
ఆసియా కప్ ఫైనల్‌లో టీమిండియా చేతుల్లో ఘోర పరాజయాన్ని ఎదుర్కుంది పాకిస్తాన్. అయితే ఫైనల్ గెలిచినా.. ఏసీసీ చీఫ్ చేతులపై ట్రోఫీ అందుకునేందుకు టీమిండియా నిరాకరించిన సంగతి తెలిసిందే. దీనికి కారణం లేకపోలేదు. ఏసీసీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ.. ఇటీవల భారత్, ఆపరేషన్ సింధూర్‌పై కాంట్రవర్సీ కామెంట్స్ చేశాడు. ఇంతటి వివాదానికి కారణమైన నఖ్వీ.. ఇప్పుడు సొంత దేశంలోనే విమర్శలు ఎదుర్కుంటున్నాడు. అలాగే అతడ్ని పదవి నుంచి తొలగిస్తారని కూడా సమాచారం.
సెప్టెంబర్ 28న జరిగిన ఆసియా కప్ ఫైనల్లో భారత్ చేతిలో ఓటమి తర్వాత పాకిస్తాన్ అభిమానులు.. తమ దేశ ఆటతీరుపై మండిపడుతున్నారు. కెప్టెన్ సల్మాన్ అఘా, జట్టులోని చాలా మంది ఆటగాళ్లతో పాటు, వారి పేలవమైన ప్రదర్శనపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక PCB, ACC ఛైర్మన్‌గా ఉన్న నఖ్వీ పాకిస్తాన్ ప్రభుత్వంలో కీలక మంత్రి పదవి బాధ్యతలు చేపడుతున్నాడని తెలిసిందే.
ఇమ్రాన్ ఖాన్ పార్టీ అయిన పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) నాయకులు నఖ్వీ పాకిస్తాన్ క్రికెట్‌ను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. అతడిని తొలగించాలని డిమాండ్ చేశారు. పాక్ వరుస పేలవ ప్రదర్శనల కారణం అతడేనని.. మంచి ఆటతీరు కనబరిచే ఆటగాళ్ళను జట్టులోకి తీసుకోవడం అటుంచితే.. జట్టుతో రాజకీయం చేస్తున్నాడని మండిపడ్డారు. మరి చూడాలి.? నఖ్వీ తన పదవిని కాపాడుకోగలడో.? లేదో.?
ఇక ఆసియా కప్ ట్రోఫీ ప్రస్తుతం ఏసీసీ హెడ్ క్వార్టర్స్‌లో లేదని.. చైర్మన్ నఖ్వీ తన కస్టడీలోనే ఉంచుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దీనిని బీసీసీఐ సెక్రటరీ సైకియా తీవ్రంగా పరిగణించారు. ఇవాళ దుబాయ్‌లో జరగనున్న ఏసీసీ యాన్యువల్ జనరల్ మీటింగ్‌లో ఈ అంశాన్ని లేవనెత్తేందుకు బోర్డు సిద్దమవుతున్నట్టు సమాచారం. కాగా, ప్రత్యేక ప్రజెంటేషన్ సెర్మనీకి అంగీకరిస్తేనే ట్రోఫీ, మెడల్స్ ఇస్తానని నఖ్వీ కండీషన్ పెట్టినట్టు సమాచారం.