48 బంతుల్లో 125 పరుగులు.. మాస్ బ్యాటింగ్ కాదు, చెత్త బౌలింగ్! టీమిండియాలో రన్ లీక్ మెషీన్

ఐర్లాండ్‌పై టీమిండియా ఓటమిని అభిమానులు తేలిగ్గా తీసుకున్నా, ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. చివరి రెండు టీ20 మ్యాచ్‌లలో (ఐర్లాండ్, ఆస్ట్రేలియా) 8 ఓవర్లలో 125 పరుగులు సమర్పించి ఒక్క వికెట్ కూడా తీయకపోవడం అతని ఎంపికపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఎకానమీ 11కి పైగా ఉన్న ప్రసిద్ధ్‌కు ఎందుకు అవకాశాలు ఇస్తున్నారని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.

48 బంతుల్లో 125 పరుగులు.. మాస్ బ్యాటింగ్ కాదు, చెత్త బౌలింగ్! టీమిండియాలో రన్ లీక్ మెషీన్
Prasidh Krishna

Updated on: Jun 27, 2026 | 12:51 PM

ఐర్లాండ్‌పై టీమిండియా ఓటమిని క్రికెట్ అభిమానులు పెద్దగా సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయిలే.. అయినా ఐర్లాండ్ బాగా ఆడింది, వాళ్లని మెచ్చుకోవాలి అంటూ సోషల్ మీడియాలో ఈ ఓటమిని సరదాగా తీసుకుంటున్నారు. కానీ టీమ్‌లో కొంతమంది ఆటగాళ్లపై మాత్రం చాలా ఆగ్రహంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అందులో ఒక ప్లేయర్ ప్రసిద్ధ్ కృష్ణ. ఇటీవలె ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఓ మ్యాచ్‌లో మంచి ప్రదర్శన చేసి ఐదు వికెట్ల హాల్ సాధించాడని అంతా అతన్ని మెచ్చుకున్నారు. కానీ ఇంతలోనే చెత్త బౌలర్ అంటూ సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

నిజానికి టీ20ల్లో ప్రసిద్ధ్ కృష్ట ప్రదర్శన అంత గొప్పగా ఏం లేదు. ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు ఆడి 6 వికెట్లు తీసుకున్నాడు. పైగా అతని ఎకానమీ చాలా దారుణంగా ఉంది. 11కి పైగా ఎకానమీతో టీ20ల్లో ఖరీదైన బౌలర్‌గా మారుతున్నాడు. పైగా ప్రసిద్ధ్ ఆడిన చివరి రెండు టీ20 మ్యాచ్‌ల్లో కలిపి అతను ఇచ్చిన రన్స్ ఎన్నో తెలిస్తే షాక్ అవుతారు. తాజాగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్ల కోటా పూర్తి చేసి 57 పరుగులు సమర్పించుకున్నాడు. అంతకుముందు 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన ఓ టీ20 మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసి ఏకంగా 68 పరుగులు ఇచ్చుకున్నాడు. అంటే రెండు మ్యాచ్‌ల్లో 8 ఓవర్లు వేసి అతను ఇచ్చిన రన్స్ 125. కేవలం 48 బంతుల్లోనే 125 పరుగులు సమర్పించాడు.

పైగా మరో దారుణం ఏంటంటే.. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ అతనికి వికెట్ దక్కలేదు. 2023లో చివరి సారిగా అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడిన ప్రసిద్ధ్.. మళ్లీ ఇప్పుడే భారత టీ20 టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. టీ20ల్లో అంతమంచి రికార్డ్ లేని ప్రసిద్ధ్‌ను ఎందుకు ఎంపిక చేశారంటూ విమర్శలు వస్తున్నాయి. ఇతని కోసం మొహమ్మద్ సిరాజ్‌ను రెస్ట్ పేరిట పక్కన పెట్టారా? అంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే 2023లో ఆస్ట్రేలియా సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన ప్రసిద్ధ్.. వరుసగా 50, 41, 68 పరుగులు ఇచ్చాడు. ఏ మాత్రం ఇంప్యాక్ట్ చూపించలేకపోతున్న ప్రసిద్ధ్‌‌ను ఎందుకు టీమ్‌లో కంటిన్యూ చేస్తూ ఇన్ని అవకాశాలు ఇస్తున్నారో అర్థం కావడం లేదంటూ క్రికెట్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని ఆసక్తికర క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us