8 ఫోర్లు, 5 సిక్సులు.. 231 స్ట్రైక్‌రేట్‌తో హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్.. 23 ఏళ్ల బ్యాటర్ దెబ్బకు చిత్తైన బాబర్ సేన..

|

Sep 24, 2022 | 11:22 AM

Harry Brook: టీ20 ప్రపంచకప్ కోసం ఇంగ్లండ్ జట్టులో ఎంపికైన హ్యారీ బ్రూక్, పాకిస్థాన్‌తో జరిగిన సిరీస్‌లో తన జట్టు నిర్ణయం సరైనదేనని నిరూపించాడు.

8 ఫోర్లు, 5 సిక్సులు.. 231 స్ట్రైక్‌రేట్‌తో హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్.. 23 ఏళ్ల బ్యాటర్ దెబ్బకు చిత్తైన బాబర్ సేన..
Pak Vs Eng Harry Brook
Follow us on

గత కొన్ని సంవత్సరాలుగా ఇంగ్లండ్ క్రికెట్ జట్టులో ఇలాంటి బ్యాట్స్‌మెన్ చాలా మంది ఎంట్రీ ఇచ్చారు. వారు వైట్ బాల్ క్రికెట్‌లో బౌలర్లను ఓడించడానికి అస్సలు వెనుకంజ వేయరు. జోస్ బట్లర్, జానీ బెయిర్‌స్టో, అలెక్స్ హేల్స్, జాసన్ రాయ్, లియామ్ లివింగ్‌స్టన్ వంటి పేర్లు అందరి నోళ్లలో నానుతుంటాయంటే.. అందుకు కారణం తుఫాన్ బ్యాటింగ్. వీటి ప్రభావంతో మరికొంత మంది బ్యాట్స్ మెన్స్ ఇంగ్లిష్ క్రికెట్ జట్టులో చేరేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా అలాంటి ఓ బ్యాట్స్‌మెన్ పాకిస్థాన్‌ జట్టుకు చుక్కలు చూపించాడు. ఆ బ్యాటర్ పేరు హ్యారీ బ్రూక్.

దుమ్ము రేపిన 23 ఏళ్ల బ్యాట్స్‌మెన్..

గత రెండేళ్లుగా ఇంగ్లండ్ దేశవాళీ టోర్నీల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన 23 ఏళ్ల కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ హ్యారీ బ్రూక్.. ఈ ఏడాది ఇంగ్లండ్ తరపున అరంగేట్రం చేశాడు. బ్రూక్ కెరీర్ అంత బాగా ప్రారంభం కాకపోవచ్చు. కానీ, పాకిస్థాన్ పర్యటనలో మాత్రం తన సత్తా చాటుతున్నాడు. కరాచీ వేదికగా జరుగుతున్న టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో 42 పరుగులు చేసిన తర్వాత.. మూడో మ్యాచ్‌లో బ్రూక్ బౌండరీలతో చెలరేగాడు.

ఇవి కూడా చదవండి

24 బంతుల్లో తొలి అర్ధశతకం..

ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన బ్రూక్.. పరుగుల వేగాన్ని మరింత వేగవంతం చేశాడు. ఈ తుఫాన్ బ్యాట్స్‌మన్ పాకిస్తాన్‌ జట్టులోని ప్రతి బౌలర్‌ను చిత్తు చేశాడు. తొలి బంతి నుంచి 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. బ్రూక్ 16వ ఓవర్‌లో ఫోర్ల సహాయంతో T20 ఇంటర్నేషనల్స్‌లో తన మొదటి అర్ధ సెంచరీని సాధించాడు. కేవలం 24 బంతులు ఎదుర్కొని 4 సిక్సర్లు, 4 ఫోర్లు బాదేసి, హాఫ్ సెంచరీ చేశాడు.

8 ఫోర్లు, 5 సిక్సర్లు భారీ భాగస్వామ్యం..

ఇంగ్లండ్ వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకున్న బ్రూక్.. సెలక్టర్ల నమ్మకాన్ని సరిగ్గా వమ్ము చేయలేదు. స్టార్ బౌలర్లను చిత్తు చేయగల సత్తా తనకు ఉందని చాటి చెప్పాడు. అతను కేవలం 35 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో అజేయంగా 81 పరుగులు చేశాడు. బెన్ డకెట్ కూడా మరో ఎండ్ నుంచి బ్రూక్‌తో కలిసి అర్ధ సెంచరీని నమోదు చేశాడు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 69 బంతుల్లో 139 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరి భాగస్వామ్యంతో ఇంగ్లండ్ 221 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులకే పరిమితమైంది. దీంతో ఇంగ్లండ్ జట్టు 63 పరుగులతో భారీ విజయం సాధించింది. ఇంగ్లండ్ తరపున కీలక ఇన్నింగ్స్ ఆడిన బ్రూక్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.