులు పెట్టాడు. ఉగ్రవాదులకు పరోక్షంగా మద్దతు ఇచ్చేలా వ్యవహరించే అఫ్రిది అసలు రంగు ఈ ఫోటోతో మరోసారి బయటపడిందని నెటిజన్లు మండిపడుతున్నారు.

అక్కడ ఉగ్రవాదితో విందు.. ఇక్కడ పౌర పురస్కారం!

ఒకవైపు ఇలాంటి వివాదాస్పద నేరగాళ్లతో సంబంధాలు ఉన్నప్పటికీ, పాకిస్తాన్‌లో మాత్రం అఫ్రిదిని హీరోగా ఆరాధిస్తుండటం గమనార్హం. ఇటీవల మే 13, 2026న పాకిస్తాన్ ప్రభుత్వం అఫ్రిదికి ఆ దేశపు రెండో అత్యున్నత పౌర పురస్కారం ‘హిలాల్-ఎ-ఇమ్తియాజ్’ అందజేసింది. పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నాడు. ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్ వంటి దిగ్గజాల సరసన అఫ్రిదికి ఈ గౌరవం దక్కడం విశేషం. అయితే అంతర్జాతీయ స్థాయిలో ఇంతటి గుర్తింపు ఉన్న ఆటగాడు, ఒక ఉగ్రవాదితో కలిసి విందు చేయడంపై క్రీడా ప్రపంచం ముక్కున వేలేసుకుంటోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us