
Rohit Sharma : టీమిండియా మాజీ కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ మైదానంలో అడుగుపెడితే రికార్డులు తిరగరాయాల్సిందే. సుమారు 7 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో బరిలోకి దిగిన రోహిత్, తన ఫామ్‌తో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. సిక్కింతో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరపున ఆడుతూ కేవలం 94 బంతుల్లోనే 155 పరుగులు బాదాడు. ఈ ఇన్నింగ్స్‌లో 18 ఫోర్లు, 9 సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతూ పెద్ద చర్చకు దారితీసింది. సిక్కిం ఆటగాడు ఒకరు రోహిత్ కాళ్ళకు మొక్కుతున్నాడంటూ ప్రచారం జరిగింది, కానీ అసలు నిజం వేరే ఉంది.
మ్యాచ్ ముగిసిన తర్వాత రోహిత్ శర్మతో షేక్ హ్యాండ్ చేయడానికి సిక్కిం ఆటగాడు ఒకరు ముందుకు వచ్చాడు. ఆ సమయంలో అనుకోకుండా అతని తలపై ఉన్న టోపీ కింద పడిపోయింది. దానిని తీసుకోవడానికి అతను కిందకు వంగినప్పుడు, రోహిత్ కాళ్లకు నమస్కరిస్తున్నట్లు కెమెరా యాంగిల్‌లో కనిపించింది. దీంతో నెటిజన్లు రోహిత్ క్రేజ్ చూశారా అంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. కానీ నిజానికి ఆ క్రికెటర్ తన టోపీని తీసుకుంటుండగా, రోహిత్ అతని భుజం తట్టి అభినందించాడు. ఇది కేవలం ఒక యాదృచ్చికం మాత్రమే తప్ప, అక్కడ కాళ్లకు మొక్కిన సంఘటన ఏదీ జరగలేదని స్పష్టమైంది.
A Sikkim Player touching Rohit Sharma's feet after the match ❤️#RohitSharma𓃵 #VijayHazare pic.twitter.com/CyZ5dO9Dxw
— Adarsh (@Adarsh_Jha_07) December 24, 2025
రోహిత్ ఇన్నింగ్స్ విషయానికి వస్తే, యువ ఆటగాడు అంగ్‌క్రిష్ రఘువంశీతో కలిసి మొదటి వికెట్‌కు 141 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ తర్వాత ముషీర్ ఖాన్‌తో కలిసి ముంబైకి సునాయాస విజయాన్ని అందించాడు. సిక్కిం కెప్టెన్ లేయోంగ్ లెప్చా మాట్లాడుతూ.. ప్రపంచకప్ గెలిచిన కెప్టెన్‌తో ఒకే మైదానంలో ఆడటం తమ జట్టుకు ఒక కల నిజమైనట్లు ఉందని భావోద్వేగానికి లోనయ్యాడు. భద్రతా కారణాల దృష్ట్యా వ్యక్తిగతంగా మాట్లాడలేకపోయినా, బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రోహిత్‌తో కొన్ని మాటలు కలిపానని, అది తన జీవితంలో గొప్పగా గుర్తుండి పోతుందని చెప్పుకొచ్చాడు.
ఇక రోహిత్ శర్మ తన తదుపరి మ్యాచ్‌ను డిసెంబర్ 26న ఉత్తరాఖండ్‌తో ఆడనున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా రోహిత్ 150 పరుగుల మార్కును దాటితే, లిస్ట్-ఏ క్రికెట్‌లో 10 సార్లు 150+ స్కోర్లు చేసిన ఏకైక ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డులో ఆస్ట్రేలియా దిగ్గజం డేవిడ్ వార్నర్‌తో కలిసి రోహిత్ సమానంగా ఉన్నాడు. హిట్‌మ్యాన్ ఫామ్ చూస్తుంటే ఈ రికార్డు కూడా త్వరలోనే బద్దలయ్యేలా కనిపిస్తోంది. ముంబై జట్టు రోహిత్ రాకతో మరింత ఉత్సాహంగా టోర్నీలో దూసుకుపోతోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..