
Sachindu Colombage vs Jasprit Bumrah: ఇంగ్లండ్ (England) జట్టుతో డర్హమ్ లోని రివర్‌సైడ్ గ్రౌండ్ వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్ ద్వారా శ్రీలంక (Sri Lanka) యువ ఆటగాడు సచిందు కొలంబగే (Sachindu Colombage) అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. అయితే ఈ మ్యాచ్‌లో అతను తీసుకున్న వికెట్ల కంటే తన విభిన్నమైన బౌలింగ్ శైలితోనే ఎక్కువ ప్రసిద్ధి పొందాడు. క్రీజులోకి వచ్చే విధానం, బంతిని విడుదల చేసే ముందు చేతిని కదిపే తీరు అచ్చం భారత పేసర్ జస్ ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ను పోలి ఉండటంతో సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి.
అయితే కొలంబగే ఒక స్పిన్ బౌలర్ కాగా, బుమ్రా ఫాస్ట్ బౌలర్ అన్న విషయం గమనించాలి. ఇద్దరి బౌలింగ్ యాక్షన్లు పూర్తిగా ఒకేలా లేనప్పటికీ, అభిమానులు కొన్ని పోలికలను గుర్తిస్తున్నారు. బౌలింగ్ రన్ అప్ సమయంలో సచిందు బంతిని తన కళ్లు అలాగే నుదురు భాగం వద్ద పట్టుకుని పరుగెత్తుతాడు. బుమ్రా కూడా సరిగ్గా ఇదే స్థానంలో బంతిని పట్టుకుని బౌలింగ్ చేస్తాడు. బంతిని వదిలే సమయంలో శరీరం తెరిచి ఉండే తీరు కూడా కొంతవరకు పోలి ఉండటంతో క్రికెట్ ప్రేమికులు ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది నెటిజన్లు అతడిని మాజీ భారత లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే (Anil Kumble) తో కూడా పోలుస్తున్నారు.
తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లోనే సచిందు అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఇంగ్లండ్ సీనియర్ బ్యాటర్ జో రూట్ (Joe Root) ను క్లీన్ బౌల్డ్ చేసి తన తొలి వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. 10 ఓవర్లు వేసిన ఈ స్పిన్నర్ 44 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. జో రూట్‌తో పాటు జోస్ బట్లర్ (Jos Buttler), జేమీ ఓవర్టన్ (Jamie Overton) వికెట్లను కూడా దక్కించుకున్నాడు. సచిందు రాణించడంతో ఇంగ్లండ్ జట్టు 265 పరుగులకే కుప్పకూలింది. మొత్తానికి అరంగేట్ర మ్యాచ్‌లోనే తన ప్రత్యేకమైన బౌలింగ్ శైలి ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.