
Shafali Verma : గత రెండు నెలల్లో యువ క్రికెటర్ షెఫాలీ వర్మ జీవితంలో జరిగింది నిజంగా ఓ మిరాకిల్ అని చెప్పవచ్చు. మొదట్లో అవకాశం దక్కకపోయినా, అదృష్టం రూపంలో ఆమెకు ఆ ఛాన్స్ లభించింది. ఆ అవకాశాన్ని షెఫాలీ అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నారు. దాని ఫలితమే ఇప్పుడు ఐసీసీ కూడా ఆమె ప్రతిభను గుర్తించింది. వరల్డ్ కప్ ఫైనల్‌లో అద్భుత ప్రదర్శన చేసిన షెఫాలీ వర్మ, నవంబర్ నెలకు గాను ఐసీసీ మహిళా ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ఎంపికయ్యారు.
మహిళల వన్డే వరల్డ్ కప్ కోసం మొదట్లో ప్రకటించిన భారత జట్టులో షెఫాలీ వర్మకు స్థానం దక్కలేదు. కానీ సెమీఫైనల్‌కు కొద్ది రోజుల ముందు భారత ఓపెనర్ ప్రతికా రావల్ గాయపడటంతో, షెఫాలీకి జట్టులోకి వచ్చే అవకాశం దొరికింది. వరల్డ్ కప్ మధ్యలో టీమిండియాలో చేరిన షెఫాలీ, సెమీఫైనల్‌లో రాణించలేకపోయింది. కానీ ఫైనల్ మ్యాచ్‌లో ఆమె 78 బంతుల్లో 87 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్ ఆడింది. టీమిండియా వరల్డ్ కప్‌ను గెలవడంలో ఈ ఇన్నింగ్స్ కీలక పాత్ర పోషించింది.
వరల్డ్ కప్ ఫైనల్‌లో షెఫాలీ వర్మ కేవలం బ్యాటింగ్‌తోనే కాదు, బౌలింగ్‌తో కూడా అదరగొట్టింది. 87 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడే క్రమంలో ఆమె, సీనియర్ ఓపెనర్ స్మృతి మంధానతో కలిసి తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. బ్యాటింగ్‌కే పరిమితం కాకుండా, షెఫాలీ బౌలింగ్‌లో కూడా తన సత్తా చాటింది. ఫైనల్‌లో ఆమె 7 ఓవర్లు వేసి కేవలం 36 పరుగులు ఇచ్చి రెండు ముఖ్యమైన వికెట్లు పడగొట్టింది. ఈ వికెట్లలో ఒకటి స్టార్ ప్లేయర్ మారిజెన్ కేప్ ది కూడా ఉంది.
ఫైనల్ మ్యాచ్‌లో తన అద్భుత ప్రదర్శనపై షెఫాలీ వర్మ స్పందించింది. “ఇది నాకు మొదటి వరల్డ్ కప్. నేను అనుకున్నట్లే ఇది చాలా బాగా జరిగింది. నేను ఎలా ఊహించుకున్నానో, అంతా అలాగే జరిగింది. టీమ్ ఫైనల్ గెలవడానికి నా వంతు సహాయం చేయడం చాలా సంతోషంగా ఉంది. స్వదేశంలో మన అభిమానుల సమక్షంలో జట్టు తొలిసారిగా వరల్డ్ కప్ గెలవడాన్ని కళ్లారా చూసే అవకాశం నాకు దక్కింది” అని ఆమె సంతోషం వ్యక్తం చేసింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..