
Rajasthan Royals New Captain: ఐపీఎల్‌లో ట్రేడ్ విండో వేడి రాజుకుంటున్న నేపథ్యంలో, రాజస్థాన్ రాయల్స్ (RR) కెప్టెన్ సంజూ శాంసన్ (Sanju Samson) చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టుకు ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ డీల్ దాదాపు ఖరారైతే, రాజస్థాన్ జట్టుకు కొత్త కెప్టెన్‌ను ఎన్నుకోవడం తప్పదు. ఈ కెప్టెన్సీ రేసులో సీనియర్లలో ఎవరూ లేకపోగా, ముగ్గురు భారతీయ యువ తారల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే, చాలా మంది ఊహించినట్లుగా నిలకడగా జట్టులో కొనసాగుతున్న రియాన్ పరాగ్ (Riyan Parag) కాకుండా, ధ్రువ్ జురేల్ (Dhruv Jurel) లేదా యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)లలో ఒకరు రాజస్థాన్ పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని నివేదికలు వినిపిస్తున్నాయి.
సంజూ శాంసన్ నిష్క్రమించిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ పగ్గాలు చేపట్టడానికి ఎక్కువ అవకాశాలున్న ఆటగాడు ధ్రువ్ జురేల్. ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన కారణాలు ఓసారి చూద్దాం. .
జైస్వాల్ లేదా రియాన్ పరాగ్‌తో పోలిస్తే, జురేల్‌కు నాయకత్వ అనుభవం కొద్దిగా ఉంది. అతను గతంలో 2020 అండర్-19 ప్రపంచకప్‌లో భారత జట్టుకు వైస్-కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ ఏడాది అతన్ని ఇండియా ‘A’ వైస్-కెప్టెన్‌గా, సెంట్రల్ జోన్‌కు కెప్టెన్‌గా కూడా నియమించారు. రాజస్థాన్ యాజమాన్యం జురేల్‌పై అపారమైన విశ్వాసం ఉంచింది. అతన్ని రూ. 14 కోట్ల భారీ ధరకు రిటైన్ చేసుకోవడం, జట్టులో అతని స్థానం పటిష్టంగా ఉండటాన్ని సూచిస్తుంది. జురేల్ వికెట్ కీపర్‌గా ఉండటం వల్ల, ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నియమం అతనికి అడ్డంకి కాదు. జట్టులో అతన్ని కచ్చితంగా 11 మందిలో కొనసాగించాల్సి ఉంటుంది. కెప్టెన్‌గా ఇది ఒక సానుకూల అంశం. ఇటీవల ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో జురేల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతని ఇటీవలి ప్రదర్శనలు అతని ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచాయి.
భారత ఓపెనర్‌గా దూసుకుపోతున్న యశస్వి జైస్వాల్ పేరు కూడా కెప్టెన్సీ చర్చలో ఉంది. రాజస్థాన్ క్రికెట్ డైరెక్టర్ కుమార్ సంగక్కర, ఇంగ్లాండ్‌లో ఉన్న సమయంలో జురేల్, జైస్వాల్ ఇద్దరికీ భవిష్యత్తులో కెప్టెన్సీ బాధ్యతలకు సిద్ధంగా ఉండాలని సూచించినట్లు నివేదిక పేర్కొంది. జైస్వాల్ ఒక స్పెషలిస్ట్ ఓపెనర్ కాబట్టి, ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నియమం కారణంగా కొన్నిసార్లు బౌలర్ కోసం అతన్ని సబ్‌స్టిట్యూట్ చేయాల్సి వచ్చే అవకాశం ఉంది. అందుకే కెప్టెన్సీ రేసులో అతను జురేల్ కంటే కాస్త వెనుకబడ్డాడు.
రియాన్ పరాగ్‌ను రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ బలంగా సమర్థిస్తున్నప్పటికీ, కెప్టెన్సీ రేసులో మాత్రం పరాగ్ పేరు లేదని తాజా నివేదిక స్పష్టం చేసింది. గత సీజన్‌లో సంజూ శాంసన్ గాయపడినప్పుడు పరాగ్ ఎనిమిది మ్యాచ్‌లకు నాయకత్వం వహించినా, కేవలం రెండు మ్యాచ్‌లలోనే విజయం సాధించగలిగాడు. ఈ నేపథ్యం, కెప్టెన్సీ పాత్రకు అతన్ని దూరం చేసింది.
మొత్తం మీద, ఐపీఎల్ 2026 మినీ వేలం నాటికి సంజూ శాంసన్ ట్రేడ్ కనుక ఖరారైతే, రాజస్థాన్ రాయల్స్ జట్టు తన భవిష్యత్తు నాయకత్వాన్ని ధ్రువ్ జురేల్ లేదా యశస్వి జైస్వాల్ వంటి యువ భారతీయ ప్రతిభావంతులకు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..