India ODI Tensions : కోచ్ గంభీర్‌తో కోహ్లీ, రోహిత్‌లకు కోల్డ్ వార్.. కమ్యూనికేషన్ గ్యాప్‌తో ఆందోళనలో బీసీసీఐ!

భారత వన్డే జట్టులో ఇంటర్నల్ గా ఏదో జరుగుతుందని తెలుస్తోంది. టీమ్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయాయని వార్తలు వస్తున్నాయి. కోహ్లీ కోచ్ గంభీర్‌ను పట్టించుకోవడం లేదని సూచించే అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

India ODI Tensions : కోచ్ గంభీర్‌తో కోహ్లీ, రోహిత్‌లకు కోల్డ్ వార్.. కమ్యూనికేషన్ గ్యాప్‌తో ఆందోళనలో బీసీసీఐ!
Team India

Updated on: Dec 02, 2025 | 2:55 PM

India ODI Tensions : భారత వన్డే జట్టులో ఇంటర్నల్ గా ఏదో జరుగుతుందని తెలుస్తోంది. టీమ్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయాయని వార్తలు వస్తున్నాయి. కోహ్లీ కోచ్ గంభీర్‌ను పట్టించుకోవడం లేదని సూచించే అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాతో రాయ్‌పూర్‌లో జరగబోయే రెండో వన్డే కోసం జట్టు సిద్ధమవుతుండగా కోహ్లీకి సంబంధించిన ఓ ఒక కీలక పరిణామం వైరల్ అవుతుంది. బీసీసీఐ సెలెక్షన్ కమిటీలో తాజాగా చేరిన ప్రజ్ఞాన్ ఓజాతో కోహ్లీ తీవ్రమైన చర్చలో పాల్గొన్న కొత్త వీడియో ఒకటి బయటికి వచ్చింది.

సౌతాఫ్రికాతో జరిగే రెండో వన్డే కోసం జట్టు ప్రయాణిస్తున్న సమయంలో ఎయిర్‌పోర్ట్‌లో ఆటగాళ్లు వేచి ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. తాజాగా బీసీసీఐ సెలెక్షన్ కమిటీలో చేరిన ప్రజ్ఞాన్ ఓజాతో విరాట్ కోహ్లీ చాలా సీరియస్‌గా మాట్లాడుతున్నట్లు వీడియోలో కనిపించింది. కోహ్లీ భవిష్యత్తు ముఖ్యంగా వన్డే ఫార్మాట్‌లో ఆయన స్థానం, 2027 వన్డే ప్రపంచకప్ కోసం భారత జట్టు ప్రణాళికల గురించి ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో, సీనియర్ సెలెక్టర్‌తో కోహ్లీ ఇంత తీవ్రంగా చర్చించడం అనేక అనుమానాలకు తావిచ్చింది.

అదే సమయంలో మరో దృశ్యం కూడా బయటపడింది. ఇది కోచ్, సీనియర్ ఆటగాళ్ల మధ్య వైరుధ్యాన్ని మరింత బలపరిచింది. విరాట్ కోహ్లీ ఓజాతో మాట్లాడిన కొద్దిసేపటికే, రోహిత్ శర్మ, కోచ్ గౌతమ్ గంభీర్ కలిసి కూర్చుని ఉండగా, అక్కడ ప్రజ్ఞాన్ ఓజా వచ్చి వారితో మాట్లాడటం కనిపించింది. ఈ చర్చలో కోహ్లీ పాల్గొనలేదు. ఈ విజువల్స్ కేవలం యాదృచ్ఛికమైనవి కావొచ్చు. కానీ, కోహ్లీ ఓజాతో విడిగా, రోహిత్ గంభీర్‌తో కలిసి ఓజాతో మాట్లాడటం డ్రెస్సింగ్ రూమ్‌లో అంతర్గత విభేదాలు, కమ్యూనికేషన్ గ్యాప్ ఉందనే అభిప్రాయాన్ని మరింత పెంచాయి.

కోచ్ గౌతమ్ గంభీర్, సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య నెలకొన్న ఉద్రిక్తతకు కారణాలుగా కొన్ని విషయాలను నివేదికలు సూచిస్తున్నాయి. వీరి ముగ్గురి మధ్య సంబంధం బోర్డర్‌లైన్ కోల్డ్ గా, అంటే దాదాపు చల్లగా ఉన్నట్లుగా నివేదికలు చెప్తున్నాయి. కమ్యూనికేషన్ సరిగా లేకపోవడం భారత క్రికెట్ అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.

గంభీర్ కోచ్‌గా వచ్చిన తర్వాత భారత టెస్ట్ జట్టు పేలవమైన ఫలితాలు సాధించడం, సోషల్ మీడియాలో అభిమానుల నుంచి ఆయన తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవడం ఈ వివాదాన్ని మరింత పెంచింది. ఈ సమస్య తీవ్రతరం అవుతుండటం పట్ల బీసీసీఐ కూడా ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. మైదానంలో జరిగిన సంఘటనలు, వైరల్ వీడియోలు ఈ పుకార్లకు మరింత బలం చేకూర్చాయి. సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డే తర్వాత రోహిత్ శర్మ, గంభీర్ మధ్య జరిగిన సీరియస్ పోస్ట్-మ్యాచ్ చర్చ ఒకటి వైరల్ అయింది.

కోహ్లీ తొలి వన్డే అనంతరం గంభీర్‌ను పట్టించుకోకుండా, షేక్‌హ్యాండ్ ఇవ్వకుండా పక్కనుంచి నడిచి వెళ్లిపోతున్నట్లు కనిపించిన మరో వీడియో కూడా వివాదాన్ని రాజేసింది. ఈ సంకేతాలు, సోషల్ మీడియా విశ్లేషణలన్నీ భారత క్రికెట్ జట్టులోని సీనియర్ వ్యక్తుల మధ్య నెలకొన్న విభేదాల ప్రశ్నను బలంగా ముందుకు తెచ్చాయి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..