
Rohit Sharma : భారత క్రికెట్ చరిత్రలో నవంబర్ 19, 2023 ఒక చేదు జ్ఞాపకం. సొంత గడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమి పాలైన ఆ క్షణాన్ని ఏ ఒక్క క్రికెట్ అభిమానీ మర్చిపోలేడు. అయితే, ఆ ఓటమి సామాన్య అభిమానుల కంటే కెప్టెన్ రోహిత్ శర్మను ఎంతలా కుంగదీసిందో ఆయన తాజాగా బయటపెట్టారు. ఆ బాధ భరించలేక తాను క్రికెట్‌కే గుడ్ బై చెప్పాలని, రిటైర్మెంట్ ప్రకటించాలని తీవ్రంగా ఆలోచించినట్లు హిట్‌మ్యాన్ స్వయంగా వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న రోహిత్, ఆనాటి తన మానసిక స్థితిని వివరిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. “ఆ ఓటమి తర్వాత మేమంతా చాలా నిరాశ చెందాం. అసలు ఏం జరిగిందో మాకు అర్థం కాలేదు. వ్యక్తిగతంగా అది నాకు అత్యంత కఠినమైన కాలం. ఆ ప్రపంచకప్ కోసం నేను నా సర్వస్వాన్ని ధారపోశాను. కేవలం టోర్నీకి రెండు నెలల ముందు నుంచే కాదు, 2022లో కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి నా ఏకైక లక్ష్యం ఆ వరల్డ్ కప్ మాత్రమే. నా కల ముక్కలైనప్పుడు నేను పూర్తిగా విరిగిపోయాను” అని రోహిత్ చెప్పుకొచ్చారు.
ఆ ఓటమి రోహిత్ శక్తిని ఎంతలా హరించిందంటే, ఆయనకు మళ్లీ బ్యాట్ పట్టుకోవాలనే ఆలోచన కూడా రాలేదట. “ఆ సమయంలో నా శరీరంలో ఏమాత్రం శక్తి మిగిలి ఉన్నట్లు అనిపించలేదు. అసలు మళ్లీ క్రికెట్ ఆడాలా? లేక ఇక్కడితో ఆపేసి రిటైర్మెంట్ తీసుకోవాలా? అనే సందేహాలు నా మనసును తొలిచేశాయి. ఎందుకంటే ఆ క్షణం నాలోని ఉత్సాహాన్ని అంతా లాగేసింది. మళ్ళీ మామూలు స్థితికి రావడానికి నాకు కొన్ని నెలల సమయం పట్టింది” అని రోహిత్ తన మనసులోని బాధను పంచుకున్నారు.
అదృష్టవశాత్తూ రోహిత్ ఆ నిర్ణయం తీసుకోలేదు. ఆ కఠినమైన రోజులను దాటుకుంటూ వచ్చి, సరిగ్గా కొన్ని నెలలకే అంటే జూన్ 2024లో టీమిండియాను టీ20 ప్రపంచకప్ విజేతగా నిలబెట్టారు. వన్డే వరల్డ్ కప్ చేజారిన చోటే, తన అద్భుతమైన కెప్టెన్సీతో పొట్టి ప్రపంచకప్‌ను ముద్దాడి చరిత్ర సృష్టించారు. రిటైర్మెంట్ అంచు వరకు వెళ్లిన ఒక ఛాంపియన్ క్రీడాకారుడు, మళ్లీ పుంజుకుని విశ్వవిజేతగా నిలవడమే అసలైన సక్సెస్ అని రోహిత్ నిరూపించారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..