ODI World Cup 2027 : మూడు దేశాలు.. 54 మ్యాచ్‌లు.. 2003 తర్వాత ఆఫ్రికా గడ్డపై మెగా టోర్నీకి రంగం సిద్ధం

ODI World Cup 2027 : 2027 వన్డే ప్రపంచకప్ నిర్వహణ బాధ్యతలను ఐసీసీ ఇప్పటికే ఖరారు చేసింది. ఆఫ్రికా ఖండంలోని సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. 2003 తర్వాత ఆఫ్రికా గడ్డపై ప్రపంచకప్ జరగడం ఇదే మొదటిసారి.

ODI World Cup 2027 : మూడు దేశాలు.. 54 మ్యాచ్‌లు.. 2003 తర్వాత ఆఫ్రికా గడ్డపై మెగా టోర్నీకి రంగం సిద్ధం
Odi World Cup 2027

Updated on: Mar 22, 2026 | 4:28 PM

ODI World Cup 2027 : క్రికెట్ ప్రపంచంలో అతిపెద్ద సమరానికి రంగం సిద్ధమవుతోంది. 2027 వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2027) నిర్వహణ బాధ్యతలను ఐసీసీ ఇప్పటికే ఖరారు చేసింది. అయితే ఈసారి వరల్డ్ కప్ ఒక దేశంలోనో, రెండు దేశాల్లోనో కాదు.. ఏకంగా మూడు దేశాల్లో జరగబోతోంది. ఆఫ్రికా ఖండంలోని సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. 2003 తర్వాత ఆఫ్రికా గడ్డపై ప్రపంచకప్ జరగడం ఇదే మొదటిసారి. అయితే ఈ ఆతిథ్య దేశాల విషయంలో కొన్ని ఆసక్తికరమైన, వింతైన విషయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

ముగ్గురికి ఆతిథ్యం ఎందుకు?

ఆఫ్రికా ఖండంలో క్రికెట్‌ను మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావాలన్నదే ఐసీసీ ప్రధాన ఉద్దేశ్యం. 2003లో కూడా సౌతాఫ్రికా, జింబాబ్వేతో పాటు కెన్యా ఆతిథ్యం ఇచ్చాయి. ఈసారి కెన్యా స్థానంలో ఎదుగుతున్న జట్టుగా ఉన్న నమీబియాకు అవకాశం ఇచ్చారు. మొత్తం 14 జట్ల మధ్య జరిగే 54 మ్యాచ్‌లను నిర్వహించడం ఒక్క దేశానికి కష్టమవుతుంది కాబట్టి, రవాణా, వసతుల సౌకర్యం కోసం పొరుగు దేశాలైన ఈ మూడింటిని ఎంపిక చేశారు. ఇందులో 44 మ్యాచ్‌లు సౌతాఫ్రికాలో జరగనుండగా, మిగిలిన 10 మ్యాచ్‌లు జింబాబ్వే, నమీబియాల్లో జరుగుతాయి.

నమీబియాకు డైరెక్ట్ క్వాలిఫికేషన్ ఎందుకు లేదు?

సాధారణంగా ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇచ్చే దేశాలకు టోర్నీలో నేరుగా ఆడే అవకాశం లభిస్తుంది. కానీ 2027 వరల్డ్ కప్ విషయంలో నమీబియాకు ఈ ఛాన్స్ దక్కలేదు. సౌతాఫ్రికా, జింబాబ్వేలు ఐసీసీలో ఫుల్ మెంబర్స్ కాబట్టి వారికి డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చారు. కానీ నమీబియా కేవలం అసోసియేట్ మెంబర్ మాత్రమే. అందుకే వారు ఆతిథ్య దేశమైనప్పటికీ, క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఆడి గెలిస్తేనే మెగా టోర్నీలో అడుగుపెట్టగలరు. సొంత గడ్డపై జరిగే వరల్డ్ కప్ ఆడాలంటే నమీబియా ముందు కష్టపడక తప్పదు.

మైదానాల్లో లైట్లు లేని వింత పరిస్థితి

నమీబియా గురించి మరో షాకింగ్ విషయం ఏమిటంటే, అక్కడ ఉన్న ఏ క్రికెట్ మైదానంలోనూ ప్రస్తుతం ఫ్లడ్‌లైట్ల సౌకర్యం లేదు. అంటే అక్కడ డే-నైట్ మ్యాచ్‌లు నిర్వహించడం అసాధ్యం. అక్కడ జరిగే మ్యాచ్‌లన్నీ పగటిపూట మాత్రమే ఆడాల్సి ఉంటుంది. అయితే 2027 వరకు ఇంకా సమయం ఉంది కాబట్టి, నమీబియా బోర్డు మైదానాల్లో లైట్లను ఏర్పాటు చేసే పనిలో ఉంది. ఒకవేళ అది సాధ్యం కాకపోతే వరల్డ్ కప్ చరిత్రలోనే ఇదొక వెరైటీ టోర్నీగా నిలిచిపోతుంది.

ఆర్థిక, క్రీడా ప్రయోజనాలు

ఈ మూడు దేశాలు కలిసి వరల్డ్ కప్ నిర్వహించడం వల్ల ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఎత్తున ఊతం లభిస్తుందని ఐసీసీ భావిస్తోంది. పర్యాటక రంగం అభివృద్ధి చెందడమే కాకుండా, స్థానిక ఆటగాళ్లకు అంతర్జాతీయ స్థాయి అనుభవం లభిస్తుంది. ముఖ్యంగా నమీబియా వంటి చిన్న దేశానికి ఇదొక చారిత్రక అవకాశం. ఆఫ్రికా ఖండం మొత్తం క్రికెట్ ఫీవర్ తో ఊగిపోవడానికి ఈ 2027 వరల్డ్ కప్ పునాది కానుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us