
IND vs PAK : ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య దోహా వేదికగా ఉత్కంఠభరితమైన పోరు జరుగుతోంది. ఈ పోరులో భారత యువ జట్టు సాధారణ స్కోరుకే పరిమితమైంది.ఈ టోర్నమెంట్‌లో ఇప్పటికే తొలి మ్యాచ్ గెలిచిన ఈ రెండు జట్లు తలపడగా, టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 19 ఓవర్లలో 136 పరుగులకే ఆలౌట్ అయింది. భారత యువ జట్టులో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్ ఆడినా, పాక్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు మిగిలిన బ్యాట్స్‌మెన్ తలవంచడంతో భారత్.. పాకిస్థాన్‌కు 137 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించగలిగింది.
ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మెరుపు ఆరంభాన్ని అందించాడు. సూర్యవంశీ దూకుడుగా ఆడుతున్న సమయంలో సుఫియాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి బౌండరీ లైన్ వద్ద ఫైక్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. పాకిస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత్ స్కోరు 150 మార్కుకు దిగువకు పడిపోయింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ విజయం సాధించాలంటే 137 పరుగులు చేయాల్సి ఉంది.
వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్‌ను దూకుడుగా ప్రారంభించాడు. మ్యాచ్ మొదటి బంతిని బౌండరీకి పంపి తన ఉద్దేశాన్ని చాటాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడి జట్టుకు వేగవంతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. అయితే, మరో ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య కేవలం 10 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన నమన్ ధీర్ క్రీజులో నిలబడి, వైభవ్ సూర్యవంశీతో కలిసి 49 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. సూర్యవంశీ 45 పరుగులు చేసి అవుట్ కాగా, నమన్ ధీర్ 35 పరుగులు చేసి జట్టుకు అండగా నిలిచాడు.
సూర్యవంశీ, నమన్ ధీర్ అవుట్ అయిన తర్వాత భారత ఇన్నింగ్స్ పతనం మొదలైంది. కెప్టెన్ జితేష్ శర్మ 9 బంతుల్లో కేవలం 5 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ఆశుతోష్ శర్మ 6 బంతులు ఆడినా ఖాతా కూడా తెరవలేకపోయాడు. నేహల్ వధేరా 11 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేసి అవుట్ కావడంతో, భారత్ స్కోరు బోర్డు వేగం పూర్తిగా తగ్గిపోయింది.
చివరికి, హర్ష్ దూబే (19) కాసేపు పోరాడినా, 19వ ఓవర్‌లో డానియల్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో భారత ఇన్నింగ్స్ 136 పరుగుల వద్ద ముగిసింది. పాకిస్థాన్ బౌలర్లలో డేనియల్, మాజ్ సదాకత్ వంటి వారు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి, భారత జట్టును తక్కువ స్కోరుకే పరిమితం చేయగలిగారు.
వైభవ్ సూర్యవంశీ దూకుడు కారణంగా ఒక దశలో టీమిండియా స్కోరు 160-170 దాటుతుందని అనిపించింది. కానీ మధ్య ఓవర్లలో పాకిస్థాన్ బౌలర్లు తెలివిగా బౌలింగ్ చేశారు. వైభవ్, నమన్ ధీర్ అవుట్ అయిన తర్వాత భారత బ్యాట్స్‌మెన్‌లు పరుగులు రాబట్టడానికి ఇబ్బంది పడ్డారు. పరుగులు రాకుండా కట్టడి చేయడంతో పాటు, పాక్ బౌలర్లు కీలకమైన వికెట్లు పడగొట్టి భారత జట్టును 136 పరుగులకే నిలువరించగలిగారు.
భారత జట్టు 136 పరుగులు మాత్రమే చేయడంతో, ఈ మ్యాచ్ గెలవాలంటే భారత బౌలర్లు పాకిస్థాన్‌ను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. పిచ్‌పై ఏమైనా సపోర్టు ఉంటే, భారత స్పిన్నర్లు దానిని ఉపయోగించుకోగలరా లేదా అనేది మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..