BCCI : టీమిండియాకు భారీ షాక్.. నాలుగో టెస్టుకు ఇద్దరు కీలక ప్లేయర్లు ఔట్.. బీసీసీఐ కొత్త స్క్వాడ్ ప్రకటన!

ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టుకు ముందు నితీష్ కుమార్ రెడ్డి, అర్షదీప్ సింగ్ గాయాల కారణంగా జట్టు నుంచి తప్పుకున్నారు. అన్షుల్ కంబోజ్‌కు అవకాశం లభించగా, రిషబ్ పంత్ కేవలం బ్యాట్స్‌మెన్‌గా ఆడనున్నాడు. ఈ మార్పులతో కూడిన బీసీసీఐ అప్‌డేటెడ్ స్క్వాడ్ వివరాలను తెలుసుకుందాం.

BCCI : టీమిండియాకు భారీ షాక్.. నాలుగో టెస్టుకు ఇద్దరు కీలక ప్లేయర్లు ఔట్.. బీసీసీఐ కొత్త స్క్వాడ్ ప్రకటన!
Indian Test Squad

Updated on: Jul 21, 2025 | 2:18 PM

BCCI : ఇంగ్లాండ్‌తో జరగనున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి, పేసర్ అర్షదీప్ సింగ్ ఈ మ్యాచ్ నుంచి తప్పుకున్నారు. నితీష్ కుమార్ రెడ్డి ఎడమ మోకాలి గాయం కారణంగా మిగిలిన రెండు టెస్టు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. అతను త్వరలోనే స్వదేశానికి తిరిగి రానున్నట్లు బీసీసీఐ తెలిపింది. బీసీసీఐ ఇచ్చిన సమాచారం ప్రకారం, బెకెన్‌హ్యామ్‌లో జరిగిన ట్రైనింగ్ సమయంలో నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్నప్పుడు అర్షదీప్ సింగ్ ఎడమ చేతి బొటనవేలికి గాయమైంది. దీంతో అతను మాంచెస్టర్‌లో జరగనున్న ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్ట్ మ్యాచ్ నుంచి తప్పుకోనున్నాడు. దీనితో ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో జరగనున్న కీలక టెస్ట్ మ్యాచ్‌లో అర్షదీప్ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి ఆడడం లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

టీమిండియాను గాయాల బెడద వెంటాడుతోంది. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ చూపుడు వేలికి గాయం చేసుకున్నాడు. బంతిని పట్టుకునే ప్రయత్నంలో పంత్‌కు గాయమైంది. దీంతో అతను తదుపరి మ్యాచ్‌లో కేవలం బ్యాట్స్‌మెన్‌గా మాత్రమే బరిలోకి దిగనున్నాడు. అంటే మాంచెస్టర్‌లో టీమిండియా తరఫున ధ్రువ్ జురెల్ లేదా కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించే అవకాశం ఉంది. అలాగే, లార్డ్స్ టెస్ట్ మ్యాచ్ నాల్గవ రోజు ఆటలో టీమిండియా పేసర్ ఆకాష్ దీప్ తొడ కండరాల నొప్పితో బాధపడ్డాడు. ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్న అతనికి కూడా నాలుగో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది.

నితీష్ కుమార్ రెడ్డి, అర్షదీప్ సింగ్ గాయపడడంతో టీమిండియా యువ పేసర్ అన్షుల్ కంబోజ్ ను ఇంగ్లాండ్‌కు పిలిపించింది. గతంలో ఇండియా ‘ఏ’ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన కంబోజ్, ప్రథమ శ్రేణి క్రికెట్‌లో 41 ఇన్నింగ్స్‌లలో మొత్తం 79 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండుసార్లు 5 వికెట్ల ప్రదర్శన కూడా ఉంది. ఈ అద్భుతమైన ప్రదర్శనతో 24 ఏళ్ల అన్షుల్ కంబోజ్‌కు భారత టెస్ట్ జట్టులో స్థానం లభించింది.

భారత టెస్ట్ జట్టు (అప్‌డేటెడ్ స్క్వాడ్):
శుభ్​మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరణ్, కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్​ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, అన్షుల్ కంబోజ్.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి