టీమిండియాపైనే ఏకైక సెంచరీ.. కట్ చేస్తే.. 13 ఏళ్ల జైలు శిక్ష, కెరీర్ ఖేల్ ఖతం.. ఎవరో తెలుసా?

|

Feb 14, 2023 | 10:14 AM

రూ.1.5 కోట్ల విలువైన కొకైన్‌తో ఇంగ్లాండ్‌ క్రికెటర్‌ ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డాడు. అతడు టెస్టుల్లో తన ఏకైక సెంచరీని టీమిండియాపైనే సాధించాడు.

టీమిండియాపైనే ఏకైక సెంచరీ.. కట్ చేస్తే.. 13 ఏళ్ల జైలు శిక్ష, కెరీర్ ఖేల్ ఖతం.. ఎవరో తెలుసా?
Cricket
Follow us on

రూ.1.5 కోట్ల విలువైన కొకైన్‌తో ఇంగ్లాండ్‌ క్రికెటర్‌ ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డాడు. అతడు టెస్టుల్లో తన ఏకైక సెంచరీని టీమిండియాపైనే సాధించాడు. ఇంతకీ అతడెవరో తెలుసా.? ఈ కథ ఈనాటిది కాదు, ఎన్నో ఏళ్ల క్రితం జరిగింది. ఆ ఆటగాడి పుట్టినరోజు ఫిబ్రవరి 14. 1968లో ప్రేమికుల రోజున జన్మించిన ఈ ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మరెవరో కాదు క్రిస్ లూయిస్. మరి అతడి అంతర్జాతీయ కెరీర్, రికార్డుల గురించి తెలుసుకుందామా.?

క్రిస్ లూయిస్‌ అద్భుతమైన టాలెంట్‌కు పెట్టింది పేరు. కానీ దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఎందుకంటే అతడి చెడు ప్రవర్తనతో ఎప్పుడూ వార్తల్లో నిలిచేవాడు. క్రమశిక్షణారాహిత్యం, సహచరులతో దురుసుగా ప్రవర్తించడం, కొన్నిసార్లు ప్రాక్టీస్‌కు ఆలస్యంగా రావడం.. ఇలా ఎన్నో ఘటనలు అతడి కెరీర్‌పై చెడు ప్రభావం చూపించాయి. వీటి కారణంగా దేశవాళీ క్రికెట్‌లో మంచి ప్రదర్శన చేసినప్పటికీ, లూయిస్ ఇంగ్లాండ్‌ జాతీయ జట్టులో పెద్దగా చోటు దక్కించుకోలేకపోయాడు.

భారత్‌పై తొలి సెంచరీ..

క్రిస్ లూయిస్ ఇంగ్లాండ్‌తో మొత్తం 6 విదేశీ పర్యటనలు చేశాడు. 1993లో భారత పర్యటనకు వచ్చి.. చెన్నైలో టెస్ట్ ఆడాడు. అక్కడ అతడు అద్భుతమైన సెంచరీతో అదరగొట్టగా.. అదే అతడి అంతర్జాతీయ క్రికెట్‌లో నమోదైన ఏకైక సెంచరీ. మరి లూయిస్ ఇంత సెంచరీ చేసినా.. ఇంగ్లాండ్ ఆ మ్యాచ్‌లో ఓడిపోయింది. దీని తర్వాత, అతడిపై మ్యాచ్ ఫిక్సింగ్ వంటి తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. కట్ చేస్తే కెరీర్ ముగిసింది.

కొకైన్‌తో అరెస్టయ్యాడు, 13 ఏళ్ల జైలు శిక్ష..

2008వ సంవత్సరం చివరిలో, క్రిస్ లూయిస్ దాదాపు రూ. 1.5 కోట్ల విలువైన కొకైన్‌తో గాట్విక్ విమానాశ్రయంలో అరెస్టయ్యాడు. అతడి అరెస్టు తర్వాత, కేసులో నిజానిజాలు నిర్ధారణ అయ్యాయి. అనంతరం లూయిస్‌కు 13 ఏళ్లపాటు జైలు శిక్ష పడింది. అయితే మంచి ప్రవర్తన రిత్యా అతడ్ని 6 ఏళ్ల అనంతరం జైలు నుంచి విడుదల చేశారు.