Rohit Sharma: రెండు టెస్టులు ఆడుతా..! రోహిత్‌ రిక్వెస్ట్‌ను కూరలో కరివేపాకులా తీసిపారేసిన సెలెక్టర్లు..?

రోహిత్ శర్మ అకస్మాత్తుగా టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడం క్రికెట్ ప్రపంచాన్ని కలవరపెట్టింది. బీసీసీఐ, సెలెక్టర్ల నిర్ణయాలతో తలెత్తిన విభేదాలు, కెప్టెన్సీ వివాదం ఈ నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. రోహిత్ ఇంగ్లాండ్‌తో కనీసం రెండు టెస్టులు ఆడాలని కోరుకున్నాడు కానీ, అది సాధ్యం కాలేదు.

Rohit Sharma: రెండు టెస్టులు ఆడుతా..! రోహిత్‌ రిక్వెస్ట్‌ను కూరలో కరివేపాకులా తీసిపారేసిన సెలెక్టర్లు..?
Rohit Sharma

Updated on: May 08, 2025 | 6:55 PM

రోహిత్ శర్మ మే 7న సాయంత్రం అకస్మాత్తుగా అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. రెండు వారాల క్రితం ఒక ఇంటర్వ్యూలో ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో తాను బాగా రాణిస్తానని చెప్పాడు. మరి ఇంతలోనే ఏం జరిగింది? ఎందుకు ఉన్నపళంగా రోహత్‌ టెస్ట్‌ ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు అనే ప్రశ్నార్థకంగా మారింది. అయితే రోహిత్‌ శర్మ కోపంతో రిటైర్మెంట్‌ ప్రకటించాడని తెలుస్తోంది. రోహిత్ శర్మ ఇంగ్లాండ్‌తో టెస్ట్‌ సిరీస్‌ ఆడాలని అనుకున్నాడు. కనీసం రెండు టెస్ట్ మ్యాచ్‌లు అయినా ఆడాలని కోరుకున్నాడు.

అయితే తన బ్యాడ్‌ ఫామ్‌ కారణంగా బీసీసీఐ, సెలెక్టర్లు అతన్ని కెప్టెన్సీ నుంచి అలాగే టీమ్‌ నుంచి తప్పించాలని అనుకున్నారు. ఇదే విషయంపై గత వారం రోజులుగా సెలెక్టర్లకు రోహిత్‌కు మధ్య చర్చలు జరుగుతున్నాయి. కనీసం రెండు టెస్టులు ఆడిన తర్వాత నేనే రిటైర్మెంట్‌ ప్రకటిస్తానని చెప్పినా వినకుండా.. సరే మ్యాచ్‌లు ఆడు కానీ, కెప్టెన్సీ మాత్రం వేరే ప్లేయర్‌కు ఇస్తామంటూ రోహిత్‌తో కరాఘండిగా చెప్పేయడంతో రోహిత్‌ హర్ట్‌ అయి వెంటనే రిటైర్మెంట్‌ ప్రకటించినట్లు తెలుస్తోంది.

రోహిత్‌ లాంటి ప్లేయర్‌ రెండు టెస్టులు ఆడతానని అడిగినా కూడా సెలెక్టర్లు అతని రిక్వెస్ట్‌ను పట్టించుకోలేదనే విషయం ఇప్పుడు క్రికెట్‌ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. రోహిత్ భవిష్యత్తును నిర్ణయించే సమయంలోనే విరాట్ కోహ్లీని మళ్లీ కెప్టెన్‌గా చేయడంపై కూడా చర్చ జరిగిందని నివేదికలు చెబుతున్నాయి. జస్‌ప్రీత్ బుమ్రా పేరు కూడా పరిశీలనలో ఉంది. ఇంగ్లాండ్ పర్యటనలోనే వారిద్దరి పేర్ల గురించి చాలా చర్చలు జరిగాయి. కానీ, చివరికి వరల్డ్‌ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ ను దృష్టిలో ఉంచుకొని కెప్టెన్‌ను నియమించాలని నిర్ణయించారు. కెప్టెన్సీ కోసం శుబ్‌మన్ గిల్ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి