
Rohit Sharma : హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ మరోసారి మైదానంలోకి దిగడానికి సిద్ధమవుతున్నాడు. నవంబర్ 30 నుంచి ప్రారంభమవుతున్న సౌతాఫ్రికా వన్డే సిరీస్‌లో ఓపెనర్‌గా తనదైన శైలిలో రాణించడానికి రోహిత్ సిద్ధంగా ఉన్నాడు. రాంచీలో ఇప్పటికే తీవ్రంగా ప్రాక్టీస్ చేసిన రోహిత్, ఆస్ట్రేలియాతో జరిగిన గత వన్డే సిరీస్ లాగే ఈ సిరీస్‌లో కూడా మెరుపులు మెరిపించే అవకాశం ఉంది. కేవలం మూడు మ్యాచ్‌ల ఈ వన్డే సిరీస్ రోహిత్ శర్మకు ఎంతో ప్రత్యేకంగా నిలవనుంది. ఎందుకంటే ఈ సిరీస్‌లో ఏకంగా 5 మెయిన్ రికార్డులు, 11 అద్భుతమైన ఘనతలు సాధించే అవకాశం ఉంది.
టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ రాబోయే సౌతాఫ్రికా వన్డే సిరీస్‌లో ఏకంగా 5 ముఖ్యమైన ప్రపంచ రికార్డులను అధిగమించే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో 98 పరుగులు చేస్తే, రోహిత్ అంతర్జాతీయ క్రికెట్‌లో 20,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో చేరతాడు. అలాగే, వన్డే ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్లు (351) కొట్టిన పాకిస్తాన్ దిగ్గజం షాహిద్ అఫ్రిది రికార్డును బద్దలు కొట్టడానికి రోహిత్‌కు కేవలం 7 సిక్సర్లు మాత్రమే అవసరం. ఓపెనర్‌గా ఇప్పటివరకు 15,787 పరుగులు చేసిన రోహిత్, మరో 213 పరుగులు చేస్తే 16,000 పరుగుల మార్క్‌ను చేరుకుంటాడు. ముఖ్యంగా ఓపెనర్‌గా క్రిస్ గేల్ (338 సిక్సర్లు) రికార్డును అధిగమించడానికి 8 సిక్సర్లు, ఓపెనర్‌గా అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన ఏకైక భారతీయుడిగా నిలవడానికి ఒక సెంచరీ అవసరం.
ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ స్వదేశంలో, సౌతాఫ్రికాపై అనేక అరుదైన ఘనతలు సాధించగలడు. సౌతాఫ్రికా పై మరో 27 పరుగులు చేస్తే, ఆ జట్టుపై 2,000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేస్తాడు. అలాగే ఈ జట్టుపై అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డుకు మరో 7 సిక్సర్లు దూరంలో ఉన్నాడు. భారత గడ్డపై వన్డే ఫార్మాట్‌లో 5,000 పరుగులు పూర్తి చేయడానికి రోహిత్‌కు 133 పరుగులు అవసరం.. ఈ ఘనత సాధించిన మూడో భారతీయ ఆటగాడు అవుతాడు.
హిట్ మ్యాన్ జట్టు విజయాలలో కూడా తన మార్క్ చూపించబోతున్నాడు. భారత్ గెలిచిన అంతర్జాతీయ మ్యాచ్‌లలో 12,000 పరుగులు పూర్తి చేయడానికి అతనికి కేవలం 30 పరుగులు అవసరం. ఈ ఘనత సాధించిన తొలి ఆసియా ఓపెనర్ అవుతాడు. అంతేకాకుండా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా (SENA) దేశాలపై వన్డేల్లో 5,000 పరుగులు పూర్తి చేయడానికి రోహిత్ 36 పరుగులు దూరంలో మాత్రమే ఉన్నాడు. ఈ రికార్డులన్నీ ఈ సిరీస్‌ను రోహిత్ శర్మకు ఒక చారిత్రక ఘట్టంగా మార్చనున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..