
వరుణ్ అరుణ్.. తరువర్ కోహ్లీ.. ఇప్పుడు ఫైజ్ ఫజల్.. గత కొద్దిరోజుల్లో వరుసగా టీమిండియా వెటరన్ బ్యాటర్లు ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు. తన కెరీర్‌లో ఒకే ఒక్క వన్డే, 12 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు ఫైజ్ ఫజల్. ఆడిన ఒక్క వన్డేలోనూ అర్ధ సెంచరీతో మెరిసినా.. టీమిండియా సెలెక్టర్లు ఆ తర్వాత అతడికి సరైన అవకాశాలు ఇవ్వలేదు. కట్ చేస్తే.. భారత ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఓ అనామకుడిగా రిటైర్మెంట్ ప్రకటించాడు. రంజీ ట్రోఫీలో విదర్భ తరపున వేల పరుగులు చేసిన ఫైజ్.. టీమిండియా తరపున కేవలం ఒక్క అర్ధ సెంచరీ మాత్రమే నమోదు చేయగలిగాడు. తొలి మ్యాచ్‌తోనే తన కెరీర్ క్లోజ్ అయింది.
రంజీ ట్రోఫీలో విదర్భకు అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా ఫైజ్ ఫజల్ నిలిచాడు. దాదాపు 20 సంవత్సరాల తన సుదీర్ఘమైన డొమెస్టిక్ కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పెట్టాడు ఫైజ్ ఫజల్. విదర్భను రెండుసార్లు రంజీ ఛాంపియన్‌గా నిలపడంలో ఫైజల్ కృషి చాలానే ఉందని చెప్పొచ్చు. అలాగే అతడు విదర్భకు ఇరానీ ట్రోఫీని కూడా అందించాడు. ఈ ఆటగాడు 2003లో కేవలం 17 ఏళ్ల వయసులోనే రంజీ అరంగేట్రం చేశాడు. అరంగేట్రం మ్యాచ్‌లోనే 151 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. విదర్భ తరఫున 137 దేశవాళీ మ్యాచ్‌ల్లో 41.36 సగటుతో ఫైజ్ ఫజల్ 24 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలతో 9,183 పరుగులు చేశాడు. అతడు 108 రంజీ మ్యాచ్‌లకు విదర్భ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు.
దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా అద్భుత ప్రదర్శన ఇచ్చిన తర్వాత, ఫైజ్ ఫజల్‌కు టీమిండియా నుంచి పిలుపొచ్చింది. ఆ పిలుపు కోసం ఫజల్ దాదాపు 10 ఏళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. 30 ఏళ్ల తర్వాత 15 జూన్ 2016న, ఫజల్ జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో తన వన్డే అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో 55 పరుగులు చేసి అదరగొట్టాడు. కానీ ఆ తర్వాతి మ్యాచ్‌కే అతడు స్థానం కోల్పోయాడు. ఇదిలా ఉంటే.. 2004లో అండర్-19 ప్రపంచకప్ జట్టుకు ఎంపికయ్యాడు ఫజల్. కానీ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత శిఖర్ ధావన్ జట్టులోకి వచ్చాడు. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌లో ధావన్ అరంగేట్రం చేసి.. ఎలాంటి రికార్డులు నెలకొల్పాడో తెలిసిందే.