
ఫిబ్రవరి 29 నుంచి న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఈలోగా న్యూజిలాండ్‌కు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు దిగ్గజ బౌలర్ నీల్ వాగ్నర్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ తక్షణమే రిటైర్ అవుతున్నట్టు ప్రకటించాడు. దీంతో ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగే టెస్ట్ సిరీస్‌లో ఇకపై వాగ్నర్ కనిపించడు. అతడు చివరిసారిగా న్యూజిలాండ్ తరపున ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఆడిన సంగతి తెలిసిందే. 2012లో వెస్టిండీస్‌పై అంతర్జాతీయ కెరీర్‌ని ప్రారంభించిన 37 ఏళ్ల నీల్ వాగ్నర్ మొత్తంగా 64 టెస్టులు ఆడాడు. ఇందులో 27.57 సగటుతో 260 వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్ తరఫున టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఐదో బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.
ఇక వాగ్నర్ ఆడిన 64 టెస్టుల్లో.. 32 మ్యాచ్‌లకు కివీస్ విజయం సాధించింది. ఆ మ్యాచ్‌ల్లో 22 సగటుతో 143 వికెట్లు తీశాడు వాగ్నర్. మరోవైపు న్యూజిలాండ్ తరపున ఏ వన్డే, టీ20ల్లో ప్రాతినిధ్యం వహించలేదు వాగ్నర్. కెరీర్ మొదట్లో అతడు తన స్థానాన్ని జట్టులో సుస్థిరం చేసుకునేందుకు చాలా కష్టపడ్డాడు. కానీ 2014లో ఆక్లాండ్‌లో భారత్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌తో సీన్ మొత్తం మారిపోయింది. ఆ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియాపై నీల్ వాగ్నర్ 126 పరుగులకు 8 వికెట్లు తీశాడు. రెండు ఇన్నింగ్స్‌లలోనూ నాలుగేసి వికెట్లు తీసి.. జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. 2017లో ఒకే ఇన్నింగ్స్‌లో 39 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు నీల్ వాగ్నర్. ఇదే టెస్టుల్లో అతడి అత్యుత్తమ ప్రదర్శన. ఈ టెస్టు కూడా వెల్లింగ్టన్‌లో జరిగింది.
దక్షిణాఫ్రికాలో జన్మించిన నీల్ వాగ్నర్ 2008లో న్యూజిలాండ్‌కు షిఫ్ట్ అయ్యాడు. అక్కడ అతడు ఒటాగో తరపున డొమెస్టిక్ క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్, లిస్టు-ఏ క్రికెట్ మొదలగు.. అంతర్జాతీయ టెస్టులతో కలిపి మొత్తంగా 12 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌ను కొనసాగించాడు నీల్ వాగ్నర్. న్యూజిలాండ్ జట్టు అందుకున్న ఎన్నో చిరస్మరణీయ విజయాలలో కీలక పాత్ర పోషించాడు. కాగా, వాగ్నర్ నిష్క్రమణతో కివీస్ జట్టు టెస్టుల్లో కీలక బౌలర్‌ను కోల్పోయిందనే చెప్పాలి.
ఇది చదవండి: ఈ ఏజ్‌లోనూ అదేం కొట్టుడు బాసూ! 10 సిక్సర్లతో యూనివర్స్ బాస్ ఊహకందని ఊచకోత.. ఓ లుక్కేయండి..