WPL 2026:16 ఫోర్లు, ఒక సిక్సర్..డబ్ల్యూపీఎల్ రికార్డులన్నీ బద్దలు కొట్టిన ముంబై ఇండియన్స్ ప్లేయర్

Nat Sciver Brunt : జనవరి 26న గణతంత్ర దినోత్సవం రోజున జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగింది. ముంబై ఇన్నింగ్స్ మొత్తం నెట్ సైవర్ బ్రంట్ చుట్టూనే తిరిగింది. కేవలం 57 బంతుల్లోనే 16 ఫోర్లు, ఒక కళ్లు చెదిరే సిక్సర్‌తో 100 పరుగులు పూర్తి చేసి అజేయంగా నిలిచింది.

WPL 2026:16 ఫోర్లు, ఒక సిక్సర్..డబ్ల్యూపీఎల్ రికార్డులన్నీ బద్దలు కొట్టిన ముంబై ఇండియన్స్ ప్లేయర్
Nat Sciver Brunt

Updated on: Jan 27, 2026 | 9:06 AM

WPL 2026:మహిళల క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‎లో ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ ప్లేయర్ నెట్ సైవర్ బ్రంట్ విధ్వంసం సృష్టించింది. వడోదరలోని కోటాంబి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో బ్రంట్ అజేయ సెంచరీతో చెలరేగి, డబ్ల్యూపీఎల్ చరిత్రలోనే తొలి సెంచరీ నమోదు చేసిన క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది.

జనవరి 26న గణతంత్ర దినోత్సవం రోజున జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగింది. ముంబై ఇన్నింగ్స్ మొత్తం నెట్ సైవర్ బ్రంట్ చుట్టూనే తిరిగింది. కేవలం 57 బంతుల్లోనే 16 ఫోర్లు, ఒక కళ్లు చెదిరే సిక్సర్‌తో 100 పరుగులు పూర్తి చేసి అజేయంగా నిలిచింది. 2023లో డబ్ల్యూపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరూ సెంచరీ మార్కును అందుకోలేదు. సోఫీ డివైన్, జార్జియా వోల్ వంటి వారు 99 పరుగుల వద్దే ఆగిపోగా, ఆ కోరికను నెట్ సైవర్ బ్రంట్ తీర్చి చరిత్ర సృష్టించింది.

ముంబై ఇండియన్స్ భారీ స్కోరు

ఓపెనర్ హేలీ మాథ్యూస్ (39 బంతుల్లో 56) అద్భుతమైన ఆరంభాన్ని ఇవ్వగా, బ్రంట్ దాన్ని భారీ స్కోరుగా మార్చింది. వీరిద్దరి ధాటికి ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో లారెన్ బెల్ 2 వికెట్లు తీసినప్పటికీ పరుగులను కట్టడి చేయలేకపోయింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 20 పరుగులకే అవుట్ అయినా, బ్రంట్ విధ్వంసం ముందు అది పెద్దగా ప్రభావం చూపలేదు.

అంతర్జాతీయ కెరీర్‌లోనూ రారాజు

నెట్ సైవర్ బ్రంట్ కేవలం లీగ్ క్రికెట్‌లోనే కాదు, ఇంగ్లాండ్ తరపున అంతర్జాతీయ క్రికెట్‌లోనూ తిరుగులేని రికార్డులు కలిగి ఉంది. ఇప్పటివరకు ఆమె 12 టెస్టులు (883 పరుగులు), 129 వన్డేలు (4354 పరుగులు, 88 వికెట్లు), 137 టీ20లు (2960 పరుగులు, 90 వికెట్లు) ఆడింది. ఆమెకున్న ఈ అపారమైన అనుభవమే డబ్ల్యూపీఎల్‌లో ఈ చారిత్రాత్మక సెంచరీ సాధించడానికి తోడ్పడింది.

డబ్ల్యూపీఎల్ టాప్ స్కోరర్లు (గత రికార్డులు):

నెట్ సైవర్ బ్రంట్ (ముంబై): 100* (2026)

జార్జియా వోల్ (యూపీ): 99* (2025)

సోఫీ డివైన్ (ఆర్సీబీ): 99 (2026)

స్మృతి మంధాన (ఆర్సీబీ): 96 (2026)

హర్మన్‌ప్రీత్ కౌర్ (ముంబై): 95* (2024)

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..