Renuka Thakur : ప్రపంచకప్ విజయంలో హిమాచల్ ఆడబిడ్డ కీలక పాత్ర.. రేణుకా ఠాకూర్‎కు సీఎం బంపర్ ఆఫర్

భారత మహిళా క్రికెట్ జట్టు తొలిసారిగా వన్డే ప్రపంచకప్ 2025 టైటిల్‌ను గెలుచుకోవడంతో దేశమంతటా సంబరాలు మిన్నంటాయి. ఈ చారిత్రక విజయంలో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్లలో హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన స్టార్ బౌలర్ రేణుకా ఠాకూర్ ఒకరు. దేశానికి గర్వకారణంగా నిలిచిన తమ రాష్ట్ర ఆడబిడ్డను గౌరవిస్తూ, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు ఒక భారీ ప్రకటన చేశారు.

Renuka Thakur : ప్రపంచకప్ విజయంలో హిమాచల్ ఆడబిడ్డ కీలక పాత్ర.. రేణుకా ఠాకూర్‎కు సీఎం బంపర్ ఆఫర్
Renuka Thakur

Updated on: Nov 03, 2025 | 4:43 PM

Renuka Thakur : భారత మహిళా క్రికెట్ జట్టు తొలిసారిగా వన్డే ప్రపంచకప్ 2025 టైటిల్‌ను గెలుచుకోవడంతో దేశమంతటా సంబరాలు మిన్నంటాయి. ఈ చారిత్రక విజయంలో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్లలో హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన స్టార్ బౌలర్ రేణుకా ఠాకూర్ ఒకరు. దేశానికి గర్వకారణంగా నిలిచిన తమ రాష్ట్ర ఆడబిడ్డను గౌరవిస్తూ, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు ఒక భారీ ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి స్వయంగా రేణుకా ఠాకూర్‌కు ఫోన్ చేసి, అభినందనలు తెలపడంతో పాటు రూ.కోటి నగదు బహుమతిని ప్రకటించారు.

భారత మహిళా క్రికెట్ జట్టు సౌతాఫ్రికాను ఓడించి తమ మొట్టమొదటి ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకున్న తరువాత, విజయంలో కీలక పాత్ర పోషించిన హిమాచల్ ప్రదేశ్ స్టార్ బౌలర్ రేణుకా ఠాకూర్‌ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు ప్రత్యేకంగా అభినందించారు. ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు వెంటనే రేణుకా ఠాకూర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా దేశం గర్వపడేలా చేసిన రేణుకకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోటి రూపాయల నగదు బహుమతిని అందజేస్తామని ప్రకటించారు.

సీఎం సుఖ్విందర్ సింగ్ రేణుకతో ఫోన్‌లో మాట్లాడుతూ ఆమెను రాష్ట్రంలోని యువతకు ఆదర్శంగా పేర్కొన్నారు. “దేశంలోని ఆడబిడ్డలు ప్రపంచంలో భారత్ పేరును నిలబెట్టారు. హిమాచల్ బిడ్డ అయిన రేణుక టీమ్‌లో ఆడటం రాష్ట్రం మొత్తానికి గర్వకారణం. ఆమె రాష్ట్ర యువతకు స్ఫూర్తిగా నిలిచింది” అని ముఖ్యమంత్రి కొనియాడారు. పర్వత ప్రాంతానికి చెందిన దాదాపు ప్రతి అమ్మాయి కలను రేణుక నిజం చేసిందని సీఎం అన్నారు. కష్టపడి, పోరాడి ప్రపంచకప్ గెలిచిన జట్టులో భాగం కావడం దేశానికి, హిమాచల్ ప్రదేశ్‌కు గొప్ప గౌరవమని పేర్కొన్నారు. నమ్మకం, పట్టుదల ఉంటే ఏ కలను అయినా నిజం చేసుకోవచ్చని రేణుక నిరూపించిందని సుఖు ప్రశంసించారు. ముఖ్యమంత్రి ఆస్ట్రేలియాపై జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌ను సగం వరకు ఫైనల్ మ్యాచ్‌ను ఎక్కువగా చూశానని తెలిపారు.

భారత జట్టు ప్రపంచకప్‌ను గెలుచుకోవడంతో, ఆ జట్టులో ఆడిన ప్రతి క్రీడాకారిణి స్వగ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. రోహ్రూలోని రేణుకా ఠాకూర్ స్వగ్రామం చుట్టుపక్కల ఆమె కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. ఈ చారిత్రక విజయాన్ని పురస్కరించుకుని రేణుక కుటుంబం గ్రామం మొత్తానికి విందు ఏర్పాటు చేసింది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..