Rishabh Pant: టీమిండియా కొంపముంచుతున్న రిషభ్‌ పంత్‌ సెంచరీ..! మనోడు వంద కొడితే ఇక అంతే సంగతులు..

రిషభ్ పంత్ అద్భుతమైన బ్యాటర్. కానీ విదేశాల్లో అతను సెంచరీ చేసిన ప్రతిసారీ టీమిండియా ఓడిపోతోంది లేదా మ్యాచ్ డ్రా అవుతోంది. ఇది ఒక బ్యాడ్ సెంటిమెంట్ గా అభిమానులు భావిస్తున్నారు. పంత్ తన భవిష్యత్తు మ్యాచ్ లలో ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది.

Rishabh Pant: టీమిండియా కొంపముంచుతున్న రిషభ్‌ పంత్‌ సెంచరీ..! మనోడు వంద కొడితే ఇక అంతే సంగతులు..
Rishabh Pant

Updated on: Jun 26, 2025 | 12:36 PM

రిషభ్‌ పంత్‌.. టీమిండియాలో చిచ్చర పిడుగు లాంటి బ్యాటర్‌. టెస్టు క్రికెట్‌ను టీ20లా ఆడగల దిట్ట. ధనాధన్‌ బ్యాటింగ్‌, ఫియర్‌లెస్‌ ఎటాకింగ్‌కు పెట్టింది పేరు. తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టెస్టులో కూడా ఏకంగా రెండు సెంచరీలు బాదేశాడు. రోహిత్‌ శర్మ టెస్ట్‌ ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత.. శుబ్‌మన్‌ గిల్‌ టెస్ట్‌ జట్టుకు కెప్టెన్‌ అయితే, రిషభ్‌ పంత్‌ వైస్‌ కెప్టెన్‌ అయ్యాడు. తనకిచ్చిన వైస్‌ కెప్టెన్సీ పోస్ట్‌కు, తనకున్న అగ్రిసివ్‌ బ్యాటింగ్‌ బ్రాండ్‌కు న్యాయం చేస్తూ.. ఇంగ్లాండ్‌ గడ్డపై తొలి టెస్టులోనే రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలతో చెలరేగాడు. పంత్‌ బ్యాటింగ్‌తో అంతా హ్యాపీగా ఉన్నా.. ఓ బ్యాడ్‌ సెంటిమెంట్‌ ఇప్పుడు పంత్‌ను, పంత్‌ అభిమానులను వేధిస్తోంది.

అదేంటంటే.. పంత్‌ సెంచరీ టీమిండియాకు అస్సలు కలిసి రావడం లేదు. ముఖ్యంగా విదేశాల్లో పంత్‌ సెంచరీ చేసిన ప్రతి సారి టీమిండియా విజయం దక్కడం లేదు. దీంతో.. పంత్‌ సెంచరీ టీమిండియాకు ఒక బ్యాడ్‌ సెంటిమెంట్‌లా మారిపోతుంది. 2018లో ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టులో రిషభ్‌ పంత్‌ విదేశాల్లో తన తొలి సెంచరీ నమోదు చేశారు. ఆ మ్యాచ్‌లో 114 పరుగులు సాధించాడు. అయితే ఆ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ కెప్టెన్సీలోని టీమిండియా ఓటమి పాలైంది. అలాగే 2019లో ఆస్ట్రేలియాపై 159 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ఇక 2022లో సౌతాఫ్రికాలో 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైంది. అదే ఏడాది ఇంగ్లాండ్‌లో 146 పరుగులు కొట్టాడు.. ఆ మ్యాచ్‌లోనూ టీమిండియా ఓటమి పాలైంది.

ఇక ఇప్పుడు తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులోని రెండు ఇన్నింగ్స్‌ల్లో 134, 118 పరుగులు సాధించినా కూడా టీమిండియాకు ఓటమి తప్పలేదు. విదేశాల్లో పంత్‌ సెంచరీ కొట్టిన ప్రతిసారి టీమిండియా ఓడిపోవడం, లేదా డ్రా అవ్వడమో జరిగింది తప్పా.. ఒక్క మ్యాచ్‌లో కూడా భారత్‌ విజయం సాధించలేదు. విదేశాల్లో పంత్‌కు ఆరు సెంచరీలు ఉన్నాయి. ఇలా రిషభ్‌ పంత్‌ సెంచరీలు టీమిండియాకు అస్సలు కలిసి రావడం లేదు. దీంతో పంత్‌ సెంచరీ చేయకపోయినా బాధలేదు కానీ, టీమిండియా గెలవాలని కొంతమంది క్రికెట్‌ అభిమానులు భావిస్తున్నారు. క్రికెట్‌లో చాలా రకాల సెంటిమెంట్ల ఉంటాయనే విషయం తెలిసిందే. ఇప్పుడు వాటి సరసన ఈ పంత్‌ సెంచరీ సెంటిమెంట్‌ కూడా చేరింది. అయితే ఇది తప్పు అని నిరూపించే అవకాశం ఇప్పుడు పంత్‌ చేతుల్లోనే ఉంది. మిగిలిన నాలుగు టెస్టుల్లో తాను సెంచరీ చేయడంతో పాటు జట్టును గెలిపించగలిగితే.. ఈ బ్యాడ్‌ సెంటిమెంట్‌కు ఎండ్‌ కార్డ్‌ వేయొచ్చు. మరి పంత్‌ అది చేస్తాడో లేదో చూడాలి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి