BCCI vs PCB: ట్రోఫీ కోసం రంగంలోకి బీసీసీఐ.. ఐసీసీ నుంచి పాకిస్తాన్ బహిష్కరణ..?

Asia Cup 2025 Trophy: ఐసీసీ సమావేశంలో బీసీసీఐ, పీసీబీ మధ్య పెద్ద యుద్ధమే జరిగే అవకాశం కనిపిస్తోంది. ట్రోఫీని చివరికి భారత్‌కు ఎలా, ఎప్పుడు అందజేస్తారనే దానిపై ప్రపంచ క్రికెట్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఈ క్రమంలో బీసీసీఐ చర్యలు తీసుకునే అవకాశం ఉండటంతో, పీసీబీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

BCCI vs PCB: ట్రోఫీ కోసం రంగంలోకి బీసీసీఐ.. ఐసీసీ నుంచి పాకిస్తాన్ బహిష్కరణ..?
Bcci Vs Pcb

Updated on: Oct 23, 2025 | 9:19 AM

Asia Cup 2025: ఆసియా కప్ 2025 ఫైనల్ ముగిసి చాలా కాలమైనా, విజేతగా నిలిచిన టీమిండియాకు ఇంకా ట్రోఫీ దక్కకపోవడంతో ఈ వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఛైర్మన్ మొహసిన్ నఖ్వీ మొండి వైఖరిపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

తాజాగా, బీసీసీఐ నుంచి గట్టి హెచ్చరిక అందడంతో, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తమ లీగల్ విభాగాన్ని రంగంలోకి దించింది. రాబోయే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) సమావేశంలో బీసీసీఐ చర్యలు తీసుకునే అవకాశం ఉండటంతో, పీసీబీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

ట్రోఫీ ఇవ్వకుంటే ఐసీసీలో చర్యలే: బీసీసీఐ హెచ్చరిక..

ఆసియా కప్ ఫైనల్ తర్వాత మొహసిన్ నఖ్వీ ట్రోఫీని తన వెంట తీసుకెళ్లిన విషయం తెలిసిందే. తన చేతుల మీదుగా ట్రోఫీని తీసుకుంటేనే ఇస్తానని, లేకపోతే దుబాయ్‌లోని ఏసీసీ కార్యాలయం నుంచి వచ్చి తీసుకోవాలని ఆయన షరతులు పెట్టారు. పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి కూడా అయిన నఖ్వీ వ్యవహారశైలిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఇవి కూడా చదవండి

దీంతో, ట్రోఫీని వెంటనే భారత జట్టుకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ బీసీసీఐ ఇటీవల నఖ్వీకి మరో హెచ్చరికతో కూడిన లేఖను పంపింది. ట్రోఫీని సక్రమంగా అప్పగించకపోతే, వచ్చే నెల (డిసెంబర్ 4-7) దుబాయ్‌లో జరగబోయే ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తుతామని, నఖ్వీపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతామని ఆ లేఖలో స్పష్టం చేసింది. అంతేకాకుండా, నఖ్వీని ఐసీసీ బోర్డు ఆఫ్ డైరెక్టర్ పదవి నుంచి తొలగించే ప్రయత్నం చేసే అవకాశం కూడా ఉందని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

బీసీసీఐ చర్యలను ఎదుర్కొనేందుకు పీసీబీ సన్నాహాలు..

బీసీసీఐ నుంచి కీలక హెచ్చరికలు రావడంతో, మొహసిన్ నఖ్వీ సారథ్యంలోని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తమ లీగల్ విభాగానికి కీలక ఆదేశాలు జారీ చేసింది.

బీసీసీఐ అధికారులు ఐసీసీ సమావేశంలో నఖ్వీని నిందించడానికి లేదా ఆయనపై చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తే, దాన్ని ఎదుర్కొనేందుకు వీలుగా పూర్తి వివరాలతో కూడిన డాసియర్‌‌ను సిద్ధం చేయాలని పీసీబీ తన లీగల్ విభాగాన్ని ఆదేశించింది.

నఖ్వీ తన స్పందనలోనూ వెనక్కి తగ్గలేదు. “ఏసీసీ ట్రోఫీ భారత జట్టుకే చెందుతుంది. అయితే, బీసీసీఐ అధికారి, అందుబాటులో ఉన్న భారత ఆటగాడితో కలిసి దుబాయ్‌లో తాను నిర్వహించే కార్యక్రమంలో తన చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోవచ్చు” అని నఖ్వీ తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని కూడా ఆయన పట్టుబట్టారు.

ఈ మొత్తం వ్యవహారం భారత్-పాకిస్థాన్ క్రికెట్ బోర్డుల మధ్య అపనమ్మకాన్ని, ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఐసీసీ సమావేశంలో బీసీసీఐ, పీసీబీ మధ్య పెద్ద యుద్ధమే జరిగే అవకాశం కనిపిస్తోంది. ట్రోఫీని చివరికి భారత్‌కు ఎలా, ఎప్పుడు అందజేస్తారనే దానిపై ప్రపంచ క్రికెట్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..