
IND vs NZ : గౌహతి వేదికగా జరిగిన మూడో టీ20లో భారత్ తన విశ్వరూపం చూపించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యం టీమిండియాకు ఏమాత్రం పెద్దదిగా అనిపించలేదు. అభిషేక్ శర్మ కేవలం 20 బంతుల్లో 68 పరుగులు, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 26 బంతుల్లో 57 పరుగులు చేయడంతో టీమిండియా కేవలం 10 ఓవర్లలోనే అంటే 60 బంతుల్లోనే మ్యాచ్‌ను ముగించేసింది. ఈ గెలుపుతో సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకోవడమే కాకుండా, అంతర్జాతీయ క్రికెట్‌లో అనేక పాత రికార్డులను చెరిపివేసి కొత్త రికార్డులను లిఖించింది.
వేగవంతమైన 50 పరుగులు: టీమిండియా ఈ మ్యాచ్‌లో తన అత్యంత వేగవంతమైన 50 పరుగుల రికార్డును తిరగరాసింది. కేవలం 3.1 ఓవర్లలోనే (అంటే 19 బంతుల్లోనే) 50 పరుగుల మైలురాయిని దాటింది. గతంలో 2023లో బంగ్లాదేశ్‌పై 22 బంతుల్లో 50 పరుగులు చేసిన రికార్డును ఇవాళ పటాపంచలు చేసింది. అభిషేక్ శర్మ ఆరంభం నుంచే సిక్సర్ల వర్షం కురిపించడంతో ఈ ఘనత సాధ్యమైంది.
పవర్‌ప్లేలో పంజా: సాధారణంగా పవర్‌ప్లేలో (తొలి 6 ఓవర్లు) 50-60 పరుగులు చేస్తేనే గొప్పగా భావిస్తారు. కానీ భారత్ ఏకంగా 94 పరుగులు పిండుకుంది. ఇది టీ20 క్రికెట్ చరిత్రలోనే పవర్‌ప్లేలో నమోదైన రెండో అత్యధిక స్కోరు. ఇంగ్లండ్ జట్టు పేరిట ఉన్న 95 పరుగుల ప్రపంచ రికార్డును భారత్ తృటిలో మిస్ అయ్యింది. అయితే న్యూజిలాండ్‌పై పవర్‌ప్లేలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా ఆస్ట్రేలియా (91 పరుగులు) రికార్డును భారత్ అధిగమించింది.
పాకిస్థాన్ రికార్డు సమం: ఈ విజయంతో టీమిండియా వరుసగా 11వ టీ20 సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంది. గతంలో పాకిస్థాన్ జట్టు 2016-18 మధ్య వరుసగా 11 సిరీస్‌లను గెలిచి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇప్పుడు టీమిండియా ఆ ఘనతను సమం చేసింది. మరో సిరీస్ గెలిస్తే టీమిండియా ఈ విషయంలో ప్రపంచంలోనే నంబర్ వన్ జట్టుగా అవతరిస్తుంది. సూర్య నాయకత్వంలో జట్టు ఓటమి అన్నదే ఎరుగకుండా దూసుకుపోతోంది.
బంతుల పరంగా రికార్డు ఛేదన: టీ20 చరిత్రలో 150 కంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని అత్యధిక బంతులు మిగిలి ఉండగానే ఛేదించిన ప్రపంచ రికార్డును భారత్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో 154 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం 10 ఓవర్లలోనే పూర్తి చేసింది. అంటే ఇంకా 60 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. గతంలో వెస్టిండీస్ పేరిట ఉన్న రికార్డును భారత్ తుడిచిపెట్టేసింది. గౌహతి గడ్డపై టీమిండియా చేసిన ఈ రికార్డుల విన్యాసం క్రికెట్ ప్రేమికులకు చిరకాలం గుర్తుండిపోతుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..