
Ravi Bishnoi : ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ అదృష్టం మామూలుగా లేదు. ముఖ్యంగా ఆ జట్టు నమ్ముకున్న యువ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తన మాయాజాలంతో గుజరాత్ టైటాన్స్ నోటికాడ ముద్దను లాగేసుకున్నాడు. గత రెండు సీజన్లలో ఫామ్ లేక ఇబ్బంది పడ్డ ఈ స్పిన్ మాంత్రికుడు, ఇప్పుడు రాజస్థాన్ జెర్సీలో సింహంలా గర్జించాడు. గుజరాత్ చేతుల్లో ఉందనుకున్న మ్యాచ్‌ను తన 4 వికెట్ల స్పెల్‌తో ఒక్కసారిగా మలుపు తిప్పాడు. అహ్మదాబాద్‌లో జరిగిన ఈ పోరులో గుజరాత్ టైటాన్స్ 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చాలా ధీమాగా కనిపించింది. ముఖ్యంగా సాయి సుదర్శన్ 73 పరుగులతో క్రీజులో పాతుకుపోయి మ్యాచ్‌ను గుజరాత్ వైపు తిప్పేస్తున్నాడు. ఆ సమయంలో బంతిని అందుకున్న రవి బిష్ణోయ్, తన గూగ్లీలతో మాయ చేశాడు. వరుసగా రెండు వికెట్లు తీసి గుజరాత్ ఇన్నింగ్స్‌ను దెబ్బతీశాడు. మొత్తం 4 ఓవర్లలో 41 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా సెట్ బ్యాటర్ సాయి సుదర్శన్ వికెట్ తీయడమే ఈ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి.
మ్యాచ్ అనంతరం బిష్ణోయ్ తన మనసులోని మాటను పంచుకున్నాడు. “గత సీజన్ నాకు చాలా కష్టంగా గడిచింది. నా లెంగ్త్ విషయంలో చిన్న పొరపాటు జరిగినా బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లు బాదేవారు. అందుకే ఈసారి ఆఫ్-సీజన్‌లో నా బౌలింగ్ లెంగ్త్ మీద, శారీరక దృఢత్వం మీద చాలా వర్కౌట్ చేశాను. డొమెస్టిక్ క్రికెట్ ఆడి నా తప్పులను సరిదిద్దుకున్నాను. ఈరోజు నేను వైవిధ్యంగా బౌలింగ్ చేయడం వల్లే బ్యాటర్లు తడబడ్డారు” అని వివరించాడు. బిష్ణోయ్ ప్రదర్శన వల్ల రాజస్థాన్ రాయల్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌కు చేరుకుంది.
Turning the tide 🌊
🎥 Ravi Bishnoi’s double strike that swung the momentum @rajasthanroyals‘ way ☝️☝️
Updates ▶️ https://t.co/6D02Fh0IHv#TATAIPL | #KhelBindaas | #GTvRR pic.twitter.com/OTboJbddRY
— IndianPremierLeague (@IPL) April 4, 2026
రవి బిష్ణోయ్ గత రెండేళ్లుగా లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తరపున ఆడుతూ ఫామ్ కోల్పోయి విమర్శలు ఎదుర్కొన్నాడు. 2024లో 14 మ్యాచ్‌ల్లో కేవలం 10 వికెట్లు, 2025లో 11 మ్యాచ్‌ల్లో 9 వికెట్లే తీశాడు. అప్పట్లో అతని ఎకానమీ రేటు 10.83కి చేరుకోవడంతో లక్నో టీమ్ అతన్ని వదిలేసింది. కానీ 2026 వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఇతనిపై నమ్మకం ఉంచి రూ.7.20 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఆ నమ్మకాన్ని బిష్ణోయ్ మొదటి రెండు మ్యాచ్‌ల్లోనే నిలబెట్టుకున్నాడు.
కేవలం బిష్ణోయ్ మాత్రమే కాదు, ఆఖరి ఓవర్లో తుషార్ దేశ్‌పాండే తన ప్లాన్లను కచ్చితంగా అమలు చేసి 11 పరుగులను కాపాడుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ చివరి వరకు పోరాడినా, రాజస్థాన్ బౌలర్ల వ్యూహాల ముందు తలవంచక తప్పలేదు. రాజస్థాన్ జట్టులో ఈసారి బౌలింగ్ యూనిట్ చాలా బలంగా కనిపిస్తోంది. బిష్ణోయ్ తిరిగి ఫామ్‌లోకి రావడం ఆ జట్టుకు ప్లస్ పాయింట్ అయింది. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఫైనల్ వరకు వెళ్లడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..