PAK Vs SA: ఒరేయ్ ఆజామూ.! పాకిస్తాన్ ప్రపంచ రికార్డు కొట్టేసిందిరోయ్.. ఎందులోనంటే.?

ఒరేయ్ ఆజామూ.! పాకిస్తాన్ ప్రపంచ రికార్డు కొట్టేసిందిరోయ్.. ఆ జట్టు ఇద్దరు బ్యాటర్లు అదరగొట్టే సెంచరీలతో.. చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 350 పరుగుల భారీ స్కోర్‌ను అత్యంత సునాయాసంగా చేధించేశారు. మరి ఆ మ్యాచ్ ఏంటి.? ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందామా..

PAK Vs SA: ఒరేయ్ ఆజామూ.! పాకిస్తాన్ ప్రపంచ రికార్డు కొట్టేసిందిరోయ్.. ఎందులోనంటే.?
Pakistan Cricket

Updated on: Feb 13, 2025 | 11:19 AM

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్తాన్ జట్టు తిరిగి ఫామ్ రాబట్టుకుంటోంది. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌తో జరుగుతోన్న ట్రై సిరీస్‌లో వరుసగా అద్భుత ప్రదర్శనలు కనబరుస్తోంది. బుధవారం దక్షిణాఫ్రికా విధించిన 353 పరుగుల భారీ స్కోరును అత్యంత సునాయాసంగా చేధించి చరిత్ర సృష్టించింది. ఇది పాక్ క్రికెట్ చరిత్రలో అతిపెద్ద విజయవంతమైన ఛేజింగ్. అంతకుముందు 2022లో, ఆస్ట్రేలియాపై 349 పరుగుల లక్ష్యాన్ని సాధించింది పాకిస్తాన్. ఇక ఈ విజయంతో పాక్ జట్టు.. దక్షిణాఫ్రికాను 6 వికెట్ల తేడాతో ఓడించడమే కాకుండా ముక్కోణపు సిరీస్‌లో ఫైనల్‌కు కూడా చేరుకుంది. ఈ పెద్ద విజయంలో కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్, సల్మాన్ అగా కీలక పాత్రలు పోషించారు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 260 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రిజ్వాన్ అజేయంగా 122 పరుగులు చేయగా, సల్మాన్ 134 పరుగులు సాధించాడు.

కరాచీలో రిజ్వాన్-సల్మాన్ అద్భుతం..

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌తో ట్రయాంగిల్ సిరీస్‌లో పాల్గొంది పాకిస్తాన్. ఈ సిరీస్‌ తొలి మ్యాచ్‌లో పాక్ ఓడిపోయినా.. తర్వాతి మ్యాచ్‌లో గెలిచి.. ఫైనల్‌కు చేరింది. కరాచీలో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో పాక్ బ్యాటర్లు రిజ్వాన్, సల్మాన్ సెంచరీలతో అదరగొట్టారు. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 352 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇక ఈ టార్గెట్ చేధించే క్రమంలో పాకిస్తాన్ 91 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. దీంతో పాక్ ఈ మ్యాచ్ కూడా ఓడిపోతుందని అందరూ ఊహించారు. కానీ అప్పుడే కెప్టెన్ రిజ్వాన్, సల్మాన్ అగాతో కలిసి నాలుగో వికెట్‌కు 260 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వారిద్దరూ కలిసి తమ జట్టు స్కోరును 48.4 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి 351 పరుగులకు తీసుకెళ్లారు. అయితే ఆ తర్వాత సల్మాన్ 108 బంతుల్లో 134 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో మ్యాచ్‌ క్లైమాక్స్‌ను తాహిర్ ఫోర్ కొట్టి ముగించాడు.

353 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బాబర్ అజామ్, ఫఖర్ జమాన్ కలిసి పాకిస్థాన్‌కు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. పవర్‌ప్లేలో ఇద్దరూ త్వరగా పరుగులు సాధించారు. అయితే 7వ ఓవర్లో, బాబర్ 19 బంతుల్లో 23 పరుగులు చేసి 57 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీని తర్వాత కూడా, ఫఖర్ పేలవంగా బ్యాటింగ్ కొనసాగించాడు. అనంతరం 10వ ఓవర్లో సౌద్ షకీల్ 87 పరుగుల స్కోరు వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత రిజ్వాన్ 4వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఒక వైపు నుంచి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతూ.. స్కోర్‌ను ముందుకు సాగించాడు. ఆ సమయంలో ఫఖర్ జమాన్ 28 బంతుల్లో 41 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు. ఇక అప్పటి నుంచి సల్మాన్, రిజ్వాన్ ఇద్దరూ కలిసి చక్కటి బంతులను బౌండరీలకు పంపుతూ.. నాలుగో వికెట్‌కు 260 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి.. మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..