
2027 World Cup: ప్రపంచ కప్ 2027 తర్వాత వన్డే అంతర్జాతీయ (ODI) ఫార్మాట్ మనుగడపై భారత మాజీ ఆఫ్-స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆందోళన వ్యక్తం చేశారు. టీ20 లీగ్‌ల పెరుగుతున్న ఆదరణ, టెస్ట్ క్రికెట్ పట్ల ఉన్న శాశ్వత ఆకర్షణ మధ్య, 50 ఓవర్ల మ్యాచ్‌ల ప్రాధాన్యత వేగంగా తగ్గిపోతోందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
తన యూట్యూబ్ ఛానెల్ ‘యాష్ కి బాత్’లో మాట్లాడుతూ, “2027 ప్రపంచ కప్ తర్వాత వన్డేల భవిష్యత్తు గురించి నాకు ఖచ్చితంగా తెలియదు. దీని గురించి నేను కొంచెం ఆందోళన చెందుతున్నాను. టెస్ట్ క్రికెట్‌కు ఇంకా స్థానం ఉందని నేను భావిస్తున్నాను, కానీ వన్డే క్రికెట్‌కు ఆ అవకాశం లేదనిపిస్తోంది” అని అశ్విన్ పేర్కొన్నారు.
డొమెస్టిక్ వన్డే ఫార్మాట్‌పై ఆసక్తిని నిలబెట్టడంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి స్టార్ ఆటగాళ్ల ప్రభావం కీలకంగా మారిందని ఆయన అన్నారు. “రోహిత్, విరాట్ విజయ్ హజారే ట్రోఫీకి తిరిగి వచ్చినప్పుడు ప్రజలు చూడటం ప్రారంభించారు. వారు ఆడటం మానేసినప్పుడు ఏమవుతుంది?” అని ఆయన ప్రశ్నించారు. ఎంఎస్ ధోనీ వంటి ఆటగాళ్లను తయారు చేసిన వన్డే క్రికెట్, ఇప్పుడు రెండు కొత్త బంతులు, ఐదుగురు ఫీల్డర్లు సర్కిల్ లోపల ఉండటం వంటి నిబంధనల వల్ల తన సహజత్వాన్ని కోల్పోయిందని ఆయన విశ్లేషించారు.
అంతర్జాతీయ క్యాలెండర్‌పై వ్యాఖ్యానిస్తూ, ఐసీసీ (ICC) ప్రతి ఏటా ఆదాయం కోసం టోర్నమెంట్లు నిర్వహించడం వల్ల ప్రపంచ కప్ విలువ తగ్గుతోందని, ఫిఫా (FIFA) తరహాలో నాలుగేళ్లకు ఒకసారి మాత్రమే ప్రపంచ కప్ నిర్వహించి, మధ్యలో లీగ్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలని అశ్విన్ సూచించారు. “వరుసగా ద్వైపాక్షిక సిరీస్‌లు, ఎక్కువ ఫార్మాట్లు, ఎక్కువ ప్రపంచ కప్‌లు ఉండటం వల్ల ఈ క్రీడ అతిగా మారుతోంది. వన్డే క్రికెట్ నెమ్మదిగా అంతరించిపోయే దిశగా వెళ్తోందని నేను భావిస్తున్నాను” అని ఆయన ముగించారు.