
Pakistan Cricket : పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మరోసారి తన పాత అలవాటును రిపీట్ చేసింది. జట్టు ప్రదర్శన సరిగ్గా లేనప్పుడు లేదా బోర్డులో మార్పులు వచ్చినప్పుడు కోచ్‌లను అర్ధాంతరంగా తొలగించడం పీసీబీకి వెన్నతో పెట్టిన విద్య. తాజాగా పాక్ టెస్ట్ టీమ్ హెడ్ కోచ్ అజహర్ మహమూద్‌ను కాంట్రాక్ట్ ముగియకముందే పదవి నుంచి తొలగించింది. అయితే ఈ నిర్ణయం పాక్ బోర్డు జేబుకు భారీ చిల్లు పెట్టింది.
అజహర్ మహమూద్‌తో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు మార్చి 2026 వరకు ఒప్పందం ఉంది. కానీ ఆ కాంట్రాక్ట్ ముగియడానికి మూడు నెలల ముందే అతడిని తప్పించాలని బోర్డు నిర్ణయించుకుంది. పీసీబీ నిబంధనల ప్రకారం.. ఒక కోచ్‌ను గడువు కంటే ముందే తొలగిస్తే, అతనికి ఆరు నెలల జీతాన్ని పరిహారంగా చెల్లించాలి. అజహర్ నెలకు సుమారు 75 లక్షల పాకిస్థానీ రూపాయల జీతం తీసుకుంటున్నాడు. ఈ లెక్కన బోర్డు అతనికి ఏకంగా 45 కోట్ల పాకిస్థానీ రూపాయలను (భారత కరెన్సీలో సుమారు 13.6 కోట్లు) నష్టపరిహారంగా చెల్లించాల్సి వస్తోంది. పని చేయకుండానే అజహర్‌కు ఇంత భారీ మొత్తం దక్కడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
పాకిస్థాన్ క్రికెట్‌లో స్థిరత్వం అనేది అస్సలు ఉండదు. గత ఆరేళ్ల కాలంలో పాక్ బోర్డు ఏకంగా ఆరుగురు కోచ్‌లను మార్చడం విశేషం. 2019లో మిస్బావుల్ హక్ నుంచి మొదలైన ఈ ప్రస్థానం.. సక్లైన్ ముస్తాక్, అబ్దుల్ రెహ్మాన్, గ్రాంట్ బ్రాడ్‌బర్న్, మహమ్మద్ హఫీజ్ మీదుగా ఇప్పుడు అజహర్ మహమూద్ వరకు వచ్చింది. ఫలితాలు ఆశించిన స్థాయిలో రావడం లేదని కోచ్‌లను మార్చడం పీసీబీకి అలవాటుగా మారింది, కానీ దానివల్ల బోర్డు ఖజానా మాత్రం ఖాళీ అవుతోంది.
పాకిస్థాన్ తరపున అద్భుతమైన ఆల్ రౌండర్‌గా పేరు తెచ్చుకున్న అజహర్ మహమూద్.. 21 టెస్టులు, 143 వన్డేలు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తం 162 వికెట్లు పడగొట్టడంతో పాటు 2,421 పరుగులు చేశాడు. ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్స్‌లో ఆడిన అనుభవం కూడా అతనికి ఉంది. టీ20 ఫార్మాట్‌లో 258 వికెట్లు, 4,091 పరుగులు చేసిన ఘనత అతడి సొంతం. ఇంతటి అనుభవం ఉన్న కోచ్‌ను కూడా పాక్ బోర్డు సరిగ్గా వాడుకోలేకపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..